2018లో యూపీ పోలీస్ శాఖ అటెండర్ పోస్టులకి అప్లికేషన్లు కోరింది. 62 పోస్టులకి 93 వేల మంది అప్లై చేశారు. వీళ్లలో 3700 మంది పీహెచ్‌డీలు, 28 వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్స్. నిరుద్యోగం రేంజ్ ఇది. అదే సంవత్సరం 90 వేల ఖాళీలకి రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇస్తే అప్లికేషన్లు 2 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అగ్నిపథ్ నిరసన, ఆగ్రహానికి ఇది కారణం. నిజంగా నిరుద్యోగం ఇంత తీవ్రంగా వుందా అంటే లేదు.
మన దృష్టిలో గవర్నమెంట్ ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. ప్రభుత్వంలో వస్తే భద్రత, పెన్షన్. ప్రైవేట్‌లో అవి రెండూ వుండవు. పైగా గొడ్డు చాకిరీ.
1980-90ల మధ్య వున్నదే అసలైన నిరుద్యోగం. చేయడానికి ఏ పనీలేని కాలం. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే జీవించడానికి చాలా తక్కువ ఆప్షన్లు. చిన్న కిరాణా కొట్టు, లేదా ప్రయివేట్ స్కూల్లో టీచర్. ఈ అసహనంతో తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేవాళ్లు. నక్సలిజం పీక్స్‌లో వుండడానికి ఇదో కారణం.
ఎపుడైతే ప్రపంచీకరణ ప్రారంభమై డిజిటల్ యుగం వచ్చిందో ఏదో ఒక ఉపాధి ముఖ్యంగా పట్టణాల్లో దొరుకుతోంది. పల్లెలు ఖాళీ అయి పట్టణాలు కిటకిటలాడాయి. ఆర్థిక భద్రత, పనిగంటలు ఇలాంటి విషయాలు పక్కన పెడితే చేయాలనుకున్న వాడికి ఏదో ఒక పని దొరకడం గతంలో అంత కష్టం కాదు. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, సూపర్‌మార్కెట్ ఉద్యోగులు, సెల్‌ఫోన్ షాపులు ఇలా కొత్త ఉద్యోగాలు ఒక్కో నగరంలో లక్షల్లో సృష్టి జరిగింది.
డీమార్ట్‌లు వచ్చి కిరాణా కొట్లను తినేసిన మాట నిజమే కానీ, మన దేశంలో సాంప్రదాయకమైన రిటైల్ బిజినెస్‌ని చంపడం అంత సులభం కాదు. హైదరాబాద్ నగరంలో జరిగే సంతలే దీనికి ఉదాహరణ.
పకోడాలు అమ్మడం కూడా మోదీ దృష్టిలో ఒక ఉద్యోగమే అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కామెంట్స్ చేశారు. ఈ దేశంలో కొన్ని లక్షల మంది పకోడావాలాలు ఉన్నారని, మన ఎకానమీలో వీధి వ్యాపారులది కీలక పాత్ర అని తెలియకుండా ఆయన ఆర్థిక మంత్రి ఎలా అయ్యారో? చేస్తున్న పని పట్ల గౌరవం లేకనే, మనకి గవర్నమెంట్ ఉద్యోగాల పిచ్చి పట్టుకుంది. నిరుద్యోగానికి సరిపడా గవర్నమెంట్ ఉద్యోగాల్ని ఏ ప్రభుత్వమూ సృష్టించలేదు. వ్యాపారవేత్తలకి ఆప్తుడైన మోదీ అస్సలు సృష్టించలేడు.
చిదంబరం సార్‌కి తెలియనిదేమంటే పకోడాలు అమ్మడం కూడా అంత సులభమేం కాదు. వేధించకుండా పోలీసులకి డబ్బులివ్వాలి. అమ్మకాలు జరిగే స్థలానికి లోకల్ దాదాకి పగిడి కట్టాలి. చాలా మంది మాఫియా అంటే ముంబయ్ ధారావిలో లేదా బైకుల్లాలో వుందనుకుంటారు. ఏ అండ లేకుండా ఒక వ్యాపారం పెట్టి చూడండి. మాఫియా మీ ఇంటి పక్కనే వుందని అర్థమవుతుంది. మాఫియా అంటే సినిమాలోలా చెక్క పీపాల డెన్‌ల్లో వుండదు. రాజకీయ పార్టీల జెండా కింద వుంటుంది.
చెప్పొచ్చేదేమంటే పని కావాలంటే దొరుకుతుంది. డిగ్నిటి కోసం వెతక్కండి. వచ్చే 20 ఏళ్లలో మనది అమెరికా మోడల్. బడా పెట్టుబడిదారులు, కూలివాళ్లు మాత్రమే వుంటారు. చిన్నామధ్య తరగతి వ్యాపారులు కార్పొరేట్ సంస్థల పొట్టలో జీర్ణమైపోతారు.
జీఆర్ మహర్షి