Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఆడుకుంటున్న బిజెపి

ఆడుకుంటున్న బిజెపి

మనల్ని ఆశ్రయించి వచ్చిన వారు చిత్తశుద్ధితోనూ, మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్న వారైతే వారికి సాయం చేయడం మన విధి. అలాకాకుండా, అవకాశవాదంతోనూ.. స్వార్థంతోనూ.. మనకున్న కీర్తి ప్రతిష్ఠలను తమ కుటిల ప్రయోజనాలకు వాడుకుని లబ్ధిపొందాలనే దురుద్దేశంతోనూ వచ్చిన వారైతే.. కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో వారికి తప్పనిసరిగా ఆశ్రయం ఇవ్వాల్సి వస్తే.. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏదో మొహమాటానికి, మొక్కుబడిగా మాత్రమే మనం వారికి విలువ ఇస్తాం. మనం తెలివైన వారమే అయితే గనుక.. మనల్ని బురిడీ కొట్టించి,  వారు నెరవేర్చుకోవాలనుకుంటున్న కుటిల ప్రయోజనాలను అనుమతించకుండా.. వారి నాటకాల్ని ముందే గమనించి.. వారితో ఆడుకోవడం ప్రారంభిస్తాం.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు తమతో ఎగబడి పొత్తులు పెట్టుకోవడానికి వెనుకగల ఆంతర్యం, వారి గతిలేనితనం స్పష్టంగా తెలిసిన మోడీ దళం తదనుగుణంగానే వ్యవహరిస్తున్నది. వారి పోకడలమీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఆడుకుంటున్న బిజెపి’!

రాజకీయం ఒక క్రీడ. వికృత క్రీడ. అన్ని ఆటల్లాంటిది కాదు. ఇక్కడ టీమ్‌లు కూడా స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తుంటాయి. రాజకీయాల్లో కూడా పార్టీలు జట్టు కడుతుంటాయి. కానీ జట్టుకు ఉండవలసిన స్ఫూర్తితో ఆట ఆడడం మాత్రం ఉండదు. ఎవరి స్వార్థ ప్రయోజనాలకోసం వారు మాత్రమే ఆడుతారు. ఫరెగ్జాంపుల్ ఫుట్ బాల్ ఉందనుకోండి. ఒక ఆటగాడు మంచి ఫామ్ లో గోల్స్ వేస్తూ ఉంటే.. మిగిలిన వాళ్లందరూ వాడికి పాస్ ఆన్ చేయడం మీదనే శ్రద్ధ పెడతారు.

అంతే తప్ప, తాము ఒక్కొక్కరుగా ఎన్నేసి గోల్స్ వేశామనే రికార్డు కోసం చూడరు. క్రికెట్ లో ఓ బ్యాటర్ మాంచి ఫామ్ లో ఉన్నాడనుకోండి. ఎక్కువగా అతనికి స్ట్రయికింగ్ ఇవ్వడానికే క్రీజులోని రెండో బ్యాటర్ చూస్తుంటాడు. అంతేతప్ప అతనికే బ్యాటింగ్ ఇస్తూ ఉంటే.. తనకు సెంచరీ దక్కేదెలా, తన స్కోరు రికార్డులు పెరిగేదెలా అని కక్కుర్తి పడడు.

కానీ రాజకీయం అలాంటి స్ఫూర్తి ఉన్న క్రీడ కానేకాదు. ఇక్కడ జట్టుగా ఉన్నా కూడా అందరూ స్వార్థం కోసం మాత్రమే ఆడతారు. ‘టీమ్ స్పిరిట్’ అనేది ఇక్కడ ఒక మిథ్య. ఈ సిద్ధాంతాన్ని బహుముఖాలుగా నిరూపిస్తున్నారు.. ఇప్పుడు ఏపీలో ఎన్డీయే జట్టుగా రూపొందిన వారిలోని తెలుగుదేశం మరియు జనసేన నాయకులు. జట్టు స్ఫూర్తిగురించి, ఓట్ల బదిలీ గురించి జగన్మోహన్ రెడ్డి సర్కారును కూలదోసి, కూటమి నెగ్గవలసిన అవసరం గురించి చంద్రబాబునాయుడు వంద రకాల సుద్దులు చెబుతారు. పార్టీల మధ్య ఓట్ల బదిలీ పద్ధతిగా జరగాలంటూ హితం చెబుతారు. కానీ.. వాస్తవంలోకి వచ్చేసరికి తన మిత్రపక్షాలకు మాత్రం తగిన విలువ ఇవ్వరు.

పవన్ కల్యాణ్ పొత్తుల గురించి ఆలోచించడానికి ఏడాది ముందునుంచే, చంద్రబాబునాయుడు ఆయన పట్ల తన వన్ సైడ్ లవ్ ను ప్రకటించుకుంటూ వచ్చారు. తీరా పవన్ పొత్తుల్లోకి దిగిన తర్వాత, భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులకు బలవంతంగా ఒప్పించిన తర్వాత.. తన నిజస్వరూపం చూపించారు. ఇద్దరికీ కలిపి కేవలం 30 సీట్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు ఉన్న జనాదరణ తనకు కావాలి. ఆయన కులం బలం తనకు కావాలి. కానీ ఆయనకు ఇచ్చే సీట్లు మాత్రం 21 దాటకూడదు. మోడీకి ఉన్న జనాదరణ తనకు కావాలి. రామాలయం తరువాత పెరిగిన బిజెపి గ్రాఫ్ తనకు ఉపయోగపడాలి. కానీ వారికి పదికి మించి ఇవ్వనే కూడదు. ఈ రాజకీయాన్ని ఏమంటారు? దీనిని జట్టు స్ఫూర్తి అనుకోవాలా? ఇదంతా కుట్ర కాదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

చంద్రబాబునాయుడు వ్యూహం ఒకటే. ఎన్నికల వేళ ఓట్ల బదిలీ అయ్యేలా, అందరి మీద ఆధారపడే సమరానికి దిగాలి. ఎన్నికల తర్వాత ఎవ్వరి మీదా ఆధారపడవలసిన అవసరం లేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు కావాలి. ప్రభుత్వంలో వారు కూడా ఉంటే ఉండవచ్చు గాక.. కానీ, మధ్యలో ఎప్పుడు కావలిస్తే అప్పుడు వారిని బయటకు గెంటేసినా కూడా తన ప్రభుత్వం కొనసాగాలి. అదే ఆయన కోరిక. అలాంటి కుటిల ఆలోచనతోనే ఆయన పొత్తులకు దిగారు. మరి ఆయన కుతంత్రాలను ఎవ్వరూ గుర్తించలేకుండా ఉంటారా?

రాజకీయం ఇంకా బొడ్డూడని పవన్ కల్యాణ్.. ఆయన వ్యూహాల్లోని మర్మాన్ని గుర్తించలేకపోవచ్చు గాక.. కానీ ఎంతో ముదిరిపోయిన కమలనాయకులు గుర్తించలేరా? వారు సరిగానే గుర్తించారు. పొత్తుల్లోకి దిగిన తర్వాత ఇప్పుడు తమ ఆటేమిటో తాము చూపిస్తున్నారు. మొక్కుబడిగా మాత్రమే బిజెపి ఏపీ రాజకీయాల్లో సమరాంగణంలో ఉంది. 

చిలకలూరిపేట సభతో బిజెపి ‘ఆట’ స్పష్టం!

పొత్తులు కుదిరిన తర్వాత తొలి భారీ ఎన్నికల ప్రచార సభ అంటూ చిలకలూరి పేటలో ఎన్డీయే కూటమి ఒక హంగామా సృష్టించింది. చంద్రబాబు, పవన్ లతో పాటు నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. కానీ ఆయన ప్రసంగం తర్వాత.. ఆ ఇద్దరు నాయకులూ హతాశులయ్యారు. నరేంద్రమోడీ ఏ రాష్ట్రంలో మాట్లాడినా.. అక్కడి తమ ప్రత్యర్థులను ఏ రేంజిలో ఉతికి ఆరేస్తారో అందరికీ తెలుసు.

కవితాత్మకమైన, సొగసైన హిందీ భాషా పటిమతో ఆయన ప్రత్యర్థులను దునుమాడే తీరు చూడముచ్చటగా ఉంటుందని వారికి తెలుసు. కానీ.. చిలకలూరిపేట సభలో ఎంతసేపూ ‘400 సీట్లు గెలవాలి’ అనే పాట పాడారు తప్ప.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తమకు ప్రత్యర్థిగా ఆయన భావిస్తున్న సూచన కూడా కనిపించలేదు. ప్రసంగం మొత్తంలో ఒకేసారి జగన్ పేరు ప్రస్తావిస్తే, అది కూడా, ఆయన అసలు ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్ ను దెప్పి పొడవడానికి మాత్రమే.

తెలంగాణ వంటిచోట్ల మోడీ ప్రసంగిస్తే.. కేసీఆర్ మీద ఎలా సెటైర్లు విసురుతారో, నిప్పులు చెరగుతారో ఈ ఉభయులకూ తెలుసు. కానీ చిలకలూరి పేటలో జగన్ ను ఆయన పల్లెత్తు మాట అనకపోయే సరికి వారు హతాశులయ్యారు. ఈ సభ ద్వారా ఒక్క విషయం స్పష్టమైంది. నరేంద్రమోడీని ప్రభావితం చేయడం అనేది చంద్రబాబుకు చేతకాని పని. ప్రభావితం కాదు కదా.. కనీసం ఆయన ద్వారా ఏ ఒక్క కోరికను కూడా ఆయన నెరవేర్చుకోలేరు!! గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నరేంద్రమోడీ.. గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు మన మొహాన కొట్టి యావత్ రాష్ట్రప్రజల్ని హతాశుల్ని చేశారు. అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా.. ప్రధాని ద్వారా ఏ వరాన్నీ చంద్రబాబు సాధించలేకపోయారు. ఇప్పుడు కూడా అంతే! చంద్రబాబు కోరుకున్నది జగన్ మీద విమర్శలు. కానీ అలాంటిది ఒక్కటి కూడా మోడీ నోటమ్మట రాలేదు. 

ఆ పోరు సంగతి మనకెందుకు అనుకున్నారా?

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న కుమ్ములాటల సంగతి మనకెందుకులే అని మోడీ అనుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ను మోడీ నిందించాలనేది చంద్రబాబు కోరిక కావొచ్చు గానీ.. అలాంటి అవసరం ఆయనకు లేదు. జగన్ ఆయనకు శత్రువు కాదు. పైగా మిత్రుడు కూడా. రాజ్యసభలో బలం అవసరం అయిన ప్రతిసందర్భంలోనూ బేషరతుగా ఆదుకున్న మిత్రుడు. అలాంటి జగన్ సాయాన్ని ఇన్నేళ్లలో తీసుకుంటూనే.. ఇప్పుడు హఠాత్తుగా తూలనాడాలంటే ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం.

జగన్ మళ్లీ గెలిచినా, ఓడినా మోడీకి వచ్చే తేడా ఏం లేదు. ఎందుకంటే.. జగన్ మళ్లీ గెలిచినా కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో మోడీ సర్కారు బిల్లులకు మద్దతిస్తారు. జగన్ ఓడితే.. ఎటూ ఎన్డీయే సర్కారు గనుక.. కేంద్రంలో వారికి దిగుల్లేదు. నిజానికి పొత్తు పెట్టుకోకపోయినా కూడా మోడీకి వచ్చే తేడా లేదు. చంద్రసర్కారు ఏర్పడినా సరే.. వారు మోడీని మీరిపోయేవారు కాదు. అయినాసరే పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు?

పై కారణాలన్నింటినీ బేరీజు వేసుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం చంద్రబాబునాయుడు బలవంతం, పవన్ కల్యాణ్ బతిమిలాడడం వల్ల మాత్రమే పొత్తులకు బిజెపి ఒప్పుకుంది. ఈ సందర్భంలో పవన్ మాటలను గుర్తు చేసుకోవాలి. ‘పొత్తులకోసం తిట్లు తిన్నాను. నిందిలు పడ్డాను’ అంటూ ఆయన తన త్యాగాలను వివరించుకున్నారు. అంటే ఏమిటన్నమాట. పొత్తులకు బిజెపి ఒక పట్టాన ఒప్పుకోలేదన్నమాట. ఆయన వారి తిట్లు తిని మరీ ఒప్పించారన్నమాట. ఎవరినైనా బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తే ఆ కాపురం ఎలా సాగుతుందో మనకు తెలిసిందే కదా! ఇప్పుడు బిజెపితో పొత్తులు కూడా అలాగే సాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలను ఒక ఆట ఆడుకుంటున్నది!

ఎలా ఆడుకుంటున్నారంటే..

సీట్ల పంపకం దగ్గరే వీరి బంధం ఎలా ఉండబోతున్నదో స్పష్టంగా తేలిపోతోంది. బిజెపికి ఇచ్చిన పది ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేని సీట్లనే కేటాయించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. పొత్తు పెట్టుకుంటూనే పార్టీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ.. బిజెపి నాయకులు పలువురు అధిష్ఠానానికి లేఖలో రాసిన మాట వాస్తవమే. దీనిని అధిష్ఠానం కూడా అర్థం చేసుకుంటున్నది. అసలు ఇప్పటిదాకా అభ్యర్థుల సంగతి తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. అసలు ఆ టాపిక్ పట్టించుకోవడం లేదు. పార్టీ రాష్ట్ర సారథి దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీలో తిష్టవేసి ఉన్నారు గానీ.. కనీసం ఒక్క నాయకుడి పేరును కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు.

చంద్రబాబు ఆశలకు లొంగకుండా వారు ఆడుకుంటున్నారు. బిజెపిలోని తన కోవర్టులకు, తాను ఇటీవలే ఆ పార్టీలో చొరబెట్టిన వారికి అక్కడినుంచి టికెట్ ఇప్పించుకోవాలనేది చంద్రబాబు కుటిల వ్యూహం. ఇలాంటి కుటిల ఆలోచనలకు బిజెపి చెక్ పెడుతోంది.

చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా జగన్ ను తిట్టడానికి మోడీ మరొకసారి ఏపీలో ప్రచారానికి రాకపోవచ్చునని కూడా వినిపిస్తోంది. అయితే ఇతర కేంద్రమంత్రులు మాత్రం ప్రచారానికి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. మోడీ ద్వారా జగన్ ను తిట్టించాలనే చంద్రకోరిక నెరవేరదు. వచ్చిన బిజెపి పెద్దల్లో గడ్కరీ లాంటి వాళ్లు తప్ప మిగిలిన నేతలు.. బాబు ఇచ్చే స్క్రిప్టు చదువుతారని అనుకోవడం భ్రమ. చంద్రబాబు స్కెచ్ ప్రకారం కాకుండా.. తమ సొంత ఎజెండా, సొంత వ్యూహం ప్రకారం వారు ముందుకు సాగుతున్నారు. 

ఈ ఇద్దరి భయం ఏంటంటే..?

బిజెపి తరఫున ఏపీలో ప్రచారానికి మోడీ మళ్లీ వచ్చినా జగన్ ను దారుణంగా తిట్టకుండా, పైపైనే పరామర్శించి వదిలేశారంటే మాత్రం.. ఎన్నికల్లో తమకు ఎదురదెబ్బ తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ వచ్చి జగన్ ను ఘాటుగా తిట్టకపోతే.. ఆయనకు అసలు విపక్ష కూటమి గెలవడం గురించి పట్టింపు కూడా లేదని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. అలాంటి భావన ప్రజల్లోకి వెళ్లిందంటే.. కూటమి వల్ల తాము గెలవడం కాదు కదా.. కేవలం కూటమి వల్ల వారు కుంగిపోయే ప్రమాదం ఉంటుంది.

వారిని అలా టెన్షన్ లో పెట్టి బిజెపి నరేంద్రమోడీ మాత్రం చోద్యంగా ఆడుకుంటున్నారు. వీరికి వేరే గతిలేదు. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వారు గెలిస్తే మాత్రం.. మోడీ ద్వారా రాష్ట్రానికి ఏం మేలు చేయగలరు ? ఇలా మోడీ ఆట వలన.. ఈ రెండు పార్టీలు ఇంకా అయోమయ అవస్థలో సతమతం అవుతున్నాయి. 

.. ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?