కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో కేరళ హైకోర్టులో దాఖలైన పిటిషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పిటిషన్ చాలా విచిత్రంగా ఉంది. అయితే జంతు ప్రేమికులు మాత్రం ఆ మాత్రం చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయానికి వద్దాం.
కరోనా ఎఫెక్ట్‌తో దేశమంతా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో చాలా ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. తన పెంపుడు పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇప్పించాలని కేరళ హైకోర్టులో ఎన్.ప్రకాశ్ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ ప్రకాశ్ కొచ్చి నివాసి. అతను మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు.
లాక్డౌన్ నేపథ్యంలో పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 4న ఆన్లైన్లో పోలీసులకు అప్లికేషన్ పెట్టాడు. తాను శాఖహారినని, అయితే తన పిల్లులకు మియో పెర్సియన్ బిస్కెట్లు ఇష్టమని, వాటిని ఇంట్లో తయారు చేయలేని పేర్కొన్నాడు. కావున వాటిని కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
అయితే ప్రకాశ్ వినతి అత్యవసరమైంది కాదని భావించిన పోలీసులు ఆయనకు పాస్ ఇవ్వలేదు. దీంతో ప్రకాశ్‌కు కోపం వచ్చింది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో అతను పిటిషన్ వేశాడు. జంతు హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం పెంపుడు జంతువులకు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నాడు. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.