సినిమాకి సూపర్ హిట్ ఫార్ములా కనిపెట్టడానికి ఒక నిర్మాత మీటింగ్ ఏర్పాటు చేశాడు. మేధావుల్లా కనబడడానికి ఒకరిద్దరు కృష్ణా నగర్‌లో మేకప్ ఆర్టిస్టుల దగ్గర పిల్లి గడ్డం అతికించుకుని వచ్చారు. ఒకాయన లావుపాటి కొరియన్ పుస్తకం తెచ్చుకున్నాడు. ఆయన ఏ పుస్తకమూ చదవడు. తడిమి గ్రహిస్తాడు. బ్రెయిలీ.
అందరూ ఫార్ములా మీద కూచున్న తర్వాత ప్రొడక్షన్ బాయ్ వచ్చి టీలు అందించాడు. నిజానికి అతను బాయ్ కాదు, మ్యాన్. కానీ టీలు అందించి బాయ్‌గా మారాడు. ఒకప్పుడు అతను నిర్మాత. సినిమా స్టార్ట్ చేసేసరికి హీరో 16 ప్యాక్ పెంచడం మొదలు పెట్టాడు. ప్రొటీన్ ఫుడ్‌కి, జిమ్ ట్రైనర్స్‌కి బడ్జెట్ అయిపోతే దివాళా తీశాడు. హిట్ ఫార్ములా తెలుసుకుని, వీలైతే చోరీ చేసి మళ్లీ ఒక వెలుగు వెలుగుదామని బాషాలా గతాన్ని వదిలి రహస్యంగా బాయ్‌గా చేరాడు. ఒకప్పుడు నిర్మాతకి ఫ్రెండ్ కావడంతో, గుర్తు పట్టకుండా ఉండాలని బుగ్గ మీద పులిపిరి కాయ అతికించుకున్నాడు. నిజానికి ఆ అవసరం లేదు. డబ్బులు లేని స్నేహితుల్ని ఆ నిర్మాత గుర్తు పట్టడు. సినిమాకి మించిన కళ.
“హిట్ సినిమాని తీయడం ఎలా?” అడిగాడు హోస్ట్ నిర్మాత.
పిల్లి గడ్డం మేధావి వెంటనే గూగుల్ ఓపెన్ చేశాడు. యూరోపియన్, అమెరికన్‌లా ఆయన గూగులోపియన్. ప్రపంచంలో వీళ్లే మెజార్టీ. గూగుల్ చూసి ఒపీనియన్ చెబుతారు.
ఉదాహరణకి రెండు పెగ్గుల తర్వాత మూడో పెగ్గు హెల్తీనా అని గూగుల్‌ని అడుగుతారు. గూగుల్‌లో శతకోటి లింగాలుంటాయి. అందులో బోడిలింగం అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని పది పెగ్గులేసుకుంటారు. గూగుల్ ఏం చెప్పినా, మనకు నచ్చిందే తీసుకోవడం జ్ఞానం.
నిర్మాత ఒక బెత్తం తీసుకుని పిల్లి గడ్డం చెయ్యి మీద ఒకటేశాడు. “గూగుల్, యూట్యూబ్‌లో ఏముందో చెప్పడం కాదు, మీ బుర్రలో ఏముందో చెప్పండి” అన్నాడు.
నిజానికి అక్కడున్న వాళ్లంతా బుర్రని సెర్చ్ చేయడం మాని చాలాకాలమైంది. మనిషికి ఎన్ని కాళ్లు అని అడిగినా చెప్పలేరు. వెంటనే సెర్చ్ చేస్తారు. 50 రూపాయల సరుకు కొని, కిరాణా వాడికి వంద ఇస్తే, చిల్లర ఇవ్వడానికి వాడు కాలిక్యులేటర్ నొక్కినట్టు, వీళ్లు కూడా అంతే.
“అదెంత పని, ఎ +బి హోల్ స్కయర్ అంత ఈజీ. హీరో బిల్డప్ సాంగ్, హీరోయిన్లతో ఫస్టాప్‌లో రెండు, సెకెండాఫ్‌లో ఒక పాట. మధ్యలో ఐటమ్ సాంగ్, నాలుగు ఫైట్స్. కొంచెం ఎమోషన్స్, నాలుగు కామెడీ బిట్స్, క్లయిమాక్స్‌లో ఛేజింగ్స్. దీన్నే కదా ఫార్ములా అంటారు” అన్నాడు మేధావి.
“నీకు బిర్లా టెంపుల్ తెలుసా?” అడిగాడు నిర్మాత. తల ఊపాడు మేధావి. “మెట్ల దగ్గర అడుక్కునే వాళ్లలో సగం మంది ఫార్ములా నిర్మాతలే. నన్ను కూడా అక్కడ చూడాలని వుందా?” అని పిల్లి గడ్డాన్ని చేత్తో లాగాడు. ఊడి వచ్చింది.
“ఇదేంటి?” కంగారుగా అడిగాడు నిర్మాత. “పిల్లి గడ్డం”
“పిల్లికి ఎక్కడైనా గడ్డం వుంటుందా?”.. “పిల్లికే కాదు, ఏ జంతువుకి గడ్డం వుండదు. ఒకవేళ ఉన్నా దాన్ని గడ్డం అనరు. జూలు అంటారు”
“గడ్డం వల్ల జ్ఞానం వస్తుందని నవ్విన వాళ్లంతా చివరికి గుండు గీయించుకున్నారు” అని పిల్లి మేధావుల్ని నిర్మాత తరిమేశాడు.
కొరియన్ తెచ్చిన వ్యక్తి భయంగా చూసి “హిట్ ఫార్ములా ఈ బుక్‌లో వుంది” అన్నాడు. లావుపాటి బుక్‌ని చూసి నిర్మాత జడుసుకున్నాడు.
“ఇప్పటి వరకూ మన తెలుగు వాళ్లు ఎన్ని కొరియన్ సినిమాల్ని కాపీ కొట్టారో ఆ వివరాలు రాస్తే ఇంత పుస్తకం అయ్యింది. అందుకని ఈ సారి ఇటలీ సినిమాల్ని కాపీ కొడదాం”
“అప్పుడు ఇటలీ వాళ్లు మనమీద పుస్తకం రాస్తారు”.. “మనకి ఇటాలియన్ రాదు కదా, నో ప్రాబ్లమ్”
“నీకు కొరియా కూడా రాదు కదా, దీన్ని ఎలా చదివావు” అనుమానంగా అడిగాడు నిర్మాత. “తడమడం ద్వారా తెలుసుకున్నాను” “నీకు బెత్తం భాష తెలుసా?”
సుయ్ సుయ్‌మని సౌండ్ వచ్చింది. బుక్ వదిలేసి కొరియన్ పారిపోయాడు. బాయ్ వేషంలో వున్న దివాళా నిర్మాత టీ తెచ్చాడు.
హోస్ట్ నిర్మాత తాగుతూ “బుగ్గన పులిపిరి, కత్తి గాటుతో వస్తే దేశోద్ధారకులు సినిమాలో ఎన్టీఆర్‌ని గుర్తు పట్టలేని నాగభూషణం అనుకున్నావా?” అని అడిగాడు.
“గుర్తు పట్టలేకపోవడానికి, పట్టనట్టు నటించడానికి చాలా తేడా వుంది” అన్నాడు బాయ్ నిర్మాత.
“జీవితం, సినిమా రెండూ ఒకటే. పరాజితుల్ని ఎవరూ గుర్తు పట్టరు”.. “జీవితంలో సినిమా వుంది కానీ, సినిమాలో జీవితం లేదు”
“అంటే”.. “హిట్ ఫార్ములా కోసం ప్రయోగశాలలు అక్కరలేదు. హీరో రోబోలా కాకుండా మనిషిలా వుంటే చాలు. మనుషులకి బదులు మర బొమ్మల్ని చూపినంత కాలం బొమ్మ ఫట్”
జీఆర్ మహర్షి