ఒమిక్రాన్.. సోకిన వారి ల‌క్ష‌ణాలు ఇవే

క‌రోనాలోని ఇది వ‌ర‌క‌టి వేరియెంట్ల‌తో పోలిస్తే ద‌క్షిణాఫ్రికాలో డిటెక్ట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఈ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచం అల‌ర్ట్ అవుతోంది. ఈ వేరియెంట్…

క‌రోనాలోని ఇది వ‌ర‌క‌టి వేరియెంట్ల‌తో పోలిస్తే ద‌క్షిణాఫ్రికాలో డిటెక్ట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఈ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచం అల‌ర్ట్ అవుతోంది. ఈ వేరియెంట్ కేసులు గుర్తించిన దేశాల‌తో విమాన సంబంధాల‌ను అపేసుకుంటున్నాయి వివిధ దేశాలు. ఈ కొత్త వేరియంట్ తో క‌రోనా కేసుల సంఖ్య ఏ స్థాయికి వెళ్తుందో అనే ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. 

కేసుల సంఖ్య ఇప్పుడు పెద్ద‌ది కాదు. వైర‌స్ ప్ర‌భావం ఎలాంటిది? అనేదే కీల‌క‌మైన అంశం. ఇప్ప‌టికే ప్రపంచంలోని వివిధ దేశాలు విప‌రీత స్థాయిలో రోజువారీ కేసుల‌ను చూశాయి. ఇండియాలో కూడా అధికారికంగా న‌మోదైన కేసుల‌తో పోలిస్తే.. అన‌ధికారికంగా కేసుల సంఖ్య ఇంకా ఎంతో ఎక్కువ ఉండ‌వ‌చ్చ‌నే అంచ‌నాలే ఉన్నాయి. వివిధ స‌ర్వేలు అదే మాటే చెప్పాయి. ఈ నేప‌థ్యంలో వైర‌స్ లోని కొత్త ర‌కం.. వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి? అనేదే కీల‌కంగా ప‌రిగ‌ణించాల్సిన అంశం.

దీనిపై ద‌క్షిణాఫ్రిక‌న్ వైద్య ప‌రిశోధ‌కులు స్పందన స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఉంది. ఒమిక్రాన్ వేరియెంట్ క‌రోనా సోకిన పేషెంట్ల‌ను ట్రీట్ చేసిన వైద్యులు ఈ అంశంపై స్పందిస్తూ….  ఈ ర‌కం క‌రోనా రోగుల్లో విప‌రీత‌మైన అల‌స‌ట ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అలాగే కండ‌రాల నొప్పులు మైల్డ్ గా ఉండ‌వ‌చ్చ‌న్నారు. ఇక గొంతు నొప్పి, డ్రై కాఫ్ కూడా ఉంటాయ‌న్నారు. ఈ ల‌క్ష‌ణాలు అన్నీ ఇది వ‌ర‌కూ క‌రోనా కు గురైన వారిలో ఉన్న‌వే. 

గొంతు నొప్పితో మొద‌లుకావ‌డం, నిల‌బ‌డ‌లేనంత అల‌స‌ట‌, క‌నీసం స్నానం చేసేంత సేపు కూడా నిల‌బ‌డ‌లేక‌పోవ‌డం, విప‌రీత‌మైన బాడీ పెయిన్స్, ఆ త‌ర్వాత జ్వ‌రం రెండు మూడు రోజులు.. అంత‌లోనే రుచి, వాస‌న పోవ‌డం.. ఆ పై ఊప‌రితిత్తుల‌పై ప్ర‌భావం, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పై ప్ర‌భావం.. వంటివి క‌రోనా సోకిన వారికి ప‌రంప‌ర‌లా సాగాయి. 

నూటికి 98 శాతం మంది పై ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొని కోలుకున్నారు భార‌త‌దేశంలో. అయితే ఒక‌రిద్ద‌రు మాత్రం ఈ త‌ర‌హా సింప్ట‌మ్స్ తోనే ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోవ‌డం, ఆల్రెడీ ఉన్న ఆనారోగ్య స‌మ‌స్య‌లు వంటివి తీవ్రం కావ‌డంతో.. కొంత‌మంది మ‌ర‌ణించ‌డం కూడా జ‌రిగింది. 

ఒమిక్రాన్ పేషెంట్ల విష‌యంలో.. అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను 'మైల్డ్' అని అంటున్నారు ద‌క్షిణాఫ్రిక‌న్ వైద్యులు. ఈ త‌ర‌హా క‌రోనా వైర‌స్ సోకిన వారిలో చాలా మంది హాస్పిట‌లైజ్ కూడా కాలేద‌ని వారు వివ‌రిస్తున్నారు. ప‌ది రోజుల పాటు ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, ఆ త‌ర్వాత వారు కోలుకున్నార‌ని అంటున్నారు. స్థూలంగా ఈ కొత్త వేరియెంట్ సోకినా.. భ‌యంక‌ర‌మైన జ‌బ్బు సోకిన‌ట్టుగా ఏమీ ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ పేషెంట్ల‌ను ట్రీట్ చేసిన డాక్ట‌ర్లు అంటున్నారు. 

క‌రోనాకు సంబంధించి వ్యాక్సినేష‌న్ చేయించుకోని వారికి కూడా కొంద‌రికి ఒమిక్రాన్ సోకింద‌ట‌. వారిలో కూడా మైల్డ్ సింప్ట‌మ్సే క‌నిపించాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు.. ఒమిక్రాన్ కేసులు వివిధ దేశాల్లో ఇప్ప‌టికే ఉండ‌వ‌చ్చ‌ని కూడా వారు అంటున్నారు. ఈ వైర‌స్ ద‌క్షిణాఫ్రికాలోనే జ‌నించింద‌ని చెప్ప‌లేమ‌ని, అక్క‌డ డిటెక్ట్ అయ్యింద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.