అమెరికాలో చదివేస్తే ఉద్యోగాలు రావట్లేదు

అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అంటారు- “అవకాశాల భూమి” అన్నమట.  Advertisement కానీ ఆ “అవకాశాలు” మొన్నటి వరకు అక్కడ ల్యాండైన వాళ్లకి కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం కోట్లల్లో ఫీజులు మూటకట్టే అమెరికన్…

అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అంటారు- “అవకాశాల భూమి” అన్నమట. 

కానీ ఆ “అవకాశాలు” మొన్నటి వరకు అక్కడ ల్యాండైన వాళ్లకి కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం కోట్లల్లో ఫీజులు మూటకట్టే అమెరికన్ విశ్వవిద్యాలయాలకి తప్ప “అవకాశాలు” ఎవరికీ రావట్లేదు. 

ఉన్నత చదువులు నెపంతో మనవాళ్లు అమెరికాకి వెళ్తున్నా అంతిమలక్ష్యం అక్కడ ఉద్యోగం సంపాదించడమే కదా! ఎంతమంది ఇండియన్స్ కేవలం చదువుకోసం వెళ్లి తిరిగి వచ్చేద్దామనుకుంటున్నారు చెప్పండి! 

చుట్టాల్నో, కజిన్స్ నో చూసి తాము కూడా అలా అమెరికా వెళ్లి మెరుగైన జీవితం జీవించాలని అనుకోవడం సహజం. ఆ కంపారిజనే ఏటేటా మనవాళ్లని అమెరికా ఊరిస్తూ పిలుస్తోంది. కానీ దూరపుకొండలు నునుపు అనేది వెళ్తే కానీ అర్ధం కాదు. ఒక్కప్పటి పరిస్థితి సరే, ఇప్పుడు మాత్రం దారుణంగా ఉంది. 

ఒక్కసారి గణాంకాలు చూడండి. 

ఏడాదికి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాకి వెళ్తున్నారు. ఈ లెక్కన రానున్న పదేళ్లల్లో పది లక్షలమందో అంతకంటే ఎక్కువో అవుతారు. కానీ లెక్కలు చూస్తే చూస్తే, గత ఐదేళ్ళల్లో అమెరికా ప్రభుత్వం హెచ్1బి వీసా ఇష్యూ చేసింది మాత్రం కేవలం 2 లక్షల మందికే. ఇదే లెక్క రానున్న ఐదేళ్లల్లో కొనసాగినా హెచ్1బి రాకుండా మిగిలిపోయే విద్యార్థులు ఎంతమందుంటారో లెక్కేసుకోండి. ప్రతి సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అవుతూ హెచ్ 1బి రానివాళ్లు 8 లక్షల మందికి పైచిలుకు తేలతారు. వాళ్లంతా ఏమవ్వాలి? అయితే మరొక కోర్సుకి ఫీజు కట్టి విద్యార్థులుగా కొనసాగాలి. లేదా రిసెషన్ వల్ల ఉద్యోగాలు రావట్లేదాని చెప్పి ఇండియాకి తిరుగుటప్పా కట్టేయాలి. కనుక దీనికి ప్రిపేరైతేనే అమెరికా గురించి ఆలోచించాలి. 

ఉద్యోగావకాశాలు మాత్రం అమెరికాలో బాగా సన్నగిల్లాయి. మరింత సన్నగిల్లుతాయి. ఎక్కడికక్కడ కాష్ట్ కటింగ్ పేరుతో ఉన్న ఉద్యోగుల్నే పీకేస్తున్నాయి అమెరికా కంపెనీలు. ఇంక కొత్తవాళ్లకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? 

ఉన్నవాటిల్లో కూడా కాంట్రాక్ట్ జాబుల్ని పక్కదోవ పట్టిస్తూ కొన్ని కన్సల్టెన్సీలు తెలివైన విద్యార్థుల్ని, డబ్బిచ్చి ప్రాక్సీల్ని పెట్టమనే విద్యార్థుల్ని వాడుకుని మేసేస్తున్నారు. దీని మీద ఇప్పటికే గ్రేట్ ఆంధ్రా పలు వ్యాసాలు ప్రచురించింది.

అమెరికన్ డిగ్రీ ఉంటే అక్కడే ఉద్యోగమొస్తుందని అమాయకంగా అమెరికాలో దిగిన యావరేజ్, అబోవ్ ఏవరేజ్ విద్యార్థులు మాత్రం భంగపడాల్సిందే. 

ఒక ఎబోవ్ ఏవరేజ్ విద్యార్థి కథ చూద్దాం. తాను 1400 ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకుంటే మూడంటే మూడే కంపెనీల నుంచి పిలుపులొచ్చాయట. వాటిలో ఒక్కొక్క ఉద్యోగానికి సగటున 120 మంది పోటీ పడ్డారట. అంటే సుమారు 360 మందికి పిలుపొస్తే అందులో ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ఈ ఎబోవ్ ఏవరేజ్ విద్యార్థికి ఆ మూడింటిలో ఏ ఉద్యోగమూ రాలేదు. 

ఇంతోటి దానికి అమెరికాలో చదువు కోసం తలతాకట్టు పెట్టి స్వదేశంలోని డబ్బుని దేశం దాటించాలా? కాని పనికోసం అలవికాని ఆశతో, అమాయకత్వంతో ఎంత తప్పు జరుగుతోంది? 

పైగా అమెరికన్ యూనివర్సిటీలన్నీ గొప్పవి కాదు. టాప్ 200 యూనివెర్సిటీస్ ని తీసేస్తే ఆ కిందకి వెళ్లే కొద్దీ అమాంబాపతువే కనిపిస్తాయి. డబ్బిస్తే క్లాసులకి కూడా అటెండ్ అవ్వక్కర్లేకుండా ప్రాక్సీ అటెండెన్స్ వేసేస్తాయి. ఇంకాస్త డబ్బిస్తే పరీక్ష రాయకుండా సర్టిఫికేట్ కూడా చేతిలో పెట్టేసేవి ఉన్నాయి. వాటి వ్యవహారం అక్కడ ఉద్యోగాలిచ్చే కంపీనీలన్నింటికీ తెలుసు. ఆ డిగ్రీ పట్టుకుని అప్లై చేస్తే అసలు పిలుపులే రావు. అలాంతి యూనివర్సీటీల్లో శ్రద్ధగా చదివినా, చదవకపోయినా ఒకటే. 

అమెరికాలో డాలర్లు సంపాదిస్తే జీవితం మారిపోతుందనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యపడదు. “పర్చేసింగ్ పవర్ ప్యారిటీ” అనేది ఒకటుంటుంది. 

ఉదాహరణకి అమెరికాలో కూర్చుని డాలర్ల రూపంలో రూ 1 కోటి రూపాయలు (సుమారు 1 లక్షా 20 వేల డాలర్లు)సంపాదించినా, ఇండియాలో కూర్చుని రూ 24 లక్షలు సంపాదించినా ఒకటే. అక్కడి ఖర్చులు అలా ఉంటాయి. ఏడాదికొకసారో, మూడేళ్లకొకసారో ఫ్యామిలీతో ఇండియా ట్రిప్ వేస్తే చాలు కష్టపడి కూడ బెట్టింది గరిష్టంగా కరిగిపోతుంది. పిల్లలు స్కూల్లో ఉన్నంతవరకు ఫ్రీ ఎడ్యుకేషనే కాబట్టి బాగానే ఉంటుంది. ఒక్కసారి కాలేజీకొస్తే ఆస్తులు కరుగుతాయి. ఇవన్నీ తెలిసిన వాళ్లు కొత్తగా అమెరికా వస్తున్న జనాల్ని చూసి నవ్వుకోవడమో, జాలిపడడమో చేస్తున్నారు తప్ప గొప్పగా మాత్రం ఊహించుకోవడంలేదు.

సగటున రూ 2 లక్షలు సంపాదిస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇండియాలో బోలెడంత మంది ఉన్నారు. ఒక్క ఐటీ అనే కాదు, రూ 2 లక్షల పైన నెలకి సంపాదిస్తున్న జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, టీచింగ్ ఫాకల్టీ ఎంతమంది ఉన్నారో మన చుట్టూ చూస్తే కనిపిస్తారు. 

ఇవన్నీ కాకుండా రోడ్డు పక్కన బండి పెట్టుకుని బజ్జీలు వేసుకునే అతన్ని మాటల్లో పెట్టి అడగండి. అతను చెప్పే దాన్ని బట్టి నెలకి రూ 1 లక్ష – 2 లక్షలకి పైగా సంపాదిస్తున్నాడని తెలియొచ్చు. ఆమాత్రం సంపాదించాలంటే స్వదేశంలోనే లక్ష మార్గాలున్నాయి. 

ఇదిలా ఉంటే అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి వేచి చేస్తున్నవాళ్లలో 4 లక్షల మంది అసలా కార్డు అందుకోకుండానే జీవితం చాలించేలా ఉన్నారట. అంటే జీవితకాలం దాటినా కూడా వచ్చే వీల్లేనంత కాంపిటీషన్ ఉందని అర్ధం. 

రేపు ట్రంప్ పార్టీ మళ్లీ పవర్లోకొస్తే తమ జాతీయవాదంతో  పరిస్థితిని మరీ జటిలం చేస్తాడు. ట్రంప్ కాకుండా ఏ రిపబ్లికన్ అభ్యర్థి నెగ్గినా పరిస్థితి అంతే. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ వాళ్లు డెమోక్రటిక్ పార్టీ బాపతు కాదు. అప్పట్లో ట్రంప్ పాలనలో వీసాలు రాక చాలా ఇబ్బందులు పడ్డారు మైగ్రెంట్ విద్యార్థులు. 

ఇంకో ఏడాదిలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్లీ రిపబ్లికన్ పార్టీ పవర్లోకొస్తుందని ఘంటాపథంగా అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు తాకట్టుపెట్టి, అప్పులు చేసి అమెరికా వచ్చే మధ్యతరగతి విద్యార్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. తీసుకున్న స్టడీ లోన్ ని ఉద్యోగమొచ్చాక తీర్చేయవచ్చన్న లెక్కలో ఉంటారు పాపం. కానీ “ఉద్యోగమే రాకపోతే”..అనే ఆలోచన చేయరు. ఆ ఆలోచన కచ్చితంగా చెయ్యాల్సిన సమయం ఇది. 

అమెరికాకి కేవలం మోజు కోసం, చదువు కోసం అంటే రావొచ్చు. ఉద్యోగం కోసమనుకుంటే మాత్రం అసలటు చూడకపోవడమే మంచిది. ప్రతిభతో మంచి ఐటీ జాబ్ పట్టుకుని తర్వాత ఆన్సైట్ మీద కంపెనీ ఖర్చులతో వచ్చి అమెరికా కలని సాకారం చేసుకునే మార్గం లేకపోలేదు. ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. 

కనుక, అవకాశాల విషయంగా అమెరికా అనేది ఆరిపోయిన లేదా ఆరిపోబోతున్న దీపం అని కొత్త విద్యార్థులు తెలుసుకోవాలి. స్వదేశంలో ఏం చేయొచ్చో ఆలోచించాలి. కాదు కూడదు..ప్రపంచాన్ని ఏలడానికే పుట్టామనుకుంటే అమెరికాకా కాకుండా కెనెడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రయత్నించాలి. అలాగని ఆ దేశాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని కాదు. ఉన్నంతలో అమెరికాలోని అనిశ్చితికంటే నయమే అనిపించవచ్చు. 

హరగోపాల్ సూరపనేని