ఉమ్మడి ఏపీ విభజన జరిగిన తరువాత ఇక తెలంగాణా పని అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని అందరూ అనుకున్నారు. తెలంగాణాకు చెందిన చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏపీ -తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాదులో స్థిరపడిన వారు చాలామంది ఆంధ్రాలో స్థలాలు కొనుక్కున్నారు. ఏపీకి పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా తరలివస్తాయని అనుకున్నారు. కానీ అనుకున్నవేమీ జరగలేదు.
మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావొచ్చు, మలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావొచ్చు వీరిద్దరూ అనుసరించిన విధానాలు, చేసిన రాజకీయాల కారణంగా ఈరోజు ఏపీ అన్ని రంగాల్లో దుస్థితిని ఎదుర్కొంటోంది. ఏపీకి ఇప్పటివరకు అధికారికంగా రాజధాని లేదంటే ఆ పాపం ఎవరిదని చెప్పాలి? రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా ? మూడు రాజధానులు ఉండాలా ? అనే మీమాంసలో రాష్ట్రం నలిగిపోతోంది.
అమరావతే రాజధానిగా ఉండాలంటూ ఒక పక్క ఉద్యమం సాగుతుండగా, మూడు రాజధానులు కావాలంటూ మరో పక్క ఉద్యమం చేస్తున్నారు. వీటిల్లో నిజమైన ఉద్యమం ఏదీ అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం రాదు. అమరావతి చంద్రబాబు జరిపిస్తున్న స్పాన్సర్డ్ ఉద్యమం అని కొందరు అంటుంటే, మూడు రాజధానుల ఉద్యమం సీఎం జగన్ నడిపిస్తున్నారని కొందరు అంటున్నారు. ఒక్క రాజధాని ఉండటమే కరెక్టు అనేది కొందరి ఆలోచనైతే, మూడు రాజధానులతో కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయని మరో ఆలోచన.
ఒక్క రాజధాని అయినా, మూడు రాజధానులైనా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ముందు పాలకులకు ఉండాలి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వనరులున్నాయో గుర్తించి వాటిని సమర్ధంగా ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆలోచించాలి. ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలో ఆలోచించాలి.
1956 నుంచి ఉమ్మడి ఏపీని పాలించిన వారంతా హైదరాబాద్ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టారు తప్ప తెలంగాణలో, ఆంధ్రాలో ఏ జిల్లాలను పెద్దగా అభివృద్ధి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే వచ్చారు. వారంతా హైదరాబాదును ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించారు తప్ప జిల్లాల గురించి, రాయలసీమ గురించి పట్టించుకోలేదు.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న చాలా తెలంగాణా జిల్లాలు రాష్ట్రం విడిపోయాక బాగా అభివృద్ధి చెందాయి. జిల్లాల రూపురేఖలు మారిపోయాయి. గతంలో లేని అనేక ఆధునిక సౌకర్యాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పడ్డాయి. ఆంధ్రాలో ఇలా ఎందుకు జరగడంలేదు ? రాష్ట్రానికి ఒక రాజధానా ? మూడు రాజధానులా అనేది తేలితేనే అభివృద్ధి మొదలవుతుందా ? రాజధాని అనేది తేలకపోతే రాష్ట్రాన్ని పాడుబెట్టాల్సిందేనా ?
టీడీపీ -వైసీపీ దిక్కుమాలిన రాజకీయాలకు రాష్ట్రం బలికావాల్సిందేనా? ఆంధ్రాలోని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాదులో వ్యాపారం చేస్తున్నారు. చాలామంది హైదరాబాదులోనే పరిశ్రమలు పెడుతున్నారు. యువత ఉద్యోగాల కోసం హైదరాబాదుకు వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఆంధ్రాకు రాజధాని లేదు. ఎలాంటి అభివృద్ధి లేదు.
ఇక ఏపీ రాజకీయ నాయకుల్లో సగం మంది హైదరాబాదులోనే ఉంటున్నారు. వాళ్ళ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. ఆంధ్రా వెళితే సుఖంగా బతకలేమనే అభిప్రాయం హైదరాబాదులో ఉంటున్న సగటు ఏపీ ప్రజల్లో ఉంది. ఆంధ్రాలోనూ సుఖంగా బతకగలమనే భరోసాను పాలకులు ఎప్పుడు కల్పిస్తారు ?