ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కావాలనే ప్రత్యర్థుల ఆశ ఫలిస్తుందా? లేదా? అనేది నేడు తేలనుంది. వైఎస్ జగన్‌ను ఎలాగైనా జైలుకు పంపితే తప్ప తమకు ఉనికి లేదనే ఆందోళన ప్రత్యర్థుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ బెయిల్ పిటిషన్‌లో ట్విస్ట్ ఏంటంటే… జగన్‌పై కేసు పెట్టిన సీబీఐకి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచక్షణకే సీబీఐ వదిలేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పిండం గమనార్హం.
మరోవైపు బ్యాంకులను బురిడీ కొట్టించారని ఇదే రఘురామపై సీబీఐ కేసు నమోదు చేసింది. అలాంటి రఘురామ ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకెక్కడంలో ఉన్న దురుద్దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి రఘురామ తీసుకెళ్లారు. అలాగే ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని తన పిటిషన్‌లో రఘురామ పేర్కొనడాన్ని గమనించొచ్చు.
ఒకవేళ ఇవే అభ్యంతరాలను సీబీఐ వ్యక్తం చేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. సీబీఐకి లేని అభ్యంతరం, ఆసక్తి రఘురామకు ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.