Advertisement

Advertisement


Home > Politics - Opinion

డాలర్ డ్రీమ్స్ పీడకలలుగా మారుతున్నాయి

డాలర్ డ్రీమ్స్ పీడకలలుగా మారుతున్నాయి

అమెరికా అంటే "ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్" అని ప్రతీతి. భారతీయుల డాలర్ డ్రీమ్స్ ఇప్పటివి కావు. గత కొన్ని దశాబ్దాలుగా ఎందరో కన్న కలల ఫలితమే నేడు దాదాపు ప్రతి మూడు-నాలుగు మధ్య తరగతి లేదా ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని ఒకరు అమెరికాలో ఉన్నారు. ఇప్పటికీ ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని కోరుకుంటున్నారు. పిల్లల్ని పై చదువుల కోసం అమెరికాకి పంపిస్తున్నారు. కానీ అవి బంగారుకలలా లేక పీడకలలా అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. 

ఎందుకంటే అమెరికా అనుకున్నంత సేఫ్ కంట్రీ కాదు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో కూడా అమెరికా స్థానం అంత ఆశాజనకంగా లేదు. గన్ కల్చర్ మూలాన తరచూ షూటౌట్స్ జరుగుతున్నాయి. మాల్స్, స్కూల్స్, చర్చిలు, పార్కులు...ఇలా ఏ ప్లేస్ సేఫ్ అంటే ఏదీ కాదని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏ టైములో ఏ మూలనుంచి ఎవడొచ్చి గన్ పెట్టి పేలుస్తాడో అనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి జరిగందంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ అమెరికా అధికార్లు చెప్తున్న లెక్కల ప్రకారం 2023 లో ఇప్పటి వరకు దేశంలో సమాన్యుడి చేతిలో గన్ పేలని రోజే లేదట. 

ఇండియాలో ఎవరికైనా గన్ లైసెన్స్ కావాలంటే చాలా తతంగం ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి, ఐజీ స్థాయి అధికారి రికమెండేషన్ ఉంటే తప్ప సాధ్యంకాదు. సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేసి, మరీ అవసరమని అనిపిస్తే తప్ప ఇవ్వరు. కానీ అమెరికాలో అలా కాదు. షాపుకెళ్లి సెల్ఫోన్ కొన్నంత ఈజీగా తోచిన తుపాకీ కొనేసుకోవచ్చు. ఏదో చిన్న పిస్టల్ కాదు...పెద్ద పెద్ద స్టన్ గన్స్ కూడా అమ్మేస్తుంటారు. 

అమెరికాలో మాదకద్రవ్యాల సేవనం కూడా ఎక్కువైపోయింది. గంజాయిని లీగల్ చేయడంతో అసలు హద్దూ అదుపూ లేకుండా యువత, మధ్య వయసు వాళ్లు ఆ మత్తులో జోగుతున్నారు. అలాంటి సమయంలో గన్ చేతిలో ఉంటే ఉన్మాదం బయలుదేరి విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరుగుతుంది. 

కేవలం డ్రగ్స్ వల్లనే షూటౌట్స్ అవుతున్నాయా అంటే కాదు. మెంటల్ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్న జనాభా అమెరికాలో ఎక్కువ. తాజాగా టెక్సాస్ లో కాల్పుల జరిపిన ఉన్మాది మెంటల్ హెల్త్ సరిగ్గా లేదని ఆర్మీలో ఉద్యోగం పోగొట్టుకుని బయటికొచ్చి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. జనానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాడు ఉన్మాదావస్థలో 9 మందిని కాల్చి చంపాడు. 

అయితే డ్రగ్స్, లేకపోతే మెంటల్ డిజార్డర్స్ కారణంగా ఉన్మాదులు తయారవుతున్నారంటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే రేసిజం. 

అమెరికాలో భారతీయుల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఈ సంగతి ఎన్నారైలకు తెలుసు. కానీ ఇండియాలోనే ఉంటున్న చాలామందికి తెలియదు. అమెరికన్స్ అంటే ధనవంతులని, వాళ్ల దగ్గర పని చేయడానికి మనవాళ్లు వెళ్తున్నారని ఒకానొక భ్రమలో ఉన్నవాళ్లే ఎక్కువ. కాని అది అవాస్తవం. 

అమెరికాలోని భారతీయులంతా దాదాపు సగటు జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కొత్తగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం పొందిన వాళ్ల జీతాలు కూడా సగటు కంటే ఎక్కువే ఉంటున్నాయి. అంతే కాదు. అమెరికాలో మల్టీ మిలియనీర్, బిలయనీర్ ఇండియన్స్ ఎక్కువ. ఈ పరిస్థితి అక్కడే ఉంటున్న తెల్లవాళ్లకి, నల్లవాళ్లకి, మెక్సికన్స్ కి లేదు. వాళ్ళల్లో చాలామంది మనవాళ్లల్లా సాఫ్ట్ వేర్ చదువుకున్న వాళ్లు, డిసిప్లైన్ గల కుటుంబ వాతావరణంలో పెరిగిన వాళ్లు కాదు. ఏవో ఆడ్ జాబ్స్ చేసుకుంటూ బతికేవాళ్లున్నారు. వాళ్లకి ఇండియన్స్ అంటే అసూయతో కూడిన ద్వేషం. ఆ ద్వేషానికి గన్ కూడా తోడైతే ఏమౌతుంది? షూటౌట్ జరుగుతుంది. 

ఇలా ఒక కారణం కాదు. అమెరికాలో బులెట్ ఏ రకంగానైనా తగలొచ్చు. దినదినగండంలాగ యుద్ధభూమిలో బతుకుతున్నట్టు బతకాలి. 

ఇంతకీ చావు గన్నుతోటే వస్తుందా అంటే అదీ కాదు. నాలుగు రోజుల క్రితం ఒకడు కారు డ్రైవ్ చేసుకుంటూ గుంపుగా రోడ్డు పక్కన నిలబడిన కొంత మంది మీదకి ఎక్కించేసి చంపేసాడు. అది రేసిజం ఎటాక్. అలాగే మరొక ఉన్మాది 12 బీర్లు తాగిన మత్తులో తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టి ప్రాంక్ చేసిన టీనేజర్స్ ని వెంటాడి తన కారుతో గుద్ది చంపేసాడు. 

చంపేవాడికి పిల్లలా, పెద్దలా, ఆడ, మగ, వృద్ధ అనే తేడా ఉండట్లేదు. ఎవడి మైండులో ఏముంటుందో తెలియట్లేదు. 

ఇలాంటి దేశం గురించి కలలు కంటూ కొత్తగా పిల్లల్ని డాలర్ సంపాదన కోసం పంపాలా? భవిష్యత్తు బాగుండాలంటే దేశం వదిలి వెళ్లాల్సిందేనా? ఒకవేళ విదేశీ చదువు తప్పదనుకుంటే అమెరికాకంటే వేరే దేశాలు లేవా? ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాల్సిన సమయమిది. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇది తల్లిదండ్రులకి, డాలర్ కలలు కనే యువతకి చెప్పే  సూచన, జాగ్రత్త, హెచ్చరిక. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?