వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అహంపై తీవ్ర దెబ్బ పడింది. ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీలో 13వ వార్డు ఉప ఎన్నికను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని బొక్కబోర్లా పడ్డారు. శివప్రసాద్‌రెడ్డి తాను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అనేలా వ్యవహరిస్తుండడమే ఆయనపై ప్రజావ్యతిరేకతకు దారి తీస్తోందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.
శివప్రసాద్‌రెడ్డి తన మూలాల్ని విస్మరించి, ప్రొద్దుటూరులో మరొకరి ఉనికి లేకుండా చేయాలనే అహంభావంతో వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకునే పరిస్థితి వచ్చింది. దీని ఫలితమే కొత్తపల్లె పంచాయతీలోని 13వ వార్డులో ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థికి పరాజయం అని జనం చర్చించుకుంటున్నారు. నిజానికి 13వ వార్డులో ఓడింది ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థి కాదు, స్వయాన ఆయనే అని టాక్.
కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని అణచివేయాలని ఎమ్మెల్యే భావించడమే ఆయన పతనానికి దారి తీస్తోందన్న అభిప్రాయం బలంగా వుంది. శివచంద్రారెడ్డి ప్రత్యర్థి పార్టీ అయితే అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ కుటుంబానికి వీరాభిమాని. అతిపెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ నాయకుడు. గతంలో వైసీపీ నాయకుడు ఎంవీ రమణారెడ్డికి వ్యతిరేకంగా కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డిని ప్రోత్సహించారు.
గతంతో కొత్తపల్లె పంచాయతీలో డాక్టర్ ఎంవీ రమణారెడ్డి కోడలిపై శివచంద్రారెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ వైసీపీ నేతలే. ఎమ్మెల్యే రాచమల్లు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సింది పోయి… శివచంద్రారెడ్డికి బలపరిచి, ఆయనకు అన్ని రకాలుగా సాయం చేశారు. ఆ ఎన్నికల్లో శివచంద్రారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ బాగా పని చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో శివచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే కోపం పెంచుకున్నారు.
శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వార్డు సభ్యుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉసిగొల్పారు. పంచాయతీలో చేసే పనులకు బిల్లులు కాకుండా అడ్డుకున్నారు. దాదాపు 40 వేల ఓట్లున్న కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్‌ను ఎమ్మెల్యే వ్యతిరేకం చేసుకోవడం అంటే రాజకీయంగా ప్రమాదకరమైన ఆటకు శ్రీకారం చుట్టారనే విమర్శ బలంగా వినిపించింది. కొన్ని నెలల క్రితం వైసీపీ అధిష్టానం ఇద్దర్నీ పిలిపించి రాజీ చేసి పంపింది.
ఇది మూణ్నాళ్ల ముచ్చటైంది. శివచంద్రారెడ్డికి బద్ధ వ్యతిరేకుల్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీలోని 13వ వార్డు సభ్యుడు మురళీధర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. సర్పంచ్ శివచంద్రారెడ్డి తన కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డిని బరిలో నిలిపారు. మరోవైపు వైసీపీ మద్దతుదారుడిగా బ్రహ్మానందరెడ్డిని ఎమ్మెల్యే నిలబెట్టారు.
ఎన్నికల సమయంలో అందర్నీ కలుపుకుని పోవాల్సిన రాచమల్లు, ఆ పని చేయలేదు. తనకెవరూ ఎదురు ఉండకూడదని, ఒకవేళ వస్తే తన, పరాయి అనే తేడా లేకుండా ఓడించి తీరుతానని అహంకారంతో సర్పంచ్‌ను ఢీకొట్టేందుకు రాచమల్లు ఉత్సాహం చూపారు. సొంత పార్టీ సర్పంచ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం, ఓడించి తీరుతామని తన అనుచరులతో ఎమ్మెల్యే వార్నింగ్ ఇప్పించడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
దీంతో ఈ ఎన్నిక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వర్సెస్ కొత్తపల్లె సర్పంచ్‌గా మారింది. ఎమ్మెల్యే బామ్మర్ది, ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి కొత్తపల్లె పంచాయతీలో మకాం వేశారు. ఈయన గారికి పేరుకు తగ్గట్టే ప్రొద్దుటూరులో చాలా గొప్ప పేరు వుందని జనం చెబుతుంటారు. 13వ వార్డులోని 1,172 మంది ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ఇరువర్గాలు పూర్తిస్థాయిలో మోహరించాయి.
ఎమ్మెల్యే వర్గానికి అధికారం, అంగబలం తోడయ్యాయి. మరోవైపు ప్రజల ప్రేమను సర్పంచ్ నమ్ముకున్నారు. హోరాహోరీ పోరు జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపింది. ఓటుకు రూ.5 వేలు, రావని అనుకున్న చోట రూ.13 వేలు, అలాగే నాలుగు గ్రాముల బంగారు గొలుసు ఇచ్చారనే ప్రొద్దుటూరులో కథలుకథలుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేకు అయిన ఖర్చులో సగం ఖర్చు సర్పంచ్ శివచంద్రారెడ్డి పెట్టారు. దీంతో ఒక్క వార్డు కోసం ఇరువర్గాలు కలిసి సుమారు ఏడు లేదా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యినట్టు సమాచారం.
ప్రతిష్టాత్మక పోరులో ఎమ్మెల్యే మద్దతుదారుడిపై సర్పంచ్ కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి 48 ఓట్ల తేడాతో గెలుపొందడంతో రాచమల్లుకు బిగ్ షాక్ తగిలినట్టైంది. సర్పంచ్ కుమారుడిని గెలిపించాలనే తపన కంటే, ఎమ్మెల్యేనే ఓడించాలన్న పట్టుదల ఓటర్లలో కనిపించింది. ఎమ్మెల్యే మద్దతుదారుడు కేవం రాజకీయ ఆటలో అరటి పండు మాత్రమే. ఎమ్మెల్యే మొదట ప్రొద్దుటూరులో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. వరదరాజులరెడ్డి ఆయన్ను వైస్ చైర్మన్ చేసి ప్రోత్సహించారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదరాజులరెడ్డి ఐదుసార్లు గెలుపొందారు. రాచమల్లు ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరదరాజులరెడ్డి ఇప్పటికీ పెద్దాయనగా ఆ నియోజకవర్గ ప్రజలు గౌరవంగా పిలుచుకుంటారు. కానీ రెండు దఫాలకే రాచమల్లు అహంభావి అని నేరు తెచ్చుకున్నారు. ప్రొద్దుటూరులో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్యాదవ్తో ఆయనకు సరిపోదు. ఇలా ప్రత్యర్థులు, స్వపక్షం వారితోనూ నిత్యం రచ్చ పెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో గెలిచేదెట్టా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
సొంత పార్టీ నేతల అణచివేతకు వైసీపీ అధిష్టానం ఆశీస్సులు కూడా తోడు కావడం విమర్శలకు దారి తీసింది. ఇప్పటికైనా రాచమల్లు ప్రవర్తనలో మార్పు రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. కానీ ఓటమి తర్వాతైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ప్రజాదరణ నాయకులతో పేచీ పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోడానికి సిద్ధపడాల్సి వుంటుంది.
పీ.ఝాన్సీ