ఇప్పుడంతా లాక్ డౌన్ టైమ్ నడుస్తోంది. జనాలు బయటకు రావడం తగ్గించారు. దీంతో అన్నీ హోం డెలివరీ కిందకు మారిపోయాయి. చివరికి వ్యభిచారం కూడా హోమ్ డెలివరీ అయిపోతోంది. ఏకంగా యాప్ క్రియేట్ చేసి, ఫోన్ నంబర్ వెరిఫై చేసి మరీ ఇళ్లకు అమ్మాయిల్ని పంపిస్తున్నారు. పేమెంట్స్ కూడా ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. ఇలా గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ లెవెల్లో జరుగుతున్న వ్యభిచార ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
చిలకలూరిపేటకు చెందిన వంశీ రెడ్డి, విజయవాడకు చెందిన ఓ మహిళ, చిన్న అనే మరో వ్యక్తి కలిసి చిన్న ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లకు అమ్మాయిల్ని సప్లయ్ చేసే గ్యాంగ్ తో పరిచయం ఏర్పడింది. దీంతో వీళ్లు కోల్ కతా నుంచి నలుగురు అమ్మాయిల్ని, విజయవాడ నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లోని ఓ అద్దె ఇంట్లో ఉంచారు.
సోషల్ మీడియాతో పాటు, మరికొన్ని డేటింగ్ సైట్స్ లో వీళ్ల ఫొటోలు పెట్టి విటుల్ని ఆకర్షించారు. ఫోన్ చేసిన తర్వాత కూడా కట్ చేసి, వాళ్ల ఫోన్ నంబర్ ను ట్రూ కాలర్ ద్వారా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అమ్మాయిల్ని పంపించేవారు. పేమెంట్ కూడా ఆన్ లైన్ లోనే తీసుకునేవారు.
ఇలా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు రట్టుచేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ తో సంబంధం లేని ఓ సిమ్ కార్డ్ ద్వారా ఫోన్ చేశారు. నిర్వహకులు అడిగినట్టు పేమెంట్ కూడా ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. కొన్ని గంటలకే అమ్మాయిలు ఆటోలో చెప్పిన అడ్రెస్ వద్ద వాలిపోయారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కోల్ కతాకు చెందిన నలుగురు అమ్మాయిల్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు.. కీలకవ్యక్తి వంశీరెడ్డిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న మరో మహిళ, చిన్నా పరారయ్యారు.