చంద్రబాబు కుప్పంలో వైకుంఠపాళి అనే పదాన్ని ఫ్లోలో వాడేసాడు. వైకుంఠపాళిలో పాములు, నిచ్చెనలు వుంటాయి. దీన్నే సింపుల్‌గా పిల్లలు పాముపటం ఆట అంటారు. జీవితం కూడా ఇదే ఆట. నిచ్చెనలు, పాములు వుంటాయి. కొందరికి మనం నిచ్చెనగా మారుతాం, పాముల్లా తినేస్తాం. మనకైనా కొందరంతే.
చంద్రబాబు గురించి మాట్లాడుకుందాం. పునర్విభజనలో చంద్రగిరి ఏర్పడడం బాబు మొదటి నిచ్చెన. రెడ్డి కాంగ్రెస్ వల్ల ఇందిరా కాంగ్రెస్‌కి డిమాండ్ తగ్గడం రెండో నిచ్చెన. రాజగోపాలనాయుడి అండతో టికెట్ దొరకడం మూడో నిచ్చెన. ఎక్కిన తర్వాత నిచ్చెనని పట్టించుకోకుండా ఇంకో నిచ్చెన వైపు చూడడం బాబు స్వభావం. అందుకే రాజగోపాలనాయుడిని వదిలేసి అంజయ్య అనే నిచ్చెనని పట్టుకుని మంత్రి అయ్యారు.
తరువాత ఆయనకి దొరికిన అతిపెద్ద నిచ్చెన NTR. ఆ నిచ్చెనని అతి తెలివితో రిజర్వ్‌లో పెట్టి 1983లో పాము నోట పడి ఓడిపోయాడు. వెంటనే తేరుకుని పాచికలు వేసి పార్టీలోకి వెళ్లి చక్రం తిప్పుతున్న ఉపేంద్ర, పెద్దల్లుడు దగ్గుబాటిని పాములతో కరిపించాడు.
పార్టీలో ఒక్కో నిచ్చెన వేసుకుంటూ ఎక్కాడు. తనకు నచ్చిన వాళ్లని నిచ్చెన ఎక్కించి మళ్లీ తోసేసాడు. పాముల బారిన పడి కిందికి వెళ్లిన వాళ్లు ఎందరో. చివరికి NTR వంతు వచ్చింది. వూళ్లన్ని తిరిగి అధికారంలోకి వచ్చానని అనుకున్నాడు కానీ అల్లుడే అరుకాషుడు (వైకుంఠపాళిలోని అతిపెద్ద పాము పేరు) అవుతాడని NTRకి తెలియదు. ఆటలో జారిన వాడు మళ్లీ లేవలేదు.
ప్రతి ఆటకి కొన్ని రూల్స్ వుంటాయి. ఏ రూల్ లేకుండా ఆడడమే బాబు ఆట. ఆయన గేమ్‌లో పాము తాడులా కనిపిస్తూ వుంటుంది. నిచ్చెనలు గాల్లో వుంటాయి. పాపం జూనియర్ NTR ఎక్కాలని ఆశ పడ్డాడు కానీ, అది లోకేష్ కోసం వేసిన నిచ్చెన అని తెలుసుకోలేక పోయాడు.
అరచేతిలో వైకుంఠపాళి చూపించగలిగిన బాబుకే వైకుంఠపాళి గురించి మాట్లాడే అర్హత వుంది.
జీఆర్ మహర్షి