లోకేష్ బాబు! నువ్వు నిజంగా స్టాన్ ఫోర్డేనా?

మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన లేకపోతే అస్సలు బాగోదు. లోకేష్ బాబు దృష్టిలో తాను అందరికంటే విద్యాధికుడినని.. వైసీపీలో అందరూ పదొ తరగతి ఫెయిలైన బ్యాచ్ అని. జగన్ మోహన్ రెడ్డి కూడా…

మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన లేకపోతే అస్సలు బాగోదు. లోకేష్ బాబు దృష్టిలో తాను అందరికంటే విద్యాధికుడినని.. వైసీపీలో అందరూ పదొ తరగతి ఫెయిలైన బ్యాచ్ అని. జగన్ మోహన్ రెడ్డి కూడా తనంత చదువుకోలేదని లోకేష్ అభిప్రాయం. 

మరి ఆ చదువుని బయటకు తీయొచ్చుకదా. 

ఒక పక్కన అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి పూర్తి గణాంకాలతో అమరావతి విషయంలో జరిగిన అన్యాయాల గురించి, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి విజువల్ ప్రెజెంటేషన్ చేస్తుంటే లోకేష్ కూడా దానిని నిరసిస్తూ తనదైన పీపీటీయో మరొకటో తయారు చేసి ప్రెజెంట్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో తనకి స్థానం లేకపోయినా సొంత మీడియా ఛానల్స్ ద్వారా కౌంటర్ ఆర్గ్మెంట్ వినిపించవచ్చు కదా. సైలెంటుగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి చెప్పినవన్నీ నిజాలని ఒప్పుకున్నట్టే కదా. 

గతంలో చంద్రబాబు కూడా మాట్లాడితే పీపీటీ స్లైడ్స్ పట్టుకుని తిరిగేవాడు తన హైటెక్ సీయం ఇమేజ్ ని కాపాడుకోవడానికి. 

మరి ఏకంగా స్టాన్-ఫోర్డ్ లో చదువిన లోకేష్ ఆ పని చేయొచ్చు కదా! ఎందుకో మరి ఎప్పుడూ స్టాన్-ఫోర్డ్ విస్యార్థిలాగ ప్రవర్తించలేదు, మాట్లాడలేదు. కనీసం తన భార్య బ్రాహ్మణి మాదిరిగా ఆపకుండా ఇంగ్లీషులో ప్రసంగం చేయగలగడం కూడా ఎవ్వరూ చూడలేదు. పక్క రాష్ట్రంలో కేటీయార్ ఆంగ్ల ప్రసంగాల స్థాయి అందరికీ తెలుసు. మరి ఫారిన్ రిటర్న్ విద్యార్థి లోకేష్ బాబు మాటేవిటి?

అదలా ఉంటే తెదేపా తండ్రీకొడుకుల వ్యవహారం చూస్తుంటే అసలు మైండ్ వాడుతున్నారా అనిపిస్తుంది. 

ప్రత్యర్ధిని ఓడించాలంటే ముందు పోరాడాలి. అది కూడా ఎక్కడ? ప్రత్యర్ధి ఉన్న బరిలోకి దిగి. అంతే కానీ ప్రత్యర్ధి బరిలో ఉంటే తాము ఇంట్లో కూర్చుని ఆడి గెలవడం సాధ్యమా? 

కానీ ముందు నుంచి చంద్రబాబు, లోకేషుల తీరే సెపెరేటు. ఒకపక్కన జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకవుతూ పాదయాత్రలు చేస్తే తండ్రీకొడుకులు మాత్రం ఎన్నారైల నుంచి వనరులను సేకరించి మీడియాకి పంచిపెట్టి రాజకీయం నడిపారు. మీడియా ఏది చెబితే అది జనం ఫాలో అయ్యి ఓట్లేసెస్తారని బలంగా నమ్మే పార్టీ అది. అఫ్కోర్స్ మీడియా ప్రమేయం వలన పెరిగి పెద్దదైన పార్టీయే కదా! కానీ అదంతా ఎప్పుడో 40 ఏళ్ల మాట. 

క్రమంగా కాలం మారుతూ వస్తోంది. ఇప్పుడు మీడియా అనేది ఏదో కొద్దిమంది మీడియా అధినేతల చేతుల్లో లేదు. సోషల్ మీడియా రూపంలో ప్రజల చేతుల్లో ఉంది. ఫేస్బుక్కులోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టాలోనూ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి ఇవాళ మీడియానే. ఎవరి వార్తాసేకరణ వారిది, ఎవరి ట్రోలింగులు వాళ్లవి. ఇక్కడ ట్రోలింగుల్ని కూడా తప్పుపట్టడానికి లేదు. ఒకప్పటి కార్టూన్స్ కి అవి కొనసాగింపు మాత్రమే. 

ఇవన్నీ కాలంతో పాటూ వచ్చిన మార్పులు. అందుకే ఎంత మీడియా సపోర్ట్ ఉందనుకున్నా 2019 ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలయ్యింది. కారణమేంటంటే జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలబడి ఆడాడు. పాదయాత్రలు చేసాడు. జనంతో తిరిగాడు. తెదేపా సారధులు బరి విడిచి ఎక్కడో పోరాడారు. అందుకే ఓడారు. 

అసలైతే ఏం చెయ్యాలి?

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అంటే లోకేష్ కూడా పాదయాత్ర చేయాలి (చంద్రబాబు వయసుకి అది కష్టమనుకుంటే). అలాగే ఇంకా వృద్ధుడు కాలేదు కనుక పవన్ కళ్యాణ్ కూడా జనసేన పక్షాన అదే పని చెయ్యాలి. 

జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికి పర్యటనకి వెళ్తుంటే లోకేష్ కూడా వెళ్లాలి. జనసేనాని అయినా అంతే. 

కుప్పానికి జగన్ వెళ్తున్నాడనగానే చంద్రబాబు రెండు మూడు రోజుల ముందే అక్కడకు వెళ్లి జనం ముందు నిలబడ్డారు. దేనికి? తన సొంత ఇలాకాలో జగన్ అడుగుపెడుతున్నాడు కాబట్టి కోట కూలే ప్రమాదముందని భయపడే కదా! ఆ భయం ఎప్పుడూ ఉండాలి. ఒక్క కుప్పం విషయంలోనే కాదు, ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ప్రతి నియోజకవర్గం విషయంలోనూ ఉండాలి. మంగళగిరి ప్రజలతో మమేకమవడంతో ఆపకుండా వీలుంటే పులివెందులకి వెళ్లి లోకేష్ అక్కడ కూడా రాజకీయం చేయగలగాలి. వైకాపా ప్రభుత్వం ఆ నియోజకవర్గంలో ఇంకా పూర్తి చేయని పనులేవో గుర్తించి ఆ పనుల్ని పూర్తి చేసే పని పెట్టుకోగలగాలి. అంత దమ్ము, ధైర్యం, తెలివి, తెగింపు, ఓపిక ఉంటే ఈ పాటికి తెదేపా పరిస్థితి వేరేగా ఉండేది. 

తండ్రీకొడుకులిద్దర్లోనూ పోరాటం ఎలా చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో అస్సలు తెలియనితనం. పక్కనున్న పచ్చమీడియా ఎలా చెబితే అలా ఆడుతున్న తోలుబొమ్మల్లా ఉన్నారు ఇద్దరూ! అదే జగన్ మోహన్ రెడ్డికి విపరీతంగా కలిసొస్తోంది. 

వైకాపా పనైపోయిందని, ఈ సారి తెదేపా సత్తా చాటుతుందని, ప్రజలు జరుగుతున్న అన్యాయాల్ని చూస్తున్నారని పచ్చ మీడియా అనుకుని చాటింపు వేస్తోంది తప్ప అసలు గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ వేరుగా ఉన్నాయి. తండ్రీకొడుకుల వ్యవహారం ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికలకంటే దారుణమైన ఫలితాలు తెదేపా మూటకట్టుకోవడం తధ్యంలా ఉంది. రాజకీయంగా ఎందుకూ పనికిరాని అమరావతి ఉద్యమాన్ని పట్టుకుని వ్రేలాడడం (స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ప్రభావమూ చూపలేదు కనుక), జనంతో మమేకం కాకుండా ఎన్.టి.ఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంపైన రియాక్ట్ కావడం, అసెంబ్లీలో దేని మీదా లాజికల్ చర్చ చేయకుండా స్పీకర్ ముందు రచ్చచేసి సస్పెండయ్యి బయటికి పోవడం వంటివేవీ ఒక్క ఓటు కూడా కొత్తగా తెచ్చిపెట్టే అంశాలు కావు. 

ఇప్పటికైనా కళ్లు తెరవాలి. లోకేష్ బాబు తన స్టాన్-ఫోర్డ్ తెలివితేటల్ని బయటకు తీయాలి. లేకపోతే తనది డబ్బిచ్చి కొనుక్కున్న దొంగ సర్టిఫికేటేమోనన్న అనుమానాలు జనానికి రావొచ్చు. 

లోకేష్ కచ్చితంగా రాజకీయ యుద్ధానికి కొత్త రూపం ఇవ్వాలి. యువతకి తాను ఆదర్శవంతమైన నాయకుడనని ప్రూవ్ చేసుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి కంటే తనకే ఎక్కువ విషయపరిజ్ఞానముందని నిరూపించుకోవాలి. అన్నిటికంటే మించి జనం మధ్యనే ఉండాలి. ఇవన్నీ దత్తపుత్రుడిగా పేరు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ పక్షాన చెయ్యాలి. 

లేకపోతే ఆంధ్రపదేశులో ప్రతిపక్షం కేవలం పచ్చమీడియా కాగితాల్లోనూ, వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లలోనూ శాశ్వతంగా నిలిచిపోయే అవకాశముంది. వైకాపా ఏకఛత్రాధిపత్యం దశాబ్దాలపాటు కొనసాగేలా ఉంది. 

– హరగోపాల్ సూరపనేని