Advertisement

Advertisement


Home > Politics - Opinion

జ‌గన్‌పై అభిమానం కాదు... అంతకు మించి!

జ‌గన్‌పై అభిమానం కాదు... అంతకు మించి!

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటి ప్రచార దృశ్యాలు మళ్లీ పునరావిష్కృతం అవుతున్నాయి.

జగన్‌మోహ‌న్‌రెడ్డి సిద్ధం సభల కోసం బయట అడుగుపెట్టేదాకా చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వచ్చినట్లు జనం వస్తారా? అప్పటిలాగా సభలు విజయవంతమవుతాయా? జనంలో ఏమైనా వ్యతిరేకత వుందా? ఇటువంటి సందేహాలు వైసీపీ అభిమానుల్లోనూ గూడుగట్టుకున్నాయి.

ఇక ప్రతిపక్షాలైతే ప్రత్యేకంగా చెప్పనవరం లేదు... జగన్ ప్రజా నిరసనకు భయపడి తెరలుకట్టుకుని, వాటి చాటున తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశాయి. జగన్‌ వ్యతిరేక మీడియా దీన్ని పెద్దగా ప్రచారం చేసింది కూడా.

ఒక్కసారి జగన్ ప్రచారం కోసం అడుగు బయటపెట్టాక, జగన్‌కు లభించిన, లభిస్తున్న ప్రజాద‌రణను చూసి సొంత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తే... ప్రతిపక్షాలు నీరుగారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల మీడియా బయటపడటం లేదుగానీ.... జగన్‌కు జనంపడుతున్న బ్రహ్మరథం చూసి ‘ఇంతటి జన స్పందన ఏమిటి’ అంటూ అంతర్గతంగా మదనపడుతున్నాయి.

ఇటు చిత్తూరు నుంచి అటు విశాఖపట్నం దాకా జగన్‌ సభలకు, యాత్రకు జనం పోటెత్తారు. జగన్‌ బస్సుకు ముందు, బస్సు వెనుక జనం పరుగులు తీస్తున్నారు. జగన్‌ను చూసి మైమరచిపోతున్నారు.

త‌మ జీవితాల్లో వెలుగులు నింపిన జ‌గ‌న్‌ను ఆరాధించే వాళ్ల సంఖ్య ఎక్కువే. విజయవాడలో ఒక చోట జగన్‌కు హారతులు పట్టారు. ఇంకోచోట ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించి, జగనన్నా.... జగనన్నా అంటూ కేకలు పెడుతూ.... జగన్‌ అతని వైపు చూసేదాకా అరిచాడు.

యువతే కాదు... మహిళలు, వృద్ధులు, వికలాంగులు కూడా అంతే ఉత్సాహంతో జగన్‌ను చూడటానికి పరుగులు తీస్తున్నారు. కొన్నిచోట్ల జగన్‌ బస్సు మెట్ల మీద కూర్చునే వృద్ధులను, మహిళలను పలకరిస్తున్నారు. అప్పుడు జగన్‌తో మాట్లాడే మహిళల కళ్లలో ఆనందం, మెరుపు కనిపిస్తున్నాయి. చేతి మెడిమలు విరచి జగన్‌ను దిష్టి తీస్తున్నారు. జగన్‌ యాత్రలో ఇటువంటి ఉద్వేగభరిత సన్నివేశాలు ఎన్నో కనిపిస్తున్నాయి.

నాకు తెలిసింత వరకు ఒక ఎన్‌టి రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించినపు జనం ఈ విధంగా ఆయన వెంట పిచ్చి పట్టినట్టు పరుగులు తీశారు. ఎన్‌టిఆర్‌ రాక కోసం గంటల కొద్దీ రోడ్డమీద ఎదురుచూశారు. ఏ అర్ధరాత్రికో ఎన్‌టిఆర్‌ వస్తే కొన్ని నిమిషాలు ఆయన్ను చూసిన ఆనందలో ఇంటిదారి పట్టేవారు.

అటువంటి దృశ్యాలు ఇప్పుడు జగన్‌ యాత్రలో మాత్రమే కనిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయాల్లో దేశ వ్యాప్తంగా చాలామంది యువ నేతలు రాజకీయరంగ ప్రవేశం చేశారు. కానీ జగన్ లాగా సమ్మోహన శక్తి కలిగిన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. జనం వేలం వెర్రిగా పరిగెత్తడం లేదు.

జగన్‌ సభలకు జనం పోటెత్తుతుంటే.... గ్రాఫిక్స్‌ అని, జనాన్ని బలవంతంగా తీసుకొస్తున్నారని ప్రతిపక్షం హేళన చేయొచ్చు. బలవంతంగా తీసుకొచ్చిన జనానికి, అభిమానంతో వచ్చిన జనానికి చాలా తేడా వుంటుంది. డబ్బులు కోసం వచ్చిన జనం... వచ్చి అలా మొక్కుబడిగా నిలబడి వెళ్లిపోతారు. ఈ విధంగా పరుగులు తీయరు. హారతులీయరు. చేతిలో కర్పూరం వెలిగించుకోరు.

జగన్‌మోహన్‌ రెడ్డి కనిపిస్తే చాలు ఆకాశం తూట్లుపడేలా అరుస్తారు. ఇక ఆయన మైక్‌ చేతికి తీసుకుని, ఏమీ మాట్లాడకుండానే, కుడిచేతిలో మైకు పట్టుకుని, ఎడమచేతి వేలితే టప్‌...టప్‌...టప్‌ మని కొడితే చాలు జనం పిచ్చెక్కినట్లు అరుస్తున్నారు.

జనంలో జగనంటే అభిమానం దాటిపోయి ఆరాధనా భావం కనిపిస్తున్నది. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా ఇంతటి అభిమానం దక్కలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

మళ్లీ ఎన్‌టిఆర్‌ విషయానికొస్తే...ఆయన కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికి... అభిమానులు ఆయన్ను దేవుడిగా చూసేవారు. ఆ అభిమానమే రాజకీయంగానూ ఎన్‌టిఆర్‌కు కొనసాగింది.

వైఎస్‌ జగన్‌ అలాకాదు. రాజకీయ నాయకుడైన రాజశేఖర్‌ రెడ్డి కొడుకుగా మాత్రమే అప్పటిదాకా ఆయనకున్న గుర్తింపు. ‘వైఎస్‌ఆర్‌ మరణానంతరం సోనియా గాంధీని ఎదిరించి, సొంతంగా పార్టీ పెట్టి, ఎదురొడ్డి నిలబడ్డారో అప్పుడే అభిమానులు ఆయన్ను రియల్‌ హీరోలాగా చూడటం మొదలుపెట్టారు. తమకు ఎదురు లేదనుకుంటున్న ఈనాడు పత్రికకు సవాలు విసిరారో... అప్పుడు ఆయన హీరోయిజం మరింత పెరిగింది... సంక్షేమ పథకాల ద్వారా సూపర్‌ స్టార్‌ అయ్యారు’ అని ఓ విశ్లేషకుడు చెప్పారు.

జనంలో జగన్‌కు ఎందుకంత ఆదరణ లభిస్తున్నది, జగన్‌లోని సమ్మోహన శక్తి ఏమిటి అనేవి తెలుసుకోవాలంటే పూర్తిస్థాయి పరిశోధన చేయాల్సిందే. ఏమైనా జగన్‌ జీవితం ధన్యమయింది. ఆయన ఆశిస్తున్నట్లు జనం గుండెల్లో గుడి కట్టుకున్నారు. అందుకే ఆయనంటే ఇంతటి ఆరాధనా భావం.

- చేతుచందన్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?