Advertisement

Advertisement


Home > Politics - Opinion

పీడకలలు అవుతున్న అమెరికా స్వప్నాలు

పీడకలలు అవుతున్న అమెరికా స్వప్నాలు

దాదాపు ప్రతి మధ్యతరగతి తెలుగు కుటుంబానికి ఒకటే కల... తమ పిల్లల్ని అమెరికా పంపాలని. వారిని తమకన్నా ఎంతో ఉన్నతి స్థితిలో చూడాలని. దాని కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసో, బ్యాంక్ లోన్ తీసుకునో, ఇల్లు తాకట్టు పెట్టో పై చదువులకి అమెరికాకి పంపిస్తుంటారు మన వాళ్లు. 

అలా వెళ్లిన పిల్లలు అక్కడ చదువు పూర్తవగానే అక్కడే ఉద్యోగాలు కూడా సంపాదించేస్తారని వీళ్ల ఆలోచన. అసలు అమెరికాకి పంపడం అనేది అక్కడ పిల్లలు ఉద్యోగాలతో సెటిలవ్వడం చూడాలనే తప్ప కేవలం చదువుకుని వెనక్కొస్తారని మాత్రం కాదు. 

చాలా కాలం వరకు ఈ కోరికలు బాగానే తీరేవి. వీసా రావాలే కానీ, అమెరికాలో చదవడం, అక్కడే ఉద్యోగం..అన్నీ సజావుగా జరిగిపోయేవి. కానీ ఇప్పుడలా లేదు. అమెరికాలో ఉన్న ఉద్యోగావకాశాలకి, చదువుకోవడానికని అక్కడ ల్యాండవుతున్న విద్యార్థుల సంఖ్యకి ఏమాత్రం పొంతన ఉండట్లేదు. పదిమందిలో ఒకరికి ఉద్యోగమొస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. మిగిలిన వాళ్లు వెనక్కి రావడమో, ఉద్యొగమొచ్చిందని తల్లిదండ్రులకి అబద్ధం చెప్పి అక్కడే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉండిపోవడమో ఆల్రెడీ జరుగుతోంది. 

అయినా పర్లేదు..పోటీలో నిలబడి లక్ పరీక్షించుకుందామనుకుంటే ఇప్పుడు కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. అసలు అక్కడ చదువు పూర్తయ్యేవరకూ అయినా సేఫ్ గా ఉంటారా అనే అనుమానాలొస్తున్నాయి. అమెరికాలో క్రైం అంతలా పెరిగిపోయింది. గన్-కల్చర్, డ్రగ్స్, రోడ్ యాక్సిడెంట్లు, సైబర్ నేరాలు, ఇల్లీగల్ ట్రాప్ లు..ఇలా అన్నీ భారతీయ విద్యార్థులని చుట్టు ముట్టేస్తున్నాయి. 

అమెరికాలో మగ్గింగులు కామనే...అదే.. ఎదురుపడి తుపాకి నెత్తికి గురిపెట్టి ఉన్నదంతా దోచుకోవడం. అయితే అలాంటివి జరగడానికి కొన్ని ఏరియాలుండేవి. అటు వెళ్లకుండా ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడలా కాదు. ఎక్కడికైనా ఎవడైనా వచ్చి ఉన్మాదంగా కాల్పులు జరపొచ్చు. డ్రగ్స్ మత్తులో పాశవికంగా ప్రవర్తించవచ్చు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యే లోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయి. 

ఇక్కడ విద్యార్థులనే కాదు..జనరల్ గా ప్రజలందరికీ భయాలున్నాయి. అయితే విద్యార్థులు కొన్నింటికి సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నారు. 

ముఖ్యంగా అమెరికా అనగానే చాలా సేఫ్ దేశమని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తారని, హైటెక్ పోలీసులుంటారని అనుకోవడం సహజం. ఆ ధైర్యంతోటే అమెరికాకి వచ్చిన విద్యార్థులు కాస్తంత ఏమరుపాటుగా రోడ్ల మీద నడవచ్చు. కానీ పొంచుకొచ్చే ప్రమాదాలు కార్ల రూపంలో వస్తున్నాయి. ఈ మధ్యన జాహ్నవి కందుల అనే తెలుగమ్మాయిని ఒక పోలీస్ ఆఫీసరే తన కారుతో వేగంగా వెళుతూ గుద్ది చంపేసాడు. కనీసం పశ్చాత్తపం కూడా పడలేదు. ఆ వీడియో వైరల్ కూడా అయింది. 

చాక్లెట్లు అమ్ముతున్నట్టుగా డ్రగ్స్ అమ్ముతున్నారు అమెరికాలో. సాధారణంగా డ్రగ్స్ అనేవి పొడర్ గానో, సిగిరెట్లుగానో మాత్రమే ఉంటాయనుకుంటారు చాలామంది. కానీ అచ్చుగుద్దినట్టు అందమైన ర్యాపర్లో, మంచి బ్రాండ్ నేం తో చాక్లెట్లలాగ ఉంటున్నాయి. డ్రగ్స్ లీగల్ కాబట్టి బహిరంగంగానే వాటిని షాపుల్లో అమ్ముతుంటే ట్రై చేయడం అసలేమీ తప్పే లేదన్నట్టుగా అనిపిస్తుంది వాతావరణం. 

విద్యార్థులకి సరదాగా ట్రై చేయాలనిపించి ఒక చక్లెట్ మొత్తాన్ని నోట్లో వెసుకుంటే అది అధిక డోస్ అవ్వొచ్చు. వెంటనే ఎటువంటి తేడా అనిపించకపోవచ్చు. ఏమీ అనిపించట్లేదని మరొక చాక్లెట్ కూడా నమలొచ్చు... ఫలితంగా అత్యధిక డోస్ ప్రభావం ఏ గంతన్నర తర్వాతో శరీరం మీద పడి చనిపోతున్నారు కూడా. ఈ రకమైన కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. 

ఏ పక్కనుంచి ఎవడు కారుతో గుద్దుతాడో, ఎవడు మగ్గింగ్ చేస్తాడో, ఎవడు గన్ ఓపెన్ చేసి కాలుస్తాడో అనే భయాలు పెరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా సైబర్ నేరాలకి కూడా భారతీయ విద్యార్థులని టార్గెట్స్ గా వాడుతున్నారు. 

కొందరు నేరగాళ్లు అమెరికాలోని కొంతమంది అమ్మాయిలని ఎంచుకుంటున్నారు. వాళ్ల మూవ్మెంట్స్ అన్నీ గమనిస్తున్నారు. ఒక రోజు కాల్ చేసి వాళ్ల వివరాలన్నీ ఫోన్లో చెప్పి చంపుతామని బెదిరిస్తున్నారు. ఎవరికన్నా చెప్పినా కూడా చంపుతామంటున్నారు. ఫోన్ హ్యాక్ చేసామని ఎవరికి మెసేజ్ చేసినా కూడా తమకి తెలిసిపోతుందని నమ్మబలుకుతున్నారు. సహజంగానే అమ్మాయిలు ఇలాంటివాటికి భయపడతారు. 

చంపకుండా వదిలేయాలంటే ఇంత డబ్బునో, కొన్ని షాపింగ్ వోచర్స్ నో వెంటనే తీసుకొచ్చి ఫలానా చోట డస్ట్ బిన్ లో వేయమంటున్నారు. అలా వేసిన సొమ్మునో, సరుకునో, వోచర్నో పట్టుకురమ్మని భారతీయ విద్యార్థులని వాడుతున్నారు. 

తాము చేస్తున్నది క్రైం అన్న విషయం తెలియకో, కేవలం సాయం చేస్తున్నామనుకునో, డబ్బుకి ఆశ పడో, లేక భయపడో ఆ పని చేసి క్రైములో విద్యార్థులు కూడా భాగమవుతున్నారు. పోలీసులు ఎంటరయ్యి ఈ కేసుని చేధించే క్రమంలో క్రైములో కొరియర్స్ గా వీళ్లు దొరుకుతున్నారు. ఇంకేముంది!! దేశం కాని దేశంలో కఠినమైన జైలు శిక్ష ఖారారు. 

ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్న కొందరు వ్యక్తులు జాగ్రత్తగా ఉండనీయకుండా ప్రమాదాల్లోకి, నేరాల్లోకి లాగుతున్నారు. 

"ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఇక్కడే సెటిలైన మన తెలుగు వాళ్లనే నమ్ముకుని బతుకుదామన్నా వీళ్లల్లో కూడా కొందరు దొంగ వెధవలు ఉంటున్నారు. పర్వాలేదని చెప్పి కొన్ని పనులు చేయిస్తారు. చేసాక చాలా కాలానికి కానీ తెలియట్లేదు చేసింది క్రైం అని. నావరకు ఇక్కడ సెటిలవ్వాలని లేదు. నాన్న ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపారు. ఎలాగో అలా చదువు పూర్తి చేసుకుని ఇండియా వెళ్లిపోయి అక్కడే జాబ్ చేసుకుంటూ ఆ లోన్ తీర్చుకుంటాను. అమెరికా అంటే నాకు మోహం పోయి భయం మిగిలింది" అని చెప్తున్నాడు నితిన్ కుమార్ అనే హైదరాబాద్ నుంచి వచ్చి కాలిఫొర్నియాలో చదువుతున్న విద్యార్థి. 

ఇదిలా ఉంటే, శ్రేయాస్ రెడ్డి అనే 19 ఏళ్ల విద్యార్థి న్యూయార్కులో అనుమానస్పదస్థితిలో చనిపోయి కనిపించాడు. శ్రీయా అవసరాల అనే విద్యార్థిని కార్ యాక్సిడెంటులో జార్జియాలో చనిపోయింది. అచ్యుత్ అనే మరొక విద్యార్థి న్యూయార్కులో బైక్ యాక్సిడెంట్లో మరణించాడు. 

"నేను ఎన్నో ఆశలతో ఇక్కడికొచ్చాను. కానీ పరిస్థితుల్ని చూస్తుంటే భయమేస్తోంది. చదువుపై ఫోకస్ చేయలేకపోతున్నాను", అని రాహుల్ శర్మ అనే విద్యార్థి చెప్పాడు. 

జి.కృష్ణా రెడ్డి అనే మరొక విద్యార్థి, "యాక్సిడెంట్లు మాత్రం దారుణంగా జరుగుతున్నాయి. నా ఫ్రెండ్ ఒకమ్మాయిని కార్ గుద్దేసింది. బతికింది కానీ పెద్ద ప్రమాదమే" అని చెప్పాడు. 

వైష్ణవిరావు అనే అమ్మాయి,"నేను ప్రతి రోజు ఇంటికి ఫోన్ చేస్తున్నాను. నాకు, అమ్మానాన్నలకి కూడా మనశ్శాంతిగా లేదు. చదువుకని వచ్చాము కానీ అసలు సేఫ్టీయే ఇప్పుడు ప్రయారిటీ అవుతోంది", అని చెప్పింది. 

ఎలా చూసుకున్నా పిల్లల్ని అమెరికా పంపితే పెద్ద ఘనకార్యం చేసామనన్న ఫీలింగులోంచి ఇండియాలోని తల్లిదండ్రులు బయటికి రావాలి. ప్రతి తల్లితండ్రులకి తమ పిల్లలు బుద్ధిమంతులుగానే కనిపిస్తారు. కానీ ఆ టీనేజులో వారి బుద్ధి వారి మాటే వినకపోవచ్చు. డ్రగ్స్ రుచి చూడాలనిపించవచ్చు, ఎవరి కారో ఎక్కి స్వేచ్ఛగా అమెరికా రోడ్ల మీద వేగంగా ప్రయాణం చేయాలనిపించవచ్చు, మంచిగా మాట్లాడుతున్న వారి మాటలు విని మోసపోవచ్చు, చేస్తున్నది క్రైం అని తెలియకుండా ఏ క్రైములోనో ఇరుక్కోవచ్చు, ఏ షాపింగో చేసి పొరపాటున బిల్ కట్టకపోయినా దొంగలుగా ముద్రపడి అరెస్టయ్యి ఊచలు లెక్కపెట్టొచ్చు...ఇలా అనేకం జరుగుతున్నాయి. 

ఈ మధ్యనే ఇద్దరు తెలుగుమ్మాయిలు ఒక షాపింగ్ మాల్లో  బిల్ కట్టకుండా పారిపోతున్నారని కేసు బిగించి అరెస్టు చేసారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ పిల్లలు ఏ వివరణ ఇస్తున్నా పోలీసులు వినలేదు. కోర్టులో చెప్పుకోండని చెప్పి చేతులు వెనక్కి పెట్టి సంకెళ్లు వేసి మరీ తీసుకుపోయారు. ఆ వీడియో వల్ల ఇండియాలో ఆ పిల్లల కుటుంబాలకి అప్రతిష్ట మిగిలింది. 

పైగా అమెరికాలో పొరపాటున కేసులో ఇరుక్కున్నా కూడా లాయర్ ని పెట్టుకోవాలంటే కోట్లు ఖర్చుపెట్టుకోవాలి. 

అమెరికా మునుపటిలా లేదన్నది మాత్రం సత్యం. ఎక్కడికక్కడ క్రైం పెరిగిపోయిందన్నది నిజం. డ్రగ్స్, గన్ కల్చర్ స్వైరవిహారం చేస్తున్నాయన్నది వాస్తవం. 

కనుక విచ్చలవిడిగా డబ్బుండి, నేరపూరితమైన వాతావరణమైనా సరే తమ పిల్లలకేం కాదులే అనే నమ్మకమున్నవారైతే పిల్లల్ని అమెరికాకి పంపొచ్చేమో తప్ప తక్కినవాళ్లు పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.

శ్రీనివాసమూర్తి

 


  • Advertisement
    
  • Advertisement