ఎక్కడైనా మూడో మాట లేదని చెబుతారు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఒక్కటి వద్దు…మూడు ముద్దు అని పదేపదే తేల్చి చెబు తోంది. ఎవరెన్ని అనుకున్నా, అంటున్నా తన అభిప్రాయంలో మార్పు లేదని జగన్ సర్కార్ పెద్దలు తేల్చి చెబుతున్నారు. పైగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో తిరుగులేని విజయాలను అధికార పార్టీ సొంతం చేసుకున్న నేపథ్యంలో, తమ నిర్ణయాలకు ప్రజామోదం లభించినట్టేనని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల విషయమై వైసీపీ ముందడుగు వేసేందుకు తహతహలాడుతోంది. పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. దీంతో మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రాజమహేంద్రవరంలో బొత్స పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే కోర్టులను ఒప్పించి, మెప్పించి రాజధానులను తరలిస్తామని ఆయన చెప్పడం గమనార్హం.
గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం, గ్రేటర్ విశాఖలో వైసీపీ విజయంతో మూడు రాజధా నులకు ప్రజామోదం లభించినట్టేనని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా చెబుతుండడం విశేషం.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రజలే అంగీకరిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ను ఎలా తప్పు పడుతామని ప్రశ్నించడం విశేషం. అలాగే ఎన్నికల ప్రచారంలో విజయవాడ, గుంటూరులలో వైసీపీని గెలిపిస్తే ….రాజధాని తరలింపునకు ఆమోదం తెలిపినట్టేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
బొత్స మాటలు వింటుంటే… మూడు రాజధానులకు ప్రజాకోర్టులో ఆమోదం లభించిందని, ఇక కోర్డుల్లో మాత్రమే మిగిలి ఉందనే అర్థం ధ్వనిస్తోంది. కోర్టుల్లో కూడా అంగీకారం లభించగానే ఏ క్షణమైన విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా ఉంది. విశాఖకు ఎగిరిపోయేందుకు జగన్ సర్కార్ సమయం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది.