జ‌గ‌న్ అప్‌డేటెడ్… బాబు ఔట్‌డేటెడ్‌

జ‌గ‌న్ ముందుకాలం నాయ‌కుడు. చంద్ర‌బాబు ముస‌లిత‌రం లీడ‌ర్‌. ఇది వాస్త‌వం. తెలుగుదేశం నాయ‌కులు లేదా అభిమానులు ఇంకా బాబు ఏవో అద్భుతాలు చేస్తాడ‌ని, మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి ఇంకో ప‌దేళ్లు పాలించి, వైసీపీని అడ్ర‌స్…

జ‌గ‌న్ ముందుకాలం నాయ‌కుడు. చంద్ర‌బాబు ముస‌లిత‌రం లీడ‌ర్‌. ఇది వాస్త‌వం. తెలుగుదేశం నాయ‌కులు లేదా అభిమానులు ఇంకా బాబు ఏవో అద్భుతాలు చేస్తాడ‌ని, మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి ఇంకో ప‌దేళ్లు పాలించి, వైసీపీని అడ్ర‌స్ లేకుండా చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు. అయితే అవ‌న్నీ ప‌గ‌టి క‌ల‌లే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌క‌రకాల దుర‌భిమానాల‌తో నిండిపోయాయి. స‌త్యం, త‌ర్కం లేకుండా గుడ్డిగా స‌మ‌ర్థించ‌డం లేదా విమ‌ర్శించ‌డం. అయితే చ‌రిత్ర అద్దం లాంటిది. అది అబ‌ద్ధం చెప్ప‌దు. ఒక‌సారి మ‌నం గ‌తంలోకి వెళితే ఏం జ‌రిగిందో అర్థ‌మ‌వుతుంది.

1983 నాటికి కాంగ్రెస్ ముస‌ల్దైపోయింది. ముదిరిపోయి ముఠా క‌క్ష‌ల‌తో జ‌నాల‌కి అస‌హ్యం తెప్పిచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ వ‌చ్చాడు. పాల‌నానుభ‌వం లేక‌పోయినా, కాంగ్రెస్‌ను వ‌దిలించుకోడానికి జ‌నం అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి కొన్ని వ‌ల‌స‌లు ఉన్నా, కొత్త ముఖాలు, కొత్త ర‌క్తంతో టీడీపీ నిండిపోయింది. వైఎస్ లాంటి నాయ‌కులు మ‌ళ్లీ బ‌తికించ‌క‌పోతే కాంగ్రెస్ అప్పుడే అయిపోయేది. అయితే ఆయ‌న్ని దూరం పెట్టి 89 నుంచి 94 వ‌ర‌కూ కాంగ్రెస్ అదే ఆట ఆడింది. మ‌ళ్లీ ఎన్టీఆర్‌.

త‌ర్వాత ఎన్టీఆర్ దిగిపోయారు. అది వెన్నుపోటు కావ‌చ్చు, చంద్ర‌బాబు భాష‌లో పార్టీ ప‌రిర‌క్ష‌ణ కావ‌చ్చు. బాబుని జ‌నం ఆమోదించ‌డానికి రెండు కార‌ణాలు. ఆయ‌న అప్ప‌టికి యువ‌కుడు. గ‌త ముఖ్య‌మంత్రుల కంటే భిన్నంగా వుండ‌డానికి ప్ర‌య‌త్నించారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని అనుకూల మీడియా అద్భుత‌మ‌ని కీర్తించేది. అప్ప‌ట్లో జ‌నానికి స‌మాచారం తెలిసే సాధ‌నం ప‌త్రిక‌లు మాత్ర‌మే. అదంతా వ‌ర్కౌట్ అయ్యింది.

2004లో వైఎస్ వ‌చ్చారు. కాంగ్రెస్ ముస‌లి నాయ‌క‌త్వం త‌ర‌హాలో కాకుండా నూత‌నంగా వ్య‌వ‌హ‌రించారు. సంక్షేమాన్ని విస్తృతం చేశారు. అనంత‌రం జ‌రిగిన విషాద ప‌రిణామాల్లో ఆయ‌న మృతి, రాష్ట్ర విభ‌జ‌న‌, జ‌గ‌న్ పార్టీ వ‌రుస‌గా జ‌రిగాయి.

2014లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్‌, బీజేపీ స‌పోర్ట్ కావ‌చ్చు, జ‌గ‌న్ అతివిశ్వాసం కావ‌చ్చు, రాష్ట్రం అప్పుడున్న స్థితిలో జ‌గ‌న్ కంటే బాబు ప‌రిపాల‌నాద‌క్షుడ‌ని జ‌నం న‌మ్మ‌డం వ‌ల్ల కావ‌చ్చు. తెలుగుదేశం గెలిచి బాబు ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఆయ‌న ఏదో చేస్తాడ‌నుకుంటే ఏం చేశాడు? నోటుకు ఓటు కేసులో త‌గులుకుని హైద‌రాబాద్ హ‌క్కుల‌న్నీ వ‌దిలి కేసీఆర్ అంటే భ‌యం పెట్టుకున్నాడు. అమ‌రావ‌తి క‌డ‌తాన‌ని ఐదేళ్లు వృథా చేశాడు. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో గ్రామాల్లో అవినీతి. కొత్త ముఖాలు అంటే లోకేశ్ ఒక్క‌డే. అన్నీ పాత ముఖాలే. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నం గ‌తి లేక ఓట్లేసిన వాళ్లు. గెలుపోట‌ములు ఎవ‌రికైనా స‌హ‌జ‌మే. కానీ చిత్తుచిత్తుగా ఓడిపోతే జ‌నం తిర‌స్క‌రించార‌ని, ఎత్తి చెత్త‌బుట్ట‌లో ప‌డేశార‌ని అర్థం. బాబు వ్యూహాత్మ‌క త‌ప్పిదం ఏమంటే  వైసీపీని చీల్చి, దాన్ని ఫినీష్ చేయాల‌నుకోవ‌డం. జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త ఏమంటే, ఆయ‌న్ని ఎంత‌గా వేధిస్తే అంత‌గా బ‌ల‌ప‌డ‌తాడు. 

వైఎస్ వార‌సుడిగానే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వచ్చినా, త‌ర్వాత జ‌నంలో పునాదిని బ‌లం చేసుకున్నాడు. కొన్నేళ్ల‌పాటు రోడ్ల మీద వుంటూ ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ వ‌చ్చాడు. ఈ రియాల్టీని గుర్తించ‌కుండా జ‌గ‌న్ చేసిన వాగ్దానాల వ‌ల్ల గెలిచాడ‌ని అనుకుంటే త‌ప్పు. ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ఏమీ చేయ‌కుండా మాట‌లు చెప్పాడ‌ని జ‌నం న‌మ్మారు. అది క‌రెక్ట్‌. ఆశ్చ‌ర్యం ఏమంటే టీ కొట్టు ద‌గ్గ‌ర పాలిటిక్స్ మాట్లాడేవాడికి కూడా జ‌గ‌న్ గెలుస్తాడ‌ని తెలుసు. కానీ కాల‌జ్ఞానాన్ని ఆక‌ళింపు చేసుకుని, అవపోసిన ప‌ట్టిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిల‌కు తెలియ‌దు. తెలిసినా రాయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లైంది. జ‌గ‌న్‌కి విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త వుంద‌ని, ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా ఇది స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని బాబు అనుకూల మీడియా ప్ర‌తిరోజూ చెబుతూ వుంటుంది. వ్య‌తిరేక‌త లేకుండా వుండ‌డానికి ఆయ‌నేం దేవుడు కాదు. అంద‌ర్నీ సంతోష‌ప‌ర‌చ‌డానికి జ‌గ‌న్ ద‌గ్గ‌ర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. పాల‌కుడికి వ్య‌తిరేక‌త వుంటే అది ప్ర‌జాస్వామిక మౌళిక ల‌క్ష‌ణం. అయితే వ్య‌తిరేక‌త ఎవ‌రి నుంచి?

పేద వ‌ర్గాలు సంతోషంగానే వున్నాయి. వ్య‌తిరేక‌త‌తో లేవు. అదే ఆయ‌న ఓటు బ్యాంక్‌. దాన్ని సంఘ‌టితం చేయ‌డ‌మే వ్యూహం. ఇంత‌కాలం బ‌డాబాబుల జేబుల్లోకి వెళుతున్న డ‌బ్బు, ఇపుడు పేద‌వాళ్ల ఇళ్ల‌కి చేరుతోంది. డ‌బ్బులిచ్చి, జ‌నాల్ని సోమ‌రులుగా చేస్తున్నాడ‌ని కొంద‌రి విమ‌ర్శ‌. అయితే ఎవ‌రు సోమ‌రులు?

ఒక‌రోజు మ‌గ్గం గుంత‌లో దిగి ప‌ని చేస్తే తెలుస్తుంది, రెండు రోజులు ఆటో న‌డిపితే తెలుస్తుంది క‌ష్ట‌మంటే ఏమిటో? జ‌గ‌న్ ఇచ్చే డ‌బ్బుల‌తో వాళ్లేం మేడ‌లు, మిద్దెలు క‌ట్ట‌రు. అదో సాయం, ఊర‌ట‌. అట్ట‌డుగు వ‌ర్గాల‌కి వేల కోట్లు పంపిణీ అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కూడా బ‌లం. ఒక కాంట్రాక్ట‌ర్‌కి రూ.100 కోట్ల లాభం వ‌స్తే దాన్ని బ్లాక్ మ‌నీగా, బంగారంగా దాచుకుంటాడు. ఒక కూలివాడికి ప‌ది వేలు వ‌స్తే దాంతో ఉప్పు, ప‌ప్పు కొనుక్కుని ఆ డ‌బ్బుని జ‌నంలోనే చెలామ‌ణి చేస్తాడు. ఆ డ‌బ్బుల‌తో తాగేస్తార‌ని ఒక కువిమ‌ర్శ‌.

తాగుడు ఒక సామాజిక వ్య‌స‌నం.శ‌తాబ్దాలుగా వుంది.ఎన్టీఆర్ మ‌ద్య‌నిషేధాన్ని ఫినిష్ చేసి, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టిన బాబుకి మ‌ద్యం గురించి మాట్లాడే అర్హ‌త వుందా? ఎన్నిక‌ల్లో క్వార్ట‌ర్ బాటిళ్ల‌ క‌ల్చ‌ర్ తెచ్చింది ఆయ‌న కాదా?

అనుభ‌వం మీద జ‌గ‌న్‌కి త‌త్వం బోధ‌ప‌డింది. వాగ్దానం చేసినంత ఈజీ కాదు మ‌ద్యాన్ని నిషేధించ‌డం. ఒక‌వేళ సీరియ‌స్‌గా నిషేధించి, ఓ 50 మంది ఎక్క‌డైనా క‌ల్తీ మ‌ద్యం తాగి చ‌నిపోతే జ‌గ‌న్‌ని సామాజిక నేరస్తుడ‌ని గోల‌గోల చేసేవాళ్లు.

జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల అభివృద్ధి ఆగిపోయింద‌ని ఇంకో విమ‌ర్శ‌.రోడ్లు స‌రిగా లేక‌పోవ‌డం నిజంగా స‌మ‌స్యే. ఇప్ప‌టికైనా స‌రి చేసుకోవాలి. ఇక ప‌నుల‌కి బిల్లులు రాక‌పోవ‌డం సామాన్యుల స‌మ‌స్య కాదు. జ‌గ‌న్ ఓటు బ్యాంక్ కాంట్రాక్ట‌ర్లు కాదు. సామాన్యులే.

జ‌గ‌న్ ఎందుకు అప్‌డేటెడ్ అంటే ఆయ‌న‌ది కొత్త త‌రం. ఎన్నిక‌ల వ్యూహం వేరే. పార్టీలో పాత త‌రం నాయ‌కుల్ని కొంద‌ర్ని మిన‌హాయిస్తే మిగిలిన వాళ్లంతా ఆయ‌న తయారు చేసుకున్న వాళ్లే. పాత ల‌గేజీని మోయ‌డానికి ఇష్ట‌ప‌డలేదు. కొత్త వాళ్లే ఆయ‌న బ‌లం. సంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తులు ఆయ‌న స్టైల్ కాదు. త‌న ఓట‌ర్లు ఎవ‌రో స్ప‌ష్ట‌త వుంది. వంద మందిలో 49 మంది వ్య‌తిరేకించినా 51 ఓట్లు వ‌చ్చిన వాడే విజేత అని తెలుసు.

డిజిట‌ల్ యుగంలో ఓట‌ర్‌ని ఎలా చేరాలో తెలుసు. త‌న‌కు ప‌డే ఓట్లు క‌రెక్ట్‌గా ప‌డితే చాలు. వ్య‌తిరేక ఓటు సంగ‌తి త‌ర్వాత చూద్దాం. మీడియా ఎంత వ్య‌తిరేకంగా రాసినా లెక్క చేయ‌డు.

బాబు విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇంకా మీడియా ప్ర‌చారం, టెలీకాన్ఫ‌రెన్స్‌లు, స‌మీక్షా స‌మావేశాలు వీటిని న‌మ్ముకున్నాడు. ఆ కాలం ఇప్పుడు లేదు అని ఆయ‌న‌కి తెలియ‌దు. చెప్పినా అర్థం కాదు. ప్ర‌తి మ‌నిషికీ ఒక టైమ్ వుంటుంది. బాబు టైమ్ వ‌చ్చి వెళ్లిపోయింది.

బాబు త‌ర్వాత లోకేశ్‌. ఆయ‌న మంగ‌ళ‌గిరిలో ఓడిపోయాడు. మ‌హామ‌హులే ఓడిపోయారు. ఓట‌మి ఒక నాయ‌కుడికి కొల‌బ‌ద్ధ కాదు. కానీ లోకేశ్ తెలుగుదేశం పార్టీని న‌డుపుతాడ‌ని, బాబు త‌ర్వాత ముఖ్య‌మంత్రి అర్హ‌త వుంద‌ని జ‌నం న‌మ్మ‌డం లేదు. పార్టీ కూడా న‌మ్మ‌డం లేదు. చంద్ర‌బాబు పార్టీని ముస‌లిపార్టీగా చేసి, యువ‌కుల్ని త‌యారు చేసుకోలేక‌పోయారు. అందుకే ఔట్‌డేటెడ్‌.

జ‌గ‌న్ రాజ‌ధాని క‌ట్ట‌లేక‌పోయారు. అదో ఎన్నిక‌ల అస్త్ర‌మ‌ని బాబు న‌మ్మ‌కం. మీరు ఏ ఊరికైనా వెళ్లి వెయ్యి మంది సామాన్యుల్ని అడ‌గండి. వాళ్లెప్పుడైనా ప‌నుల మీద రాజ‌ధాని వెళ్లారా? అని. లేద‌నే చెబుతారు. రాజ‌ధాని అవ‌స‌రం అధికారుల‌కి, నాయ‌కుల‌కి, కాంట్రాక్ట‌ర్ల‌కి త‌ప్ప జ‌నానికి కాదు. ఫోన్ బిల్లులు, క‌రెంట్ బిల్లులు సెల్‌ఫోన్‌లో క‌డుతున్న రోజుల్లో ఇంకా ఫైళ్లు మోసుకుని తిరిగే వ్య‌వ‌స్థ‌ని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కోరుకోవ‌డం లేదు.

కాలం త‌న తీర్పుని నిష్ప‌క్ష‌పాతంగా ఇస్తుంది. జ‌గ‌న్‌ని ఎదుర్కోవాలంటే టైమ్ మిష‌న్‌లో బాబు ఓ 25 ఏళ్లు వెన‌క్కి వెళ్లాలి. లేదా కొత్త యువ నాయ‌క‌త్వాన్ని త‌యారు చేసుకోవాలి. రెండూ సాధ్యం కావు.

జీఆర్ మ‌హ‌ర్షి