సినిమా నచ్చితే చాలా సార్లు చూడడం అలవాటు. కాంతారా కూడా చూసాను. ఈ సినిమా కోట్లాది మందికి నచ్చింది. విజయం సాధించిన సినిమాల మీద ఎన్ని విశ్లేషణలైనా చేయొచ్చు. కానీ విషయం అది కాదు. ఇది మానవాతీత శక్తి కథ. చిన్నప్పుడు పూజలు, పూనకాలు, నమ్మకాలు మధ్య పెరిగాను. నేనే కాదు, గ్రామీణ మూలాలు ఉన్న వాళ్లంతా దేవుళ్లు, విశ్వాసాల మధ్య పెరుగుతారు.
వెంకటేశ్వరుడు, శివుడు వీళ్లంతా డబ్బున్న దేవుళ్లు. పెద్దపెద్ద గుళ్లలో వుంటారు. నేను ఎక్కువగా చూసింది మారమ్మ, దుగ్గిలమ్మ, చౌడమ్మ, వులిగమ్మ. వీళ్లకి పెద్ద గుళ్లు వుండవు. చిన్న విగ్రహం, లేదా ఒక రాయి. భక్తులంతా కూలీ జనం, పేద వాళ్లు. జాతరలో పూనకం వచ్చిన పూజారి వల్ల వీళ్ల జీవితాలేం మారవు. ఎవరో భూస్వామి ఆ రోజుకి కల్లు, సారాయి తాగించి ఇంత మాంసం భోజనం పెడతాడు. లేకపోతే సొంత డబ్బులతోనే కోళ్లు కోసుకుంటారు.
కాంతారా పేదవాళ్ల కథే అయినా, ఒక రాజుతో ప్రారంభం అవుతుంది. 1847 అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బలంగా వుంది. సిపాయిల తిరుగుబాటుకి ఇంకా పదేళ్లు టైమ్ వుంది. పడమటి కనుమల్లో కుందాపూర్ నుంచి ఉడిపి వరకూ ఉన్న ఒక సంస్థానం. ఆ రాజుకి మనశ్శాంతి లేదు. ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బ్రిటీష్ కంపెనీ భయం. మైసూర్ మహారాజ్‌ల తాకిడి. పక్కనున్న గోవాలో పోర్చుగీసులు. ఇన్ని సమస్యలుంటే నిద్రపడుతుందా?
సమస్యలు చుట్టుముట్టినప్పుడు దేవుడి అండ కావాలి. వెతికాడు. పంజుర్లి రాయి తగిలింది. నిజానికి దేవుడు కంటే అక్కడున్న గిరిజనుల అవసరం రాజుకి చాలా వుంది, జీతం అడగని సేవకులు, సైనికులు.
1970 నాటికి ఆయన వారసుడు బొంబాయి నుంచి వచ్చాడు. పల్లెలో వున్న ఆస్తుల్ని, నగరాల్లో పదింతలు చేయొచ్చని డబ్బున్న వాళ్లు అప్పటికే కనిపెట్టారు. బొంబాయి నుంచి భూముల్ని వెనక్కి తీసుకోడానికి వచ్చాడు. పేదవాళ్లకి ఇచ్చిన భూముల రేట్లు పెరిగాయి. పంజుర్లి దేవుడు చెబితే కోర్టుకి వెళ్లాల్సిన అవసరం కూడా వుండదు. కానీ దేవుడు ఒప్పుకోడు. కోర్టు మెట్ల మీద తన శక్తిని చూపుతానని అంటాడు. మాట్లాడేది దేవుడా? నర్తకుడా అంటే, తన మహిమ చూపుతానని అడవిలో అదృశ్యం అవుతాడు.
1990 నాటికి బొంబాయి భూస్వామి కొడుకు పల్లెలోనే వున్నాడు. అతను తండ్రిలా మూర్ఖుడు కాదు. ఇక్కడి భూముల్ని లీగల్‌గా తీసుకునే పద్ధతి తెలుసు. గిరిజనుల్ని నమ్మించి మోసగించే తెలివి వుంది. గేమ్ మొదలైంది. చివరికి యుద్ధమే జరిగింది. క్షేత్రపాలిక గుళిగ హీరోకి పూని శత్రు సంహారం చేసి పేదవాళ్ల భూముల్ని కాపాడుతాడు. కోలంలో ఫారెస్ట్ అధికారులతో పేదవాళ్లు చేతులు కలిపి, నర్తకుడి రూపంలో వున్న దేవుడు, తండ్రిలాగే అడవిలోకి అదృశ్యమవుతాడు.
కానీ ఈ దేవుడు ఇద్దరు ఆడవాళ్లకి జీవితాంతం అన్యాయం చేసాడు. హీరో తండ్రి అకస్మాత్తుగా మాయమైతే తల్లి ఎంత దుక్క పడి వుంటుంది? కొడుకుని పెంచడానికి ఎన్ని అవస్థలు పడి వుంటుంది? ఆ కష్టమే మళ్లీ హీరోయిన్‌కి రిపీట్ అయ్యింది. కడుపులో ఉన్న బిడ్డ తండ్రి ముఖం చూడనే లేదు.
తండ్రీకొడుకులు మాత్రం అలౌకిక ఆనందంతో అడవిలో కలిసి వుంటారు. సినిమా కథకి కొన్ని పరిధులు, పరిమితులుంటాయి. అన్ని కోణాల్లో కథకి న్యాయం చేయలేరు. కమల, లీల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలంటే అది వేరే. సినిమాల్లో అందరూ ఎక్కువగా మగవాళ్లే పని చేస్తారు కాబట్టి ఇది చర్చకు కూడా వచ్చి వుండదు.
దైవిక శక్తుల సంగతి పక్కన పెడితే ఇది ప్రధానంగా భూమి కథ. రూల్స్ ప్రకారం వెళ్లే అటవీ అధికారి, మోసంతో సంతకాలు పెట్టించుకుని భూమి కాజేయాలని చూసే విలన్. నిజానికి వీళ్లిద్దరూ కలిసి పోవాలి. వాస్తవానికి జరిగేది ఇదే. పేదవాళ్లని అడవుల నుంచి తరిమేసి పునరావాసం పేరు పెడతారు. కానీ ఇక్కడ దేవుడు రెండుసార్లు పేదవాళ్ల భూమిని కాపాడతాడు.
బాగా చదువుకున్న వాళ్లు కూడా వీసాలు, ప్రమోషన్లు, వ్యాపార లాభాల కోసం గుళ్ల చుట్టూ తిరుగుతూ, దేవుడు కాపాడతాడని నమ్ముతున్నప్పుడు ఆదివాసులు తమని పంజుర్లి శక్తి కాపాడుతుందని నమ్మడంలో తప్పేం వుంది?
కాంతారాలో కొత్తగా చెప్పిందేమీ లేదు. దుష్ట సంహారం కోసం దేవుడు అవతారం ఎత్తుతాడని అన్ని పురాణాల్లో చదువుకున్నదే. అదే జరిగింది. దేవుడు కావచ్చు, హీరోలోని అంతర్లీన శక్తి కావచ్చు. కొడుకు దారి తప్పిన ప్రతిసారీ తండ్రి ఆత్మ హెచ్చరిస్తూ వుంటుంది. చివర్లో కూడా అదే జరిగింది.
సినిమాల్లో దళిత కోణం కూడా వుంది. అయితే చెప్పాల్సిన కథ అది కాదు కాబట్టి పెద్దగా పోకస్ చేయలేదు. ప్రేమ కురిపించే భూస్వామి తమని తాకడని, ఇంట్లోకి రానివ్వడని హీరోకి తెలుసు. అయితే ఎపుడైతే భూస్వామే అసలు నేరస్తుడని గ్రహిస్తాడో, నేరుగా ఇంట్లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని అన్నం తింటాడు. మీరు మా ఇంటికి వస్తే, మేం రాకూడదా? అని అడుగుతాడు.
భూస్వామిలో ఉన్న కుల అహంకారం చెలరేగి యుద్ధం ప్రకటిస్తాడు. దానికి ముందు ఇల్లు శుద్ధి చేయమంటాడు. అంతకు ముందు హీరో కూడా శుద్ధి అనే పదం వాడుతాడు. దాని అర్థం అగ్రవర్ణాల మోసం అర్థం చేసుకున్నానని. పైకి సాధారణ కథలా అనిపించినా, ఇది ఆషామాషీ స్క్రీన్ ప్లే కాదు. ఫిల్మ్ స్కూళ్లలో పాఠ్యాంశం.
ప్రేక్షకులు విరగబడి చూడడానికి మ్యూజిక్, ఫొటోగ్రఫీ, యాక్టింగ్ ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా అసలు కారణం దేవుడు కాపాడుతాడనే నమ్మకం మనకి సంతోషం కలిగిస్తుంది. ఇగోని సంతృప్తిపరుస్తుంది కాబట్టి.
జీఆర్ మహర్షి