Advertisement

Advertisement


Home > Politics - Opinion

జూనియర్ ఆర్టిస్టులా మారిన పసుపు జెండా

జూనియర్ ఆర్టిస్టులా మారిన పసుపు జెండా

పసుపు జెండా ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పుకునే ముందు ఫుడ్ గురించి చెప్పుకుందాం. 

అదేంటి? దానికీ, దీనికీ లింకేంటి అంటారా? 

నిజంగానే లింకుంది! అదేంటో కూడా చెప్పుకుందాం. 

మనకి రకరకాల రుచులు నచ్చొచ్చు. ఉదాహరణకి మసలాదోస, బిర్యాని, పాయసం, పులిహార..ఇలా ఒక్కొక్క ఐటం ని దాని రుచిలోని వైవిధ్యాన్ని బట్టి ఆస్వాదిస్తుంటాం. 

అఫ్కోర్స్ ఒక్కోసారి ఒక్కోటి తినాలనిపించొచ్చు. 

అలా కాకుండా ఈ ఫుడ్ ఐటంస్ అన్నీ కలగాపులగంగా కలిపేసి ఒక ప్లేటులో పెట్టి తినమన్నారనుకోండి? తింటామా? అసలు తినగలమా అని?

సరిగ్గా అదే ఫీలింగొస్తోంది ఇప్పుడు కలిసిపోయిన రకరకాల పార్టీ జెండాలు చూస్తుంటే. 

ఒక్కో పార్టీకి ఒక భావజాలముంటుంది. ఒక్కో ప్రధాన ఎజెండా ఉంటుంది. ప్రజలకి ఒక్కోసారి ఒక్కో పార్టీ నచ్చొచ్చు. అందుకే ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలొ ఉండదు.

అలా మార్చే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజలకుంది. మెజారిటీ జనం ఎలా కోరుకుంటే అలా జరిగుతుంది. 

గతంలో కంటే ప్రజల్లో రాజకీయ స్పృహ, చైతన్యం, అవగాహన పెరుగుతూ వస్తోంది. ఏదో ఒక పేపరో, టీవీనో చెప్తే ఆ మాయలో పడిపోయేవాళ్లకంటే అన్ని సామాజికమాధ్యమాల్లోని వార్తలు, విశ్లేషణలు చూస్తూ ఒక అభిప్రాయానికి వస్తున్నవారు పెరుగుతున్నారు. 

బీజేపీ జెండాల మధ్యలో జనసేన జెండాలు, జనసేన జెండాల నడుమ తెదేపా జెండాలు దర్శనమిస్తున్నాయి తెలంగాణా ఎన్నికల ప్రచారంలో. అదే చికాకుగా ఉంటే, తాజాగా కాంగ్రెస్ ప్రచారంలో తెదేపా జెండాలు కనిపించాయి. 

అందుకేనేమో ఎంపీ విజయసాయిరెడ్డి చిర్రెత్తి ఒక ట్వీట్ పెట్టారు. 

"ప్రియాంకా వాధ్రా ర్యాలీలో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి, పురందేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణాలో కాంగ్రెస్ తో జత కట్టడంపై ఏమంటారో మరి!".

నిజమే, అసలు ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో, ఎందుకు తెలుపుతున్నారో అర్ధం కానీ కంగాళీతనం నెలకొని ఉంది. 

ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీకి ఎనిమిది సీట్లిచ్చి బీజేపీ ఎందుకు పోటీ చేయమందో....డూడూ బసవన్నలాగ ఏం సాధించి చూపిద్దామని పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకున్నాడో అర్ధం కాదు. 

మధ్యలో తెదేపా జెండాలు ఎందుకొస్తున్నాయంటే...దానికి ఎవరికి తొచింది వారు చెప్తున్నారు. ఆంధ్రలో పొత్తులో ఉన్న జనసేనకి మద్దతుగా పసుపు జెండాలు మధ్యలో వస్తున్నాయని కొందరంటుంటే, కాదు...కేంద్రంలో పెద్దల్ని మచ్చికచేసుకోవడానికి బీజేపీకి మద్దతుగా ఎగురుతున్నాయని చెప్తున్నారు కొందరు. 

ఇక కాంగ్రెస్ ప్రచారంలో తెదేపా జెండాలు ఎందుకంటే...రేవంత్ రెడ్డి మీద చంద్రబాబుకున్న ప్రేమకి నిదర్శనమంటున్నారు. 

అసలు తగుదునమ్మా అంటూ ప్రతి పక్క పార్టీ ప్రచారంలోకి తెదేపా జెండాలెందుకు మోసుకొస్తున్నారో కామెడీగా! 

పెళ్లిళ్లల్లోనూ..పబ్లిక్ ఫంక్షన్స్ లోనూ చూడండి...గ్రూప్ ఫోటోల్లో పడడానికి తాపత్రయ పడే బాపతు జనం కొందరుంటారు. కేవలం ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. వాళ్లని పిలవకపోయినా, ఫోటో కోసం ఎగబడుతుంటారు. తెదేపా జెండాల పరిస్థితి కచ్చితంగా అలాగే ఉంది ఇప్పుడు. 

మొట్టమొదటి సారి తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీ పోటీ చేయడంలేదన్న చేదు నిజాన్ని దిగమింగుతూనే..ఉనికి కోసం కనీసం ప్రతి పార్టీ ప్రచారంలోనూ తమ పసుపు జెండాని ఎగరేసుకుంటున్నట్టు ఉన్నారు తెదేపా వారు. 

కానీ దానివల్ల తెదేపా పరిస్థితి మరీ వికటిస్తోంది. ఒకప్పుడు స్టార్ లా వెలిగి, ఇప్పుడు జూనియర్ ఆర్టిష్ట్ కంటే దయనీయంగా ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్న పార్టీగా కనిపిస్తోంది తెదేపా. 

ఒకప్పటి హుందాతనం, ఆభిజాత్యం అంతా మంటకలిసి గూడు చెదిరిన పక్షి ఆ కుప్ప మీద, ఈ కొమ్మ మీద ఎలా వాలుతుంటుందో..అలా బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిని తెదేపా బయటపెట్టుకుంటున్నట్టు ఉంది. 

ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడు ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నట్టు? తన పార్టీ జెండా గౌరవాన్ని దిగజార్చే పనులు చేయొద్దని స్టేట్మెంట్ ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వనట్టు?

ఆయన సరే... లోకేష్ అయినా, ఇతర నాయకులైనా ఈ పరిస్థితిని గమనించి బాబు దృష్టికి తీసుకెళ్ళొద్దూ! 

మద్దతు పేరుతో ఎక్కడపడితే అక్కడ పసుపు జెండా వాడకాన్ని నిలువరించాలి కదా!

వైకాపాకి, బీఆరెస్ కి సఖ్యత ఉందంటారు. అలాగని వైకాపా జెండాలు బీఆరెస్ ప్రచారంలో ఎగరడంలేదు కదా! 

ఇక్కడ చెప్పేదేంటంటే జెండాకి ఒక గౌరవముంటుంది. దానిని దిగజారిస్తే పోయేది పార్టీ పరువే. 

"మా రాజకీయం మాకుంటుంది..అంతా తెలిసే మౌనంగా ఉన్నాం" అని తెదేపా వాళ్లు చెప్తే వారి అవివేకానికి జాలిపడాలంతే. 

వాస్తవం ఇలా ఉన్నా....ఒకవేళ రేపు కాంగ్రెస్ గెలిస్తే ఆ ఘనత మధ్యలో ఎగరేసిన తమ పసుపు జెండాదే అని చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడరు తెదేపా సానుకూల మీడియా వాళ్లు. ఎవరు నమ్ముతారో ఎంతమంది నవ్వుతారో అని కూడా ఆలోచించరు. 

అదీ పసుపు జెండా దయనీయ కథ. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?