Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాకి లెక్కలే!

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాకి లెక్కలే!

"ఎగ్జిట్ పోల్" అంటే.. ఒక వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడుఆ వ్యక్తిని కలిసి, ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రక్రియ .

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఉన్న పోలింగ్ బూత్‌లు ఎన్ని? ఎన్ని బూత్‌ల ముందు ఇప్పుడు అంకెలు చెప్పిన సంస్థల ప్రతినిధులు ఉన్నారు? ఎంత మంది అభిప్రాయాలను వారు సేకరించారు? అంత బలగం ఈ “సర్వే” చేశామని  చెప్పే వారికి ఉందా?

ఒక పక్కన ఇంకా  పోలింగ్ పూర్తిగా పూర్తి కాకముందే ఈ సంస్థలు అంకెలు చెప్పేయడం మన చానెల్స్ ఇరగ దీసెయడం చేసేశాయి. కామారెడ్డి లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ సర్వే సంస్థలు ఓడించేశాయి. టీవీ ఛానళ్ళు డిబేట్లు నిర్వహించేశాయి.  

ప్రఖ్యాత ఆంగ్ల టీవీ ఛానల్ ఎన్డీ టీవీ ఈ సర్వే ఫలితాలు ప్రకటిస్తూనే, మరో ముక్క కూడా ప్రముఖంగా చెబుతుంది. ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఓ సూచిక మాత్రమేనని, ఈ అంచనాలు పూర్తిగా తప్పు కూడా కావచ్చునని ఎన్డీ టీవీ న్యూస్ వెబ్సైటులో  “ డిస్ క్లెయిమర్ ” కూడా పబ్లిష్ చేస్తుంది.  

ఇక, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బాలెట్‌ను ఈ “సర్వే” సంస్థ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికల కమిషన్ కొత్తగా ప్రవేశపెట్టిన “హోమ్ ఓటింగ్ ” లో ఓటేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదు.  

ఏ ఎన్నికల్లో అయినా వందలు, ఒకటి -రెండు వేల లోపు మెజారిటీతో గెలిచేవారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జరిగిన పోలింగ్ లో ఎన్ని నియోజక వర్గాలలో ఏ పార్టీ వారు ఎంతమంది ఇలా అతి తక్కువ మెజారిటీతో బయట పడతారో ఏ ఒక్క ఛానలూ చెప్పలేదు. వారి దగ్గర ఆ డేటా లేదా? డేటా లేకపోతే , ఏ పార్టీ వారు ఎంతమంది గెలుస్తున్నారో ఎలా చెప్పగలుగుతున్నారు ?

అంటే “ ఎగ్జిట్ పోల్ ” ఫలితాలు చెప్పడం అనేది ఒక ఫ్యాషనబుల్ వ్యాపకం అయిపోయింది. ఒకటి మాత్రం నిజమని అనిపించుతున్నది.  

కేసీఆర్ పదేళ్ల నుంచి అధికారంలో ఉండడం వల్ల, ఆయన వ్యవహార శైలి పై తీవ్ర అసంతృప్తి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. సోషల్ మీడియాలో ఆయన వ్యవహార శైలికి వ్యతిరేకంగా భారీ ప్రచారం జరిగింది. గాలికి నిప్పు తోడైనట్టుగా .... రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్‌కు తోడైంది .

ఇలా అనేక కారణాల వల్ల, ఈ సారి కాంగ్రెస్సే అన్న రాజకీయ వాతావరణం తెలంగాణలో కనిపించింది. తెలుగుదేశం పోటీ చేయక పోవడం అన్నది కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే అభిప్రాయం బాగా షికార్లు చేసింది. చంద్రబాబు అరెస్ట్ పై హైదరాబాద్‌లో నిరసనలు, ర్యాలీలు, లేదా ధర్నాలు చేపడదాము అనుకున్న వారి పట్ల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు “గుడ్ టేస్ట్ ”లో లేవు. ఈ కారణాలు అన్నీ కలిపి, ఈ సారి బీఆర్ఎస్ ఓటమి తథ్యం అనే మైండ్ సెట్ తో ఏవో కాకుల లెక్కలు టీవీ స్టేషన్ లకు అందించారు.  

టీవీలలో ఈ “సర్వే ” అంకెలు ప్రదర్శించే సమయానికి పోలింగ్ ఇంకా పూర్తి కాలేదు . సాయంత్రం 5గంటలకు పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. కాంగ్రెస్ గెలవ వచ్చు, గెలవక పోవచ్చు. అలాగే బీ ఆర్ఎస్ కూడా.

అయితే, ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణ ఎన్నికల ఫలితం ప్రభావం ఏపీ రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. కేసీఆర్ గెలిస్తే,. ..., జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఆయన అన్ని రకాలుగా దన్నుగా ఉంటారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. కాంగ్రెస్ గెలిస్తే ప్రతిపక్షాలకు పెద్ద ఊపు వస్తుంది. మరి, ఆంధ్ర జాతకం ఎలా ఉందో చూడడానికి మరో రెండు రోజులు ఆగాలి.  

భోగాది వేంకటరాయుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?