రామ‌మందిర‌మే బీజేపీని ర‌క్షించాలా!

ఇప్ప‌టికే యూపీ మీద దృష్టి పెట్టింద‌ట భార‌తీయ జ‌న‌తా పార్టీ. మొత్తం 80 లోక్ స‌భ సీట్లున్న యూపీలో త‌మ ప‌ర‌ప‌తి నిలిస్తేనే కేంద్రంలో మ‌రోసారి తాము అధికారం సంపాదించుగోల‌మ‌నే విష‌యం బీజేపీకి బాగానే…

ఇప్ప‌టికే యూపీ మీద దృష్టి పెట్టింద‌ట భార‌తీయ జ‌న‌తా పార్టీ. మొత్తం 80 లోక్ స‌భ సీట్లున్న యూపీలో త‌మ ప‌ర‌ప‌తి నిలిస్తేనే కేంద్రంలో మ‌రోసారి తాము అధికారం సంపాదించుగోల‌మ‌నే విష‌యం బీజేపీకి బాగానే అర్థ‌మైన‌ట్టుగా ఉంది. యూపీలోని 80 లోక్ స‌భ సీట్ల‌లో ప్ర‌తి మూడు నెల‌ల‌కూ ఇక నుంచి పూర్తి స్థాయిలో స‌ర్వేలు చేయించుకుంటుంద‌ట బీజేపీ. 

అక్క‌డ లోటుపాట్ల‌ను భ‌ర్తీ చేసుకుని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎలాగైనా ప‌ట్టు నిల‌పుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంద‌ని స‌మాచారం. 2014లో యూపీలో ఏకంగా 90 శాతం సీట్ల‌ను బీజేపీ గెలుచుకుంది. అయితే 2019 క‌ళ్లా దాని రేంజ్ కాస్త త‌గ్గింది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ కూట‌మికి 64 సీట్లు ద‌క్కాయి. ఇలా ఎనిమిది లోక్ స‌భ సీట్ల‌ను బీజేపీ కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ 80 శాతం సీట్లు ద‌క్కిన‌ట్టే. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచినా, మునుప‌టి జోరు లేదు.

ఇక ఇటీవ‌లి ప‌రిణామాలు బీజేపీ ప్ర‌తిష్ట‌ను అక్క‌డ దెబ్బ‌తీస్తున్నాయి. రెజ్ల‌ర్ల ఆందోళ‌న అంశాన్ని బీజేపీ చాలా లైట్ తీసుకుంటోంది కానీ, త‌ట‌స్తుల‌పై అది చాలా ప్ర‌భావాన్నే చూపుతూ ఉంది. అదే యూపీలో రౌడీల‌ను చాల్చిప‌డేస్తున్నామ‌న్న యోగి ప్ర‌భుత్వం, లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొంటున్న త‌మ పార్టీ ఎంపీ విష‌యంలో మాత్రం కిక్కుర‌మ‌న‌డం లేదు. ఆయ‌న ఎంపీ అయినా మోడీ స‌ర్కారు స్పందిస్తున్న తీరు ఏ మాత్రం స‌మ‌ర్థ‌నీయంగా లేదు. ఆ ఎంపీ కులానికో, బ‌లానికో భ‌య‌ప‌డి మోడీ స‌ర్కారు ఈ అంశంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోందేమో! ఇలాంటి ప్ర‌భావాలు వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్త ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశాలు లేక‌పోలేదు.

అన్నింటికీ మించి సామాన్యుల అతీగ‌తిని ప‌ట్టించుకోవ‌డం బీజేపీ త‌న ప‌ని కాద‌నుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. భార‌తీయుల స‌గ‌టు జీవితాల‌ను బీజేపీ అస‌లు ఖాత‌రు చేయ‌డం లేదు. ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై విముఖ‌త క‌నిపించింది. ఇక మ‌హారాష్ట్ర‌లో కూడా బీజేపీకి ఎదురుగాలే అనే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీనే ఇచ్చేలా ఉంది. 

కేర‌ళ‌, ఏపీ, త‌మిళ‌నాడుల్లో బీజేపీకేం లేదు. ఆపై తెలంగాణ‌లో కూడా గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కిన‌న్ని ఎంపీ సీట్లు ఈ సారి ద‌క్కుతాయ‌నేది సందేహంగానే మారుతోంది. క‌ర్ణాట‌క‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గిలిన ఎదురుదెబ్బ త‌ర్వాత తెలంగాణ‌లో బీజేపీ జోరు చాలా వ‌ర‌కూ త‌గ్గింది. బీజేపీని త‌ట్టుకుని తాము గెల‌వ‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ వాళ్ల‌కు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌లు సందేశాన్ని ఇవ్వ‌గ‌లిగారు. మొన్న‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ లో ఇలాంటి ఉత్సాహం ఏదీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ మార్పు క‌నిపిస్తూ ఉంది.

అయితే బీజేపీ ఆశ‌లు ఇప్పుడు ఒక అంశం మీదే  ఉన్నాయి. అదే అయోధ్య రామ‌మందిరం. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోపు ఆయోధ్య‌లో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసేసి, మోడీనే స్వ‌యంగా దాన్ని ప్రారంభించేస్తే ఇంకో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం గ్యారెంటీ అనేది బీజేపీ లెక్కలా ఉంది. పార్ల‌మెంట్ నూత‌న భ‌వ‌నాన్ని త‌నే స్వ‌యంగా ప్రారంభించిన రీతిలో మోడీ ఆయోధ్య‌లో కూడా త‌నే ఆల‌య ప్రారంభం చేయ‌వ‌చ్చు. త‌నే పెద్ద పూజారిగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఆయోధ్య‌లో ఆల‌య నిర్మాణం పూర్తి చేయ‌డం, యూపీలో గుళ్ల‌ను ఆధునీక‌రించ‌డం పూర్తి చేస్తే వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో లోక్ స‌భ సీట్ల విజ‌యంలో కీలక అంశాలు అవుతాయ‌ని క‌మ‌లం పార్టీ భావిస్తున్న‌ట్టుగా ఉంది.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌నే ముఖ్యమంత్రి అభ్య‌ర్థి అన్నట్టుగా మోడీ ప్ర‌చారం చేశారు. దాదాపు నెల రోజుల స‌మ‌యానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికే కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల‌తో క‌ర్ణాట‌క‌లో నెగ్గింద‌నేది కూడా శుద్ధ అబ‌ద్ధం. బీజేపీ అలాంటి హామీల‌ను బోలెడ‌న్ని ఇచ్చింది. క‌ర్ణాట‌క‌లో తమ‌కు అధికారం ఇస్తే ప్ర‌తి రోజూ అర‌లీట‌రు పాలు ఫ్రీ అనే వాగ్ధానం బీజేపీ మెనిఫెస్టో లోనిదే! దేశంలో ఏ రాజ‌కీయ పార్టీ హామీ ఇవని రీతిలో అలా పాలు ఫ్రీ అంటూ క‌మ‌లం పార్టీ హామీ ఇచ్చింది. 

అంతేకాదు.. ప్ర‌తియేటా మూడు సిలెండ‌ర్ల ఫ్రీ, అట‌ల్ క్యాంటీన్లు.. ఇలా క‌మ‌లం పార్టీ బోలెడ‌న్ని ఉచిత హామీల‌ను ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఉచిత హామీల క‌న్నా బీజేపీ ఉచిత హామీల జాబితానే పెద్ద‌ది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌న్న‌న పొంద‌లేదు బీజేపీ. ఇలా మోడీ అండ్ కో పై స్ప‌ష్ట‌మైన విముఖ‌త క‌నిపిస్తూ ఉంది. క‌ర్ణాట‌క అంటే నిస్సందేహంగా మినీ ఇండియానే.

మ‌రి ప‌దేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న మోడీపై ఇంకా అంచ‌నాలు ఏవీ మిగిలి లేవు. ఆయ‌న ఏదో అద్భుతం చేసేస్తాడ‌ని న‌మ్మే వాళ్ల సంఖ్య బాగా త‌గ్గింది. కేవ‌లం వీరాభిమానులు, భ‌క్తులు మాత్ర‌మే మిగిలారు. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య‌న హిందుత్వాదాన్ని ర‌గ‌ల్చే ప‌రిణామాలు ఎన్నిక‌ల ముందు సంభ‌విస్తే బీజేపీకి అది సానుకూల ప‌రిణామం కావొచ్చు. అందులో రామ‌మందిర ప్రారంభోత్స‌వం కీల‌క ఘ‌ట్టం కావొచ్చు. ఆర్థిక సామాజిక అంశాల సంగ‌తెలా ఉన్నా, దేశంలో స‌గ‌టు పౌరుడి ప‌రిస్థితి ఏమైనా.. రామమందిర‌మే బీజేపీ శ్రీరామ‌ర‌క్ష కావొచ్చు 2024 ఎన్నిక‌ల‌కు!

-హిమ‌