Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఎత్తులు.. పొత్తులు.. చిత్తులు..

ఎత్తులు.. పొత్తులు.. చిత్తులు..

రాజకీయంగా అన్నాక నెగ్గడమే ప్రధానం. అధికారమే లక్ష్యం. ఆ అధికారం కోసం ప్రజాబలాన్ని నమ్ముకునే వాళ్లు, ప్రజల ఆదరణను పెంచుకోవాలని అనుకునే వాళ్లు కొందరు. కేవలం ఎత్తులు ఉంటే చాలు.. మనకు బలం లేకపోయినా.. ఇతరులతో పొత్తులు పెట్టుకుంటే చాలు.. ప్రజలు వెంటనిలవకపోయినా కులసమీకరణలను కలుపుకుంటే చాలు.. అని భావించేవారు మరికొందరు.

ఎత్తులే ముఖ్యమనుకునే పొత్తులతో ముందుకు సాగేవాళ్లు.. అంతిమంగా చిత్తు చేస్తారా? చిత్తు అవుతారా?

ఈ పోకడలపై విశ్లేషణఏ ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘పొత్తులు ఎత్తులు చిత్తులు’

‘పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా? లేదా?’, ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ .. లాంటి సర్వజనాసక్తి కలిగిన ప్రశ్నలకంటె మిన్నగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను అత్యంత ఆసక్తికరమైన అంశం కుదిపివేస్తున్నది. రాజకీయాలను శ్రద్ధగా ఫాలో అయ్యేవారు, పరిణామాలను గమనించేవారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఇంతకూ ఆ ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటో తెలుసా? చంద్రబాబునాయుడు పల్లకీ మోయటానికి మోడీ దళం సిద్ధంగా ఉందా? లేదా?

అవును. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు అత్యంత ఆసక్తికరమైన చర్చ ఇదే. చంద్రబాబునాయుడుకు భ్రమలు తొలిగాయి. ఒక దశ వరకు ఆయన జగన్ ప్రభుత్వాన్ని తాను ఎడాపెడా తిడుతున్నాను గనుక.. జనం ఎగబడి సైకిలు గుర్తుకు వేసేస్తారని అనుకున్నారు. తన ఊహలు భ్రమలే అని ఆయనకు తెలిసిపోయింది. తాను తిట్టినంత మాత్రాన జగన్ గురించి ప్రజల్లో వ్యతిరేకత లేదనే సత్యం ఆయనకు బోధపడింది. పవన్ కల్యాణ్ జట్టుగా కలుపుకున్నారు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి తల బొప్పి కట్టించుకున్న పవన్ కల్యాణ్.. ఏదో ఒక రీతిగా సభలో అడుగుపెట్టే తీరాలనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నుంచి ప్రకటించిన వన్ సైడ్ లవ్ సంకేతాలను ఆయన సంతోషంగా స్వీకరించారు. చంద్రబాబు పల్లకీ మోసి.. ఆయనను జీవితంలో చివరిసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ జట్టులో భారతీయ జనతా పార్టీ కూడా ఉండబోతున్నదా లేదా? 2014 నాటి మ్యాజిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న.

చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలుస్తున్నారు. ‘అయినను వెళ్లి రావలె హస్తినకు..’ అని భారతంలో సెలవిచ్చినట్టుగా.. అగ్రనాయకులందరూ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి యాత్రా పరమార్థమూ ఒక్కటే కాకపోవచ్చు. కానీ.. కుడిఎడమగా భాజపాతో ముడిపడి ఉన్న వ్యవహారమే అన్నది మాత్రం సత్యం. చంద్రబాబునాయుడు.. భాజపా ఎదుట సాగిలపడి మరీ.. వారితో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. ఆయన ఉబలాటానికి వారు పాజిటివ్ గా స్పందించి తీరాలనే రూల్ లేదు.

ఏ సంగతీ ఇంకా తేలలేదు. (ఈ కథనం రాసే సమయానికి భాజపా కూడా తెలుగుదేశంతో పొత్తులు కుదుర్చుకుంటుందనే అధికారిక ప్రకటన రాలేదు. పొత్తు కుదిరే అవకాశం బలంగా ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఆ అంచనాల ప్రకారమే ఈ విశ్లేషణ) బాబు మాత్రం- ప్రాధేయపడడం కంటె ఎక్కువ చేస్తున్నారని.. భాజపాలోని తన కోవర్టుల ద్వారా బలంగా చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారని కూడా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో చాలా చాలా పార్శాలున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు పవన్ కల్యాణ్ చాలు అనుకున్న చంద్రబాబు- ఇప్పుడు రూటు మార్చారు. 

పవన్ చాలడు- అనే క్లారిటీ!

ముందే చెప్పుకున్నట్టు అధికారంలోకి రావడం ఒక్కటే వారి లక్ష్యం. మామను వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న పార్టీతో ఏ ఒక్క సందర్భంలో కూడా ఒంటరిగా పోటీచేసి గెలిచిన చరిత్రలేని చంద్రబాబు పైకి ఎన్ని గప్పాలు కొట్టుకున్న వాస్తవంగా తన బలం ఏమిటో ఆయనకు తెలుసు. ప్రజల్లో తనకు విశ్వసనీయత లేదనే సంగతి కూడా ఆయనకు తెలుసు.

ప్రజలు తనొక్కడినే పోటీచేస్తే దారుణంగా ఓడించేస్తారనే స్పష్టత చంద్రబాబుకు ఉంది. 2019 ఎన్నికల్లో ఆ సంగతి ఆయనకు మరోసారి ప్రూవ్ అయింది. అందుకే ఎన్నికల అయిన వెంటనే.. ఆయన మెట్లు దిగి పవన్ కోసం కన్నుగీటడం ప్రారంభించారు. పాపం సిగ్గు విడిచి.. మన వైపు నుంచి వన్ సైడ్ లవ్ ఉంది. అటువైపు నుంచి సిగ్నల్ రాలేదు.. అని బహిరంగ సభల్లో చెప్పుకున్నారు. పవన్ కోసమే ఎందుకు వెంపర్లాడారు?

కేవలం కుల సమీకరణలు మాత్రమే. రాష్ట్రంలో సంఖ్యాపరంగా ఎంతో బలమైన కాపు సామాజికవర్గం ఓట్లన్నీ పవన్ వెంట గంపగుత్తగా తనకు వస్తాయని చంద్రబాబుకు ఒక అంచనా. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ.. పవన్ ను తన వెంట నిలబెట్టుకోవాలనే ఉబలాటం మాత్రం ఉంది. అటువైపు.. పవన్ కల్యాణ్ కూడా కేవలం కులం ఓట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ.. ఎన్నికల్లో గెలవడానికి తన కులం ఒక్కటీ చాలదని పవన్ కు అర్థమైంది.

వంద రకాల లెక్కలు వేసి.. కాపులు అత్యధికంగా ఉన్న సీట్లు ఎంచుకుని పోటీచేస్తే ఆయన సొంతంగా కూడా గెలవలేదు. ‘అయ్యకు విద్యలేదు.. అమ్మకు అహంకారం లేదు..’ అన్న సామెత చందంగా ఈ రెండు పార్టీలు దొందూ దొందే. తమ బలహీనతలు వారికి తెలుసు. అందుకే అందంగా ఒక మాటను తయారుచేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అనే ముసుగులో.. గతిలేనమ్మలు ఇద్దరూ ఒక గొడుగు కిందకు చేరినట్టుగా పొత్తులు పెట్టుకున్నారు. పవన్ ఒక్కడూ తనకు పొత్తుల్లో ఉంటే చాలు.. అని చంద్రబాబు అనుకున్నారు గానీ.. తాజాగా పరిస్థితి మారింది. బిజెపి కూడా ఉండాల్సిందే అని ఆయన ఎగబడుతున్నారు. అందుకు చంద్రబాబు పాపం చాలా మెట్లు దిగి.. వారిని ఆశ్రయిస్తున్నారు.

హఠాత్తుగా చంద్రబాబు ఎందుకు మెట్టు దిగినట్టు?

మొన్నటిదాకా ఆయన పొత్తుల్లోకి బిజెపి వచ్చినా మంచిదే రాకపోయినా మంచిదే అనుకునే స్థితిలో ఉన్నారు. కానీ రామాలయం ప్రారంభోత్సవం తర్వాత పరిస్థితి మారిపోయింది. దేశమంతా ఉన్నట్టే ఏపీలో కూడా మోడీ అనుకూల రామభక్త పవనాలు పుష్కలంగా ఉన్నాయనేది చంద్రదళం అంచనా. 2019 ఎన్నికల్లో ఒక్కశాతం మించి ఓటు శాతం నిరూపించుకోలేని పార్టీ ఈ ఎన్నికల నాటికి ఏం మెరుగుపడలేదనే నమ్మకంతో.. తూష్ణీభావంతో బిజెపిని చూసిన బాబు.. రామభక్త ఓటు బ్యాంకును పోగొట్టుకునే ఉద్దేశంతో లేరు. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే వారి ఓటు శాతం పెరుగుతుందని ఆయనకు భయం పట్టుకుంది.

పైగా పొత్తులు లేకపోతే గనుక.. మోడీ అనుకూల ఓటును జగన్ చేజిక్కించుకోగలరనే భయం చంద్రబాబుకు ఉంది. జగన్ తన ప్రచారంలో.. కేంద్రంలో మోడీ సర్కారుతో సత్సంబంధాల ద్వారా రాష్ట్రానికి మెరుగైన ప్రయోజనాలు రాబట్టుకుంటున్నాం అని ఒక్క మాట చెబితే చాలు. ఎటూ ఈ అయిదేళ్లలోనూ కీలక బిల్లుల విషయంలో మోడీకి జగన్ సహకరిస్తున్న వైనం గుర్తిస్తున్న ప్రజలంతా.. మోడీ భక్తులంతా వైసీపీకి ఓటు వేసేస్తారని  చంద్రబాబుకు భయం.

కమలానికి వేస్తే ఓటు మురిగిపోతుంది గనుక.. అదేదో మోడీకి మద్దతిచ్చే జగన్ కు వేద్దాం అని ప్రజలు అనుకోకుండా ఆయన కుట్ర ఇది. మోడీ కాళ్లు పట్టుకుని అయినా సరే.. పొత్తులు కుదుర్చుకోవడానికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. 

మొన్నమొన్నటిదాకా పొత్తుల్లో కమలం పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకున్నారు. వారి ఒక్క శాతం ఓటు బ్యాంకు కంటె తనకు పడగల ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయని విర్రవీగారు. కానీ రామాలయం ప్రారంభం తర్వాత పరిస్థితి మారిపోయింది. 

ప్రజలు ఎందుకు నమ్మాలి?

సింపుల్ గా చెప్పాలంటే.. ఈ మూడు పార్టీల మధ్య కుదురుతున్న పొత్తులు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అవును.. అవకాశ వాద రాజకీయానికి చంద్రబాబునాయుడు నిలువెత్తు రూపం అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

ఎందుకంటే చంద్రబాబునాయుడు.. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తుల్లో ఉన్నారు. అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రప్రభుత్వంలో  పార్టీ భాగస్వామి కావడం వలన రాష్ట్రానికి ఆయన ప్రత్యేకంగా సాధించినది ఒక్క నయాపైసా కూడా లేదు. ప్రత్యేకహోదా కాదని చెప్పి.. హోదాకోసం పోరాడుతున్న వారిమీద కేసులు పెట్టి.. డబ్బులు కాజేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీకి డీల్ కుదుర్చుకున్న చరిత్ర చంద్రబాబుది. అది కూడా రాకుండాపోయింది.

హోదాను మంటగలిపింది స్వయంగా చంద్రబాబునాయుడే. కనీసం.. రాజధాని అనే గ్రాఫిక్స్ మాయాజాలంతో.. అమరావతి గురించి ఆయన తిమ్మిని బమ్మిని చేసి అరచేతిలో అందరికీ వైకుంఠం చూపించారు. ఆ అమరావతి నిర్మాణం కోసం కూడా కేంద్రం నుంచి ప్రత్యేకంగా డబ్బు సాధించలేకపోయారు. ఆయన పనితనం మీద అనుమానంతో.. అటు పోలవరంకు, అమరావతి నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వడంలో జాగుచేసే పరిస్థితి తీసుకువచ్చారు.

తీరా 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మి తన చేతిలో అధికారం పెడితే వీసమెత్తు ప్రగతి చూపించలేకపోయాను అనే సత్యం ఆయనకే అర్థమైంది. అయితే.. ప్రజలను మోసం చేయడానికి కేంద్రంలో సర్కారునుంచి బయటకు వచ్చారు. మోడీతో విభేదించారు. ఏపీ అభివృద్ధి చతికిలపడడానికి పూర్తి కారణం మోడీ అంటూ నిందించడం ప్రారంభించారు. తన పాలన అవసాన దశలో ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాటం అంటూ డ్రామాలు చేశారు. అవన్నీ బెడిసి కొట్టాయి. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు దారుణంగా తిట్టుకున్నాయి. ప్రతి పరిణామాన్ని ప్రజలు గమనించారు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు నమ్మాలి?

పవన్ కల్యాణ్ సంగతి కూడా అంతే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలనేది ఆయన కల. పీక సన్నం ఆశ లావు సామెత చందం పవన్ తీరు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు నడుమ ఆయన చేసిందేమీ లేదు. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. కౌలు రైతుల ఆత్మహత్యలకు చెక్కులు వంటి కొన్ని డ్రామాలు మాత్రం నడిపించారు. జనవాణి పేరుతో ఇంకో ప్రహసనం నడిపించారు. అయితే ఇవేవీ.. తానేదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి ఉపయోగపడేవే తప్ప… ఓట్లు పడడానికి గెలవడానికి తోడ్పడవని ఆయనకు తెలుసు.

2019 ఎన్నికల ముందు చంద్రబాబు అసమర్థత గురించి నానా మాటలు అన్నటువంటి పవన్, నారా లోకేష్ అవినీతి విశ్వరూపం గురించి నానా మాటలు అన్న పవన్.. ఇప్పుడు వారి పల్లకీ మోస్తున్నారు. ఇలాంటి అవకాశవాదులను ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు మరీ అంత అమాయకులా? పిచ్చివాళ్లలా కినిపిస్తున్నారా?

ముసుగులో ఉన్న పొత్తు మరొకటి?

ఏపీ రాజకీయాల్లో ఈసారి చిత్రమైన పరిణామం ఏంటంటే.. అంతర్వాహిని అంటూ బయటకు కనిపించకుండా ఉండే నది ప్రవహించినట్టు.. పైకి కనిపించకుండా ఉండే పొత్తులు కూడా ఉంటున్నాయి. అదే.. చంద్రబాబునాయుడు దళంతో.. కాంగ్రెస్ పొత్తు. చంద్రబాబు ఫేవర్ చేయడానికి తన శక్తివంచన లేకుండా కష్టపడుతున్న వైఎస్ షర్మిల కుదుర్చుకున్న పొత్తు. వైఎస్ షర్మిల చివరికి చంద్రబాబు చేతిలో పావులాగా మారిపోయారు. కీలుబొమ్మలాగా అయిపోయారు. తెరవెనుక నుంచి ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు.

చిన్న ఉదాహరణ చాలు. షర్మిల అదేదో దసరా నాడు పిల్లలకు పంచిపెట్టే పప్పులు బెల్లాలు అయినట్టుగా.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేస్తానంటూ పదేపదే మాట్లాడుతున్నారు. అదొక్కటే తన ఎజండా అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. హోదా లేకపోవడం గురించి ఆమె ఇద్దరు నేతలకు లేఖలు రాశారు. వాటిని గమనిస్తేనే ఆమె ఎంతగా చంద్రబాబు ట్రాప్ లో ఉన్నదో అర్థమవుతుంది.

ప్రత్యేకహోదా రాకపోవడానికి.. ఎన్డీయేతో సంబంధం లేని, ప్రాంతీయ పార్టీ అధినేత అయిన జగన్ ను నానా రకాలుగా నిందిస్తున్న షర్మిల.. కేంద్రంలో భాగస్వామి పార్టీగా ఉంటూ ప్రత్యేకహోదా సాధించడం గురించి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబుకు మాత్రం సుతిమెత్తటి ప్రతిపాదనలతో లేఖ రాశారు. ఈ ఉదాహరణ చూస్తే.. ఆమె ముసుగు కప్పుకున్న పొత్తు బంధాన్ని తెలుగుదేశంతో కొనసాగిస్తున్నట్టుగా ప్రజలకు అర్థమవుతోంది.

పాపులర్ సినిమా డైలాగును ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే..తనకు ప్రజలు ఉంటే చాలు.. ఏ పార్టీల పొత్తు కూడా అవసరం లేదు.. అనే స్థిరమైన వ్యక్తిత్వ పోకడలతో ఎన్నికల సమరాంగణంలో తలపడుతున్నారు. ఎత్తుల దశ దాటి విపక్ష పార్టీలు అన్నీ కూడా పొత్తుల దశలోకి వచ్చేశాయి. నేడో రేపో కమలంతో పొత్తు బంధం కచ్చితంగా కుదురుతుంది. అందరూ కలిసి జగన్ మీద ముప్పేట దాడిచేస్తారు.

ముసుగుబంధాన్ని కూడా కలుపుకుంటే నాలుగు పార్టీలు కలిసి నాలుగు చెరగుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద దాడికి దిగుతారు. కానీ.. ఆయన ఒక్కడుగా పోరాడాల్సిందే. అందుకు ఆయన సిద్ధమే. వీరి ఎత్తులు.. పొత్తులను.. జగన్ ఎంత మేరకు చిత్తు చేయగలరు… అనేది వేచిచూడాలి. లేదా.. ప్రయత్నాలు వికటించి.. వారి ఎత్తులు- పొత్తులకు జగనే చిత్తవుతారేమో కూడా గమనించాలి. 

..  ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?