మన వ్యవస్థ డొల్లతనాన్ని బయట పెట్టే సినిమా జనగణమన (మలయాళం). నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో జన పేరుతో వుంది. పాలిటిక్స్, పోలీస్, మీడియాలు కలిసి ఆడే నాటకంలో తెలిసో తెలియక మనం పాత్రధారులం అవుతాం. సెన్సేషన్, టీఆర్‌పీ రేటింగ్స్ కోసం మీడియా అబద్ధపు వార్తల్ని ప్రచారం చేస్తే అవే నిజాలనుకుని సామాన్యులు ఎలా మోసపోతారో ఈ సినిమాలో చూడొచ్చు. ఎవరికి వాళ్లు చూసి ఫీల్ కావాల్సిన సినిమా. అందుకే కథ జోలికి వెళ్లను. 25 ఏళ్లు మీడియాలో పనిచేసిన నా లాంటి వాళ్లకి చాలా దృశ్యాలు గుచ్చుకుంటాయి. అయితే ఇది మీడియా సినిమా కాదు. కోర్ట్ రూం డ్రామా. గంటకు పైగా కోర్ట్ సీన్‌లతో బిగి సడలకుండా చేసిన స్క్రీన్‌ప్లేకి దండం. చూస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు జ్ఞాపకం వచ్చాయి.
2019లో దిశ కేసు జరిగింది. నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. అందరూ సంబరాలు చేసుకున్నారు. మీడియా హైలెట్ చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఒక మైనర్ బాలిక రేప్ జరిగింది. నిందితులు డబ్బున్న వాళ్ల పిల్లలు. అరెస్ట్ చూపడానికే చాలా టైమ్ పట్టింది. పోలీసులు, మీడియా కూడా స్పందిస్తున్నారు కానీ, పెద్దగా ఫోకస్ లేదు. నిందితులకి శిక్ష పడుతుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. కారణం డబ్బు. అంటే న్యాయం, చట్టం ఈ దేశంలో అందరికీ సమానం కాదు. పేద వాళ్లకి సత్వర శిక్షలు, డబ్బున్న నేరస్తుల్ని కాపాడే ప్రయత్నం లేదంటే మొక్కుబడి శిక్షలు. ఈ సినిమాలో హీరో పృధ్వీరాజ్ లాయర్‌గా చెప్పేది ఇదే.
ఎన్‌కౌంటర్ కేసుల్లో మీడియా ఎక్కువగా పోలీస్ వెర్షన్‌నే ప్రజెంట్ చేస్తుంది. పోలీసులకి వ్యతిరేకంగా రాజకీయ కారణాలు వుంటే తప్ప రాయరు. పోలీస్ వెర్షన్‌లో ఎక్కువ అబద్ధాలే వుంటాయి.
98లో తిరుపతి సమీపంలో సీరియల్ కిల్లర్స్ ఎన్‌కౌంటర్ జరిగింది. చేతులు, కాళ్లకి బేడీలు వేసినప్పటికీ ఆయుధాలు లాక్కొని పారిపోతూ వుంటే పోలీసులు కాల్చేశారు. కాళ్లకి బేడీలు వుంటే 10 అడుగులు కూడా పారిపోలేం. ఈ కేసులో ఏకంగా అరకిలోమీటర్ పారిపోయారు. ఫేక్ అని తెలిసినా ఎవరూ రాయలేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్లు 42 మంది అమాయకుల్ని చంపారు. వాళ్లకి ఆ శిక్ష కరెక్టే అని సమాజం అంగీకరించింది. చనిపోయిన హంతకులు పేదవాళ్లు. అయితే ఒకవేళ ధనిక కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆ హత్యలు చేస్తే పోలీసులు, మీడియా ఇదే రకంగా స్పందిస్తారా?
1989లో రేణిగుంట సమీపంలోని శెట్టిపల్లి ఎస్‌బీఐలో దోపిడీ చేయడానికి ఇద్దరు కుర్రాళ్లు బొమ్మ తుపాకితో ప్రయత్నించారు. వాళ్లలో ఒకన్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసుల్ని మీడియా పొగిడింది తప్ప రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశం వున్నా ఎందుకు చంపారని ఎవరూ అడగలేదు.
ఎన్‌కౌంటర్ కూడా అంత ఈజీ కాదు. సెన్సిబుల్‌గా ఉన్న పోలీసులు చేయలేరు. నా మిత్రుడు ఒకడు ఎస్ఐగా చేస్తున్నపుడు ఒక అమాయకున్ని ఎన్‌కౌంటర్ చేశాడు. అది గుర్తు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునే వాడు. సెన్సిటివ్ కావడం వల్లనేమో అతను కూడా చిన్న వయసులోనే అనారోగ్యంతో పోయాడు.
సెన్సేషన్ పేరుతో మీడియా చేసే అరాచకాలు అన్నీఇన్నీ కాదు. కొన్నేళ్ల క్రితం ముంబై పోలీసులు మదనపల్లెకు వచ్చారు. దావుద్ మాఫియాలో పని చేస్తూ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన రజాక్ అనే వ్యక్తి కోసం వాళ్లు వెతుకుతున్నారు. మదనపల్లెలో వున్నాడని సమాచారం. మీడియా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. మదనపల్లెలో రజాక్ ఆటో తోలుతున్నాడని కూడా కనిపెట్టింది. రజాక్‌ని అరెస్ట్ చేశారు. తాను కొంత కాలం ముంబయ్‌లో ఉన్న మాట నిజమే అని, అయితే మాఫియాతో తనకి సంబంధం లేదని చెప్పాడు. పత్రికల్లో, టీవీల్లో రజాక్ జీవిత చరిత్ర, కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు వచ్చేసింది. రెండు రోజుల తర్వాత తాము వెతుకుతున్న రజాక్ ఇతను కాదని ముంబయ్ పోలీసులు వెళ్లిపోయారు. రజాక్ నేరస్తుడని కథనాలు రాసి, చూపించిన మీడియా, రజాక్ అమాయకుడనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
దీని ఫలితం రజాక్ తల్లి ఆత్మహత్య చేసుకుంది. రజాక్‌ను ఇల్లు ఖాళీ చేయించారు. నడపడానికి ఆటో ఎవరూ ఇవ్వలేదు. ఊరు వదిలి ఎటో వెళ్లిపోయాడు. మీడియా వల్ల పరువు పోగొట్టుకుని, నాశనమై పోయిన వాళ్లెందరో ఉన్నారు.
జనగణమన సినిమా ఎక్కడా టెంపో తగ్గదు. కథ నుంచి పక్కకి వెళ్లదు. పాప్‌కార్న్ సినిమాలు తీసి జబ్బలు చరుచుకుని, టికెట్ రేట్లు పెంచి మరీ ప్రేక్షకుల్ని చావగొట్టే చాలా మంది మన తెలుగు డైరెక్టర్లకి పెద్దబాలశిక్ష పుస్తకం లాంటిది.
జీఆర్ మహర్షి