ఏడు ల‌క్ష‌ల కేసుల్లో ఒమిక్రాన్ 4003!

దేశంలో ప్ర‌స్తుతం యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌ల పైకి చేరింది. గ‌త వారం రోజులుగా విప‌రీత స్థాయిలో పెరిగిన రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ఫ‌లితంగా.. యాక్టివ్ కేసుల లోడు ఏడు…

దేశంలో ప్ర‌స్తుతం యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌ల పైకి చేరింది. గ‌త వారం రోజులుగా విప‌రీత స్థాయిలో పెరిగిన రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ఫ‌లితంగా.. యాక్టివ్ కేసుల లోడు ఏడు ల‌క్ష‌ల‌ను దాటేసింది. తొలి రెండు క‌రోనా వేవ్ ల‌తో పోలిస్తే.. ఇది చాలా చాలా వేగం! రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌న్న‌ర పై స్థాయిలో ఉంది. ఈ నేప‌థ్యంలో.. రెండో వేవ్ తో పోల్చినా కేసుల సంఖ్య భారీగా న‌మోద‌వుతుందేమో అనే ఆందోళ‌న వ్య‌క్తం అవుతూ ఉంది.

ఒక‌వైపు క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నా.. లాక్ డౌన్ల ఆలోచ‌న లేద‌ని వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. నైట్ క‌ర్ఫ్యూలు, ఓ మోస్త‌రు ఆంక్ష‌లు ఉంటాయి త‌ప్ప‌… లాక్ డౌన్ ఉండ‌ద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, కేర‌ళ.. మొద‌టి రెండు వేవ్ ల‌లో భారీగా కేసులు వ‌చ్చిన ప్రాంతాలివి. ఇప్పుడు మూడో వేవ్ లో కూడా ఇవే ముందు వ‌ర‌స‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం!

ఈ సంగ‌తంతా అలా ఉంటే.. ఈ వేవ్ కు కార‌ణం అని అంటున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల నిర్ధార‌ణ మాత్రం చాలా ప‌రిమిత స్థాయిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎంత విచిత్రం అంటే.. యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌ల‌కు పైనే ఉన్నా, వీటిల్లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు మాత్రం కేవ‌లం నాలుగు వేలేన‌ట‌! 

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లోని విష‌యం ఇది. ఇండియాలో ఒమిక్రాన్ వేరియెంట్ వ‌ల్ల థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌న్న ఊహాగానాలు కావొచ్చు, అంచ‌నాల‌కు కావొచ్చు, భిన్నంగా ఉంది ప‌రిస్థితి. ఏడు ల‌క్ష‌ల క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఒమిక్రాన్ వాటా కేవ‌లం నాలుగు వేలే అంటే.. ఈ మూడో వేవ్ కు కార‌ణం ఒమిక్రాన్ కాద‌నే అనుకోవాలేమో! అయితే నిర్దార‌ణ అవుతున్న క‌రోనా కేసులకు కార‌ణం ఏ వేరియెంట్ అనే ప‌రిశోధ‌న పూర్తి స్థాయిలో జ‌రుగుతోందో లేదో తేలిక‌గా అర్థం కాదు. 

క‌రోనా పాజిటివా కాదా.. అనే టెస్టు వేగంగా జరుగుతోందిప్పుడు. అయితే ఏ వేరియెంట్ క‌రోనా సోకుతోందో అనే వేరే టెస్టు కాబ‌ట్టి.. ఏడు ల‌క్ష‌ల కేసుల్లో ఏ వేరియెంట్ ఎక్కువ ప్ర‌భావం చూపుతోంద‌నేది అంత తేలిక‌గా తేలే అంశం కాక‌పోవ‌చ్చు. ఒమిక్రానే సోకుతుంటే.. ప్ర‌భావం త‌క్కువ అనే విశ్లేష‌ణ‌లున్నాయి. అయితే ఇప్పుడు మొత్తం కేసుల్లో  అధికారికంగా ఒమిక్రాన్ వాటా అత్యంత స్వ‌ల్పం కాబ‌ట్టి..  ఈ అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. మ‌రి అదెప్ప‌టికి జ‌రిగేనో!