Advertisement

Advertisement


Home > Politics - Opinion

'మెన్‌టూ'లో మ‌గాళ్ల గోడు

'మెన్‌టూ'లో మ‌గాళ్ల గోడు

మ‌గ‌వాళ్లు మార్స్‌ గ్ర‌హం నుంచి ...ఆడవాళ్లు వీన‌స్ నుంచి.. ఇద్ద‌రూ వేర్వేరు గ్ర‌హాల నుంచి వ‌చ్చి భూమ్మీద క‌లిసి వుంటున్నారు. జాన్‌గ్రే అనే ర‌చ‌యిత సిద్ధాంతం ఇది. స్త్రీపురుషుల గురించి ఆయ‌న చాలా రాశారు కానీ, అవ‌న్నీ చ‌దివితే ఇంకా క‌న్ఫ్యూజ‌న్‌. పుస్త‌కం అమ్ముకుని ఆయ‌న మిలియ‌నీర్ అయ్యాడు కానీ, మ‌న‌కి ఒరిగిందేమీ లేదు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే "మెన్ టూ" సినిమా ట్రైల‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి. అమ్మాయిల‌తో అబ్బాయిలు ప‌డే బాధ‌లు, హింస ఇతివృత్తంతో తీసిన‌ట్టున్నారు. కామిక్‌గా వుంది. బ్ర‌హ్మాజి పెళ్లాన్ని తిట్టే తిట్టు కొంచెం క‌ఠినంగానే వుంది. భార్యాభ‌ర్త‌లు తిట్టుకోవ‌డం, కొట్టుకోవ‌డం కూడా మామూలే. గోడ‌ల‌కి క‌ళ్లుంటే చాలా సాక్ష్యాలు చెబుతాయి.

"దేవుడు సృష్టించిన విశ్వం కంటే మ‌గాడి అహంకారం పెద్ద‌ది" - ఇదో యూనివ‌ర్స‌ల్ కొటేష‌న్‌. శ‌తాబ్దాలుగా మ‌గాడి పెత్త‌న‌మే కొన‌సాగింది. శారీరకంగా, ఆర్థికంగా బ‌ల‌వంతుడు కావ‌డం వ‌ల్ల‌. మ‌గ‌వాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవ‌చ్చు , స్త్రీ మాత్రం భ‌ర్త పోతే అన్నీ వ‌దులుకుని వికారంగా మారిపోవాలి. స‌హ‌గ‌మ‌నం చేయాలి. ఏక‌ప‌క్ష నీతి శాస్త్రాల కింద అణ‌గారి పోయారు.

1960-70 నాటి సినిమాల్లో కూడా జ‌గ్గ‌య్య అమ్మాయిల‌తో తిరుగుతూ వుంటే సావిత్రి అత‌ని పాద పూజ చేస్తూ (కోడ‌లు దిద్దిన కాపురం) మార్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంది. న్యాయంగా అయితే అత‌న్ని కాలితో త‌న్నే పూజ చేయాలి. భార్య‌ల్ని ఒసేయ్‌, ఏమే అని పిల‌వ‌డం వెరీ కామ‌న్‌. పొర‌పాటున భ‌ర్త‌ని చేతిలో పెట్టుకుంటే ఆమె గ‌య్యాళి, సూర్య‌కాంతం. ఉమ్మ‌డి కుటుంబంలో ఇమ‌డ లేక కొంచెం స్పేస్ కోసం ప్ర‌య‌త్నిస్తే ఠ‌క్కులమారి. ఇప్పుడు కూడా సినిమాలు పెద్ద‌గా మారిందేమీ లేదు. హీరో డామినేటెడ్ ప్ర‌పంచ‌మే.

ప్రేమించుకోవాలంటే లెట‌ర్ రాయ‌డం, నేరుగా వెళ్లి చెప్ప‌డం ద‌శ దాటి ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌లో ల‌వ్ చేసుకునే కాలం వ‌చ్చింది. ఒక‌ర్నొక‌రు బాగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ప్పుడు ఎందుకు దారుణంగా విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు?  భార్యా బాధితుల సంఘాలు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకు?

శ‌తాబ్దాలుగా మ‌గ‌వాళ్లు వేధించారు కాబ‌ట్టి , ఇప్పుడు ప్ర‌తీకారం చాన్స్ ఆడవాళ్ల‌కు వ‌చ్చింద‌ని ఒక ర‌చ‌యిత అన్నాడు. అదేం కాదు. స్పేస్ స్వేచ్ఛ గురించి మాట్లాడితే వేధింపులు అవుతాయా? అని అమ్మాయిల వాద‌న‌.

మెన్ టూ సినిమా న‌గ‌రాల్లోని సాప్ట్‌వేర్ క‌థ‌. ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకోవ‌డంలోని స‌మ‌స్య‌. ఆడ‌వాళ్ల బాధితులు ఒక ప‌బ్‌లో క‌లుసుకునే కామెడీ. ప్రేమ అనే త‌లుపు త‌ట్టాలంటే అహం అనే చెప్పుల్ని వ‌దిలేసి రావాలి. ఇరు ప‌క్షాలు బూట్లు వేసుకుని వున్నారు. విప్పే టైమ్ లేదు.

మ‌"గాడ్", మ‌"గోడు", మృగాడు సంద‌ర్భాల్ని బ‌ట్టి చెప్పుకోవ‌చ్చు. ఎవ‌రి కోణంలో నుంచి వాళ్లు చూస్తారు. మెన్ టూ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్‌రెడ్డి ఏంటో సినిమా చూస్తేగానీ తెలియ‌దు. సున్నిత‌మైన కామెడీ గ్యారెంటీగా వుండేట్టు వుంది.

రిలేషన్‌షిప్‌ని అహం హ‌త్య చేస్తుంది. అయితే ఏది అహ‌మో, ఆత్మ‌గౌర‌వ‌మో గుర్తించ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. ప్ర‌పంచానికే వ‌రం, శాపం ఏమంటే ఫోన్‌. ఈ మ‌ధ్య కోడ‌లు పెట్టిన కేసులో ఒక పెద్దాయ‌న అన్యాయంగా పోలీస్ స్టేష‌న్లో కూచున్నాడు.

"పెళ్ల‌యిన త‌ర్వాత అమ్మాయి ప్ర‌తిరోజూ త‌న త‌ల్లితో గంట‌ల‌త‌ర‌బ‌డి ఫోన్‌లో మాట్లాడితే, ఆ దాంప‌త్యం ఎక్కువ రోజులు బ‌త‌క‌దు" - ఇది ఆయ‌న విశ్లేష‌ణ‌

ఎన్ని చ‌దివినా, చూసినా, విన్నా ఒక‌రికొక‌రు అర్థం కావ‌డం, అర్థం చేసుకోవ‌డం స్వీయ సాధ‌న‌. ఇది తెలియ‌ని వాళ్లు సాధువులు, స‌న్యాసులుగా మారిపోతారు. వేరే గ్ర‌హాల నుంచి వ‌చ్చినా ఇద్ద‌రూ ఇక్క‌డే వుండాలి. వేరే గ్ర‌హం లేదు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?