
తమిళ డైరెక్టర్ బాలాకి పిచ్చి. విచిత్రం ఏమంటే పిచ్చి వాళ్ల చేతిలోనే అత్యుత్తమ కళ ఆవిష్కారం అవుతుంది. బాలా ఎవరు? బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పుడే పోవాల్సిన నెల తక్కువ వాడు. పల్లెటూరి మొద్దు. అతనిది తేనీ జిల్లాలో చిన్నవూరు. అక్కడ మనవాడేం ఘనంగా లేడు. దొంగ, రౌడీ, గంజాయి బ్యాచ్. మరి డైరెక్టర్ ఎలా అయ్యాడు? అదే కదా కథ!
నాకు బాలా సినిమాలంటే ఇష్టం. అవన్ ఇవన్ (వాడే వీడు), పరదేశీ ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు. అతనికి పేరు తెచ్చిన సేతు నా దృష్టిలో సెకెండ్ గ్రేడ్. తెలుగులో రాజశేఖర్ శేషు అని తీసాడు. అది చూస్తే డయేరియా వచ్చి సెలైన్ పెట్టించుకోవాల్సిందే. క్లాసిక్స్ అంటే పితామగన్ అవన్ ఇవన్, పరదేశీ మాత్రమే. నాన్ కడవుల్, తారైతప్పటై బావుంటాయి కానీ, అంత హింస, బీభత్సాన్ని భరించలేం.
బాలాకి చదువు అబ్బలేదు. కాపీ కొట్టమని పుస్తకం ఇచ్చినా చేతకాలేదు. ఎందుకంటే కాపీ కొట్టడానికి కూడా కొంచెం తెలివి కావాలి. ఏ ప్రశ్నకి ఏది జవాబో తెలియాలి. ఎలాగో ఈడుస్తూ కాలేజీ వరకూ వచ్చాడు. ఒకసారి కాలేజీకి పెద్ద రచయిత జయకాంతన్ వచ్చాడు. బాలా ప్రపంచంలో చిన్న మార్పు.
కాలేజీలో ఆఖరి రోజు. అందరికీ గుడ్ బై. గంజాయి పీల్చాడు. ఈ గ్రహం నుంచి వేరే గ్రహాలకి ప్రయాణం చేసేంత. నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరిచాడు. చూడడానికి కూడా ఎవరూ రాలేదు. ఏడాదికి మించి బతకడనుకున్నారు. అసహ్యం, జుగుప్స ఇది ఒక బతుకేనా? మారిపోవాలి, గెలవాలి. గొంగళి పురుగు కలలోకి సీతాకోక చిలుక వచ్చింది.
సినిమా గురించి ఏమీ తెలియని వాడు మద్రాసు వచ్చాడు. జాతరలో పులిహోర అమ్మి వచ్చాడు. నకిలీ వాచ్‌లని తాకట్టు పెట్టి, మార్వాడీలని మోసం చేసి 8 వేలు తీసుకుని వచ్చాడు. నిద్రపోతే కలలు, లేస్తే ఆకలి. కలలకి ఖర్చు లేదు. ఆకలి డబ్బులు తినేస్తుంది. అయిపోయాయి.
చిన్న గదిలో ఇరుక్కుని , చిరిగిన చాప , తుండు బీడీలతో డిస్కషన్స్. సరే సినిమా కష్టాలు మామూలే. పేరు వచ్చిన డైరెక్టర్లంతా ఆత్మకథలో ఈ పాప్‌కార్న్ స్టోరీలే చెబుతారు. పస్తులు, అవమానాలతో పైకొచ్చామంటారు. అవన్నీ మేము కూడా పడతాం. పైకి రావడం ఎలాగో చెప్పండి. అది బ్రహ్మజ్ఞానం. ఎవడికి వాడే తెలుసుకోవాలి.
మరి, బాలా నుంచి ఏం నేర్చుకోవాలి? నేర్చుకోడానికి అతను ఏమైనా పెద్దబాలశిక్షా? సరిగ్గా చదివితే అందరి జీవితాలు పుస్తకాలే. బాలా మాదిరి ప్రతి రోజూ సినిమా కలలతో చాలా మంది సికింద్రాబాద్ స్టేషన్‌లో ఇమ్లిబన్ బస్టాండ్‌లో దిగుతున్నారు. ఫిల్మ్ నగర్ ఒక రౌండ్ వేసి, కృష్ణా నగర్‌లో సెటిల్ అవుతారు. రచయితలు, దర్శకులు, నటులు కావాలని వస్తారు. నూటికి 90 మంది ఏడాదిలోగా తిరిగి వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, వాళ్లని స్కూల్ బస్సు ఎక్కిస్తూ టీవీ ముందు సినిమాలు చూస్తూ, బాధ ఎక్కువైతే ఒక పెగ్గు మందు తాగి నిద్రపోతారు. మిగిలిన 10 మందిలో 9 మంది సినిమా ఆఫీసుల్లో బాయ్స్‌గా, ప్రొడక్షన్ అసిస్టెంట్లుగా, లైట్ బాయ్స్‌గా, జూనియర్ ఆర్టిస్టులుగా సెటిలై ఆ ప్రపంచాన్ని వదిలి రాలేక రంగుల కలలు మెల్లిగా బ్లాక్ అండ్ వైట్‌లోకి మారుతూ వుంటే నిశ్శబ్దంగా చూస్తూ వుంటారు. మరి మిగిలిన ఒక్కడు? వాడే కదా బాలా!
రచయితలు అవుదామని వచ్చే వాళ్లు మరీ కామెడీ. ఈ మధ్య ఒక కుర్రాడు కలిశాడు. ఒకట్రెండు సినిమాలకి రచనా సహకారం అందించాడు. నీ యాంబిషన్ ఏంటి అని అడిగితే "గత పాతికేళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నెంబర్ 1 డైలాగ్ రైటర్. ఆయన్ని దాటాలని లక్ష్యం" అన్నాడు.
"త్రివిక్రమ్ బాగా సాహిత్యం చదువుకున్నాడు కదా, మరి నువ్వేం చదివావ్?" "బుక్స్ చదవడం ఔట్‌డేటేడ్. సినిమాలు చూస్తే చాలు డైలాగ్ రైటింగ్ అర్థమవుతుంది. రోజూ త్రివిక్రమ్ సినిమాలు చూస్తున్నా" కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
త్రివిక్రమ్ సినిమాలు చూసి ఆయన్ని దాటేస్తాడట. తాబేలు డిప్పలాంటి అజ్ఞానం. అదిలాబాద్ దగ్గర ఒక పల్లె నుంచి ఆరేళ్ల క్రితం ఒకడు సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చాడు. చదువు టెన్త్. డబ్బులు నిల్. ఒక నటుడి ఇంట్లో పనివాడిగా చేరాడు. అవకాశాలు లేని ఫస్ట్రేషన్‌తో ఆ నటుడు తాగక ముందు రెండు, తాగిన తర్వాత నాలుగు దెబ్బలు కొట్టేవాడు. మనవాడు భయపడి ఒక ప్రొడక్షన్ ఆఫీస్‌లో బాయ్‌గా చేరాడు. అన్నం వండడం, టీ చేయడం నేర్చుకున్నాడు. డైరెక్షన్ రాలేదు. డైరెక్టర్ కావాలంటే ఇంగ్లీష్ రావాలని ఎవరో సీనియర్ ఆఫీస్ బాయ్ చెప్పాడు. గంటలో గడగడ మాట్లాడ్డం ఎలా? పుస్తకం తెచ్చుకున్నాడు. గంటల పంచాంగం పని చేయలేదు. ఆఫీస్‌కి అప్పుడప్పుడు నటులు వస్తే సెల్ఫీ తీసుకుని ఊళ్లోని ఫ్రెండ్స్‌కి వాట్సప్ పంపేవాడు. వాళ్లు మూర్ఛపోయి, లేచిన తర్వాత పొగిడేవాళ్లు. ఒకసారి అనుపమ పరమేశ్వరన్‌తో సెల్ఫీ దిగితే ఊళ్లో బ్యాచ్ వీడి అదృష్టానికి అసూయ పడి, బాధని దిగమింగడానికి చీప్ లిక్కర్ తాగారు (తెలంగాణ కాబట్టి సరిపోయింది. అదే ఆంధ్రాలో అయితే లిక్కర్‌లో కిక్కర్ వుండదు) మందు దిగిన తర్వాత హైదరాబాద్‌లో దిగిపోదామని బ్యాగ్ సర్దుకున్నారు. మనవాడు కంగారుతో ఫోన్ నంబర్ మార్చేసి తప్పించుకున్నాడు. వాళ్లు వస్తే వంటింటి రహస్యం బయటపడిపోతుంది.
ఇంకోడు విజయవాడ కుర్రోడు. తల్లి లెక్చరర్, తండ్రి రైల్వే టీసీ. డబ్బులున్నోడు. ఇంజనీరింగ్ చదివాడు. రాజమౌళి అవుదామని ఫిల్మ్ నగర్‌లో దిగాడు. ఒక తల మాసిన డైరెక్టర్ దగ్గర తగులుకున్నాడు. వాడికే ఏమీ రాదు. వీడికేం నేర్పుతాడు? కానీ మందు తాగడం, క్రికెట్ బెట్టింగ్ నేర్పించాడు. సినిమా స్టార్ట్ కాలేదు. వీడు దివాళా. హైదరాబాద్‌లో వుంటే కాళ్లు విరగ్గొట్టి, అపోలో ఆస్పత్రిలో చేర్పిస్తామని తల్లితండ్రి వాగ్దానం చేశారు. మాట తప్పరనే భయంతో విజయవాడ వెళ్లిపోయాడు. ఈ మధ్య ఫోన్ చేసి కథ మీద కూచున్నానని చెప్పాడు. అదేదో కుర్చీ, టేబుల్ అయినట్టు.
ఎన్ని కష్టాలైనా పడతామనుకుంటే వెళ్లి గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డ్‌గా చేరండి. రాత్రంతా దోమలు పాడుతాయి, కుడతాయి. పాట, కాటు... రెండూ తెలిసిన ఏకైక జీవి దోమ. దేవుడు దానికి ఆ శక్తినిచ్చి మన ప్లానెట్‌కి కానుకగా పంపాడు. కష్టాలు, పస్తుల వల్ల ఎవరూ డైరెక్టర్ కాలేదు. అది కావాలంటే లోపల భగభగమండేది ఏదో వుండాలి. శివుడిలా గొంతులో గరళం, నుదుట మూడో కన్ను వుండాలి. మిణుగురుల్ని చూసి నిప్పు రవ్వలు అనుకునే వాళ్లంతా తుక్కు కింద మిగిలిపోతారు.
మరి బాలా ఎలా డైరెక్టర్ అయ్యాడు? మద్రాస్ చేరుకుని, బాలుమహేంద్రతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా తన మూలాలు మరిచిపోలేదు. సొంత వూరు నారాయణదేవన్ పట్టి మట్టి, పెరియ కుళం గాలి, మధురై మనుషులు అందరినీ గుర్తు పెట్టుకున్నాడు. ముఖ్యంగా నగరం తనలోని పసివాన్ని, జులాయిని, మూర్ఖున్ని చంపేయకుండా కాపాడుకున్నాడు. అతని కథలన్నీ అవే. మనుషులంతా దిక్కూమొక్కూ లేని మామూలు వాళ్లు.
పితామగన్ (శివపుత్రుడు) లో ఇద్దరు పెద్ద హీరోలు. ఒకడు శవాల్ని కాల్చుతాడు. ఇంకోడు రోడ్డు పక్కన జూదం ఆడిస్తాడు. హీరోయిన్ గంజాయి అమ్ముతుంది. ఈ జీవితాల్ని అంతకు ముందు స్క్రీన్ మీదకి ఎవరైనా తెచ్చారా? అవన్ ఇవన్‌లో కూడా ఇద్దరు పెద్ద హీరోలు. ఒకడు చారల డ్రాయర్‌తో మెల్ల కన్నుతో వుంటాడు. ఇంకోడు డిప్ప కటింగ్‌తో మురికిగా వుంటాడు. ఇద్దరు హీరోలున్నా బాలా చెప్పింది వాళ్ల కథ కాదు. హైనెస్ (జిఎమ్. కుమార్) కథ. ఆయన బర్త్‌డేతో ప్రారంభమై, చావుతో ముగుస్తుంది. తమిళ్‌లో పెద్ద హీరో ఆర్య. ఒక సీన్‌లో ఆయన డైలాగ్ ఏంటో తెలుసా? "పియ్య తినమన్నా తింటాను. కానీ ఆ అమ్మాయిని మాత్రం వదులుకోను". సంస్కారవంతులకి ఇది అసభ్యమే. కానీ చిన్న గుడిసెలో మురికి కాలువ పక్కన జీవించే చదువులేని ఒక చిన్న దొంగకి తన ప్రేమని చెప్పుకోడానికి అంతకు మించిన భాష రాదు. మా కాలం అందాల నటి అంబిక ఈ సినిమాలో బీడీ తాగుతూ బూతులు మాట్లాడుతుంటే జడుసుకున్నాను.
పరదేశీ ఒక క్లాసిక్. బీభత్సం అక్కడక్కడ డోస్ పెరిగినా ఒకే. బాలా పరిశీలనా శక్తి ఎంత గొప్పదంటే కరువు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోయి, బావుల్లోని నీళ్లు తెల్లగా సుద్దలా మారిపోతాయి. పరదేశిలో బావిలో నీళ్లు తోడుతున్నప్పుడు అవి తెల్లగా, పాలలా వుంటాయి. చిన్న డిటైల్స్ కూడా మిస్ కాడు. మద్యం ప్రభావం ఎన్ని దశల్లో వుంటుందో ఒక పాటలో చూపిస్తాడు. ఒక ముసలోడు మొదటి ముంత కల్లు తాగుతున్నప్పుడు గంభీరంగా వుంటాడు. రెండో ముంతకి డ్యాన్స్ చేస్తాడు. మూడో ముంతకి ఒంటి మీద గోచి మాత్రమే వుంటుంది.
నాన్ కడవుల్ (నేనే దేవున్ని) భరించడం కష్టం. ఆర్ట్‌ని రియాల్టీ డామినెట్ చేయకూడదు. అయితే బాలా మార్క్ మిస్ కాలేదు. వరలక్ష్మి శరత్‌కుమార్ ఎంత గొప్ప నటో తారై తప్పటై చూస్తే తెలుస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆమె కళ్లలోని ఎక్స్‌ప్రెషన్‌కి ఆస్కార్ ఇవ్వొచ్చు (పారుర్ వాయుమ్ పాటలో). ఈ సినిమా ఆడకపోవడానికి భరించరానంత బీభత్సమే కారణం.
బాలా గొప్పతనం ఏమంటే సమాజంలోని దిక్కులేని వాళ్లని, తిరస్కృతుల్ని మన చుట్టూ వున్న , మనం గుర్తించని, గుర్తించడానికి ఇష్టపడని వాళ్లని సినిమాలో చూపించాడు. వాళ్ల ఆట, మాట, వేషం కళ్ల ముందు వుంచాడు. శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్లు, కాసిని డబ్బుల కోసం బార్‌లో పాట పాడే విద్వాంసులు, తాగుబోతులు, దొంగలు, చాకిరి చేయించుకుని కూలి ఎగ్గొట్టే వాళ్లు, అడుక్కునే వాళ్ల మీద వ్యాపారం చేసే నీచులు, వీళ్లందర్నీ చూపించాడు, కథలు చెప్పాడు. కన్నీటి రహస్యం తెలిసిన వాడు.
ఆయన ఒకప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు. మానేశాడు. జీవితంలో డ్రగ్స్ కంటే డేంజర్ డబ్బు, కీర్తి. అవి మన చుట్టూ గోడలు కడతాయి. కంతలు కూడా మిగల్చవు. తేని జిల్లా మట్టి పరిమళాన్ని చెన్నై దుమ్ము కమ్మేసినట్టుంది. ఈ మధ్య ఆయన తీసిన సినిమాల్లో మట్టి వాసన లేదు.
గురుకి వడాలి ఒక చిన్న వూరు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో వుంది. ఆ వూళ్లో సూపీ సంగీత విద్వాంసులు వడాలి బ్రదర్స్‌ది ఆ వూరు. అన్న పేరు పూర్ణచంద్. 83 ఏళ్లు . తమ్ముడు ప్యారేలాల్ (2018లో చనిపోయారు). తేనె పట్టులోంచి బొట్లుబొట్లుగా తేనె రాలినట్టు వుంటుంది వీళ్ల రాగం. పూర్ణచంద్ మల్లయోధుడు. ఒక పహిల్వాన్‌ని పాట వరించడం చాలా గొప్ప విషయం.
పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా పూర్ణచంద్ సైకిల్‌పైన్నే తిరిగేవాడు. "కారు కొనొచ్చు కదా ఉస్తాద్" అని గ్రామ ప్రజలు అడిగితే, సైకిల్ స్టాండ్ వేసి ఆయన ఏం చెప్పాడంటే... "కారు ఎక్కితే మీకు నాకు మధ్య ఇనుప గోడ పుడుతుంది. మీ పాట నాది. నా పాట మీది. మీ స్పర్శ లేనప్పుడు పాట చచ్చిపోతుంది. పాట లేనప్పుడు మీ ఉస్తాద్ బతికున్న శవం" అన్నాడు.
బాలా తీసిన అర్జున్‌రెడ్డి రీమేక్‌ని ఎత్తి డస్ట్‌బిన్‌లో వేసినప్పుడే అతను చచ్చిపోయాడు. ఆయన ఓడి గెలిచాడు. గెలిచి ఓడాడు. బలాన్ని మరిచిపోయి గాలిలో ఎగిరాడు. స్కూల్లో ఒకసారే ఎగ్జామ్ పెడతారు. లైఫ్‌లో ఒక పరీక్షని ప్రతిరోజూ రాసి సరిచేసుకోవచ్చు.
ఏదో ఒక రోజు బూడిద కుప్పలో నుంచి పరమశివుడిలా లేచి తాండవం చేస్తాడు. ఎందుకంటే వాడు బాలా. వాడికి మెంటల్.
(ప్రముఖ సినీ సమీక్షకులు సూర్యప్రకాశ్ జోశ్యుల ఎడిటర్‌గా వీడే బాలా పుస్తకం వచ్చింది. తమిళ్‌లో ఆర్.కన్నన్ రాశారు. శ్రీనివాస్ తెప్పల అనువాదం చేశారు. ప్రపంచ సినిమా మీద "హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా" అని మూడు భాగాల పుస్తకాల్ని కూడా సూర్యప్రకాశ్ రాశారు)
జీఆర్ మహర్షి