Advertisement

Advertisement


Home > Politics - Opinion

నవతరం రాజకీయాల నవీన నిర్వచనం మైండ్ గేమ్

నవతరం రాజకీయాల నవీన నిర్వచనం మైండ్ గేమ్

‘చిన చేపను పెద చేప.. చిన మాయను పెనుమాయ..’’ అని లీలామానుషవేషధారి మనకు మాయాబజార్ సినిమాలో తత్వం చెబుతాడు. మనం కొద్దిగా మార్చుకోవాలి. ‘చిన చేపను పెద చేప.. పెద చేపను చిన చేప.. అది స్వాహా.. ఇది స్వాహా..’ అని మార్చి పాడుకోవాలి. సరికొత్త తరం రాజకీయాల్లో కనిపిస్తున్న పోకడ ఇది. అంతా మాయ. చిన్న పార్టీలను, పెద్ద పార్టీలను చిన్న పార్టీలు ఏకంగా మింగేయడానికి, లేదా బురిడీ కొట్టించడానికి అనుసరిస్తున్న మాయ మార్గమే ‘మైండ్ గేమ్’!

ప్రత్యర్థులపై పైచేయిని సాధించడానికి, ప్రత్యర్థులు అయినా కాకపోయినా.. బరిలో మిగిలిన పార్టీలను మట్టికరిపించేయడానికి ఇదే సరికొత్త అడ్డదారి. మైండ్ గేమ్ ప్లే చేసే పార్టీలు కొన్నయితే.. ఇతరుల మైండ్ గేమ్ లో తమంతగా తాము ఎంట్రీ ఇచ్చి పతనం అయిపోయే వారు మరికొందరు. ఈ విలక్షణ రాజకీయాల తీరుతెన్నుల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘నవతరం రాజకీయాల నవీన నిర్వచనం.. మైండ్ గేమ్’!!

‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మ హత్యలే’ అనేది పాత నానుడి. నిజం చెప్పాలంటే.. హత్య- ఆత్మహత్య అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు ముఖాలు! రాజకీయాల్లో ఒక మరణం సంభవించిన తర్వాత, ఒక అంకం పరిసమాప్తం అయిన తరువాత.. అవనతం అయిన ఆ జీవితం ఒకరికి హత్య లాగా కనిపిస్తే, మరొకరికి ఆత్మహత్య లాగా కనిపిస్తుంది. ప్రధానంగా ‘మైండ్ గేమ్’ అనేది ఒక శాస్త్రీయమైన హత్యా విధానంగా వాడుకలోకి వచ్చిన తర్వాత.. కేవలం నాయకులను మాత్రమే కాదు.. ఏకంగా పార్టీలను కూడా మట్టు పెట్టేయడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది.

మైండ్ గేమ్ అనేది రాజకీయాల్లో సరికొత్తగా ప్రవేశించిన యుక్తి కాదు. కాకపోతే.. నవతరం రాజకీయాల్లో సరికొత్త పద్ధతుల్లో వాడబడుతోంది. ఇదివరకటి రోజుల్లో అయితే పార్టీని ధిక్కరించిన అసంతృప్తి నాయకుడిని బలహీన పరచడానికి, ప్రత్యర్థి పార్టీనుంచి తమ మీద అతిగా విరుచుకుపడే నాయకుడినిన సైలెంట్ గా మార్చేయడానికి ఇలాంటి మైండ్ గేమ్ అస్త్రాన్ని బయటకు తీసేవారు. ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు ట్రెండ్స్ మారిపోయాయి. ఈలోగా ఈ మైండ్ గేమ్ అనేది.. మామూలు అస్త్రంగా ఉన్నది కాస్తా బ్రహ్మాస్త్రంగా రూపొందింది. ఇప్పుడు ఆ ఆస్త్రాన్ని ఏకంగా పార్టీలకు ఠికానా లేకుండా చేసేయడానికే ప్రయోగిస్తున్నారు. 

తాజా విక్టిమ్ ‘షర్మిల- వైతెపా’!

వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల తనయ వైఎస్ షర్మిల.. తనను తాను తెలంగాణ రాష్ట్రానికి కోడలిగా ప్రకటించుకుని, ఆ రకంగా తనకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తును చూసుకోగల అధికారం ఉన్నదని సెలవిచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా ఠికానా లేకుండా పోయింది. చెప్పుకోడానికి నలుగురైదుగురు రిటైర్డు నాయకులు మిగిలిఉన్న తెలుగుదేశానికి కూడా లేని ధైర్యాన్ని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో తమ పార్టీ పోటీచేయబోతున్నదని ఆమె ఢంకా బజాయించి చెప్పారు. 

తాను పాలేరుతో పాటు మరోస్థానంలో కూడా పోటీచేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టుగా కూడా ఆమె సెలవిచ్చారు. తనతో పాటు తన భర్త, తల్లి కూడా పోటీచేయాలని ప్రజలు అభిలషిస్తున్నారని అన్నారు. అంటే వారి ఫ్యామిలీలో ముగ్గురూ కలిసి నాలుగు సీట్లలో పోటీచేయబోతున్నారన్నమాట. టికెట్లు కావాల్సిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని కూడా పిలుపు ఇచ్చారు. తీరా నామినేషన్ల తేదీలు మొదలయ్యేసరికి.. ఆ ముగ్గురూ కూడా రెండేసిస్థానాల్లో పోటీచేసినా ఆశ్చర్యం లేదు. ఆమె ఎంత ధీమాగా తన ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించినప్పటికీ ఆమెది కేవలం మేకపోతు గాంభీర్యం అని మాత్రమే ప్రజలు అనుకుంటున్నారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత.. ముమ్మరంగా చేపట్టిన పాదయాత్రలతో తెలంగాణలో షర్మిల ఒక కదలిక తీసుకురాగలిగారన్న మాట నిజం. కానీ.. కర్ణాటక ఎన్నికలు పూర్తయి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన డికె శివకుమార్ అక్కడి చక్రం తిప్పి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయిన తర్వాత.. సమీకరణాలు హఠాత్తుగా మారిపోయాయి. డికె ఆశ పెట్టారో.. షర్మిల తనంతగా వెళ్లి తానే ప్రతిపాదన పెట్టి ఆ ఉచ్చులో చిక్కుకున్నదో మొత్తానికి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, కాంగ్రెసులో విలీనం కాబోతున్నదనే పుకార్లు గుప్పుమన్నాయి.

షర్మిలకు దూకుడు, ధైర్యం, సాహసం తప్ప సరైన వ్యూహాత్మక అనుభవం లేదనడానికి తగిన పరిణామాలు అప్పుడే చోటు చేసుకున్నాయి. షర్మిల ఒక్కసారిగా తన సొంత పార్టీ ప్రస్థానాన్ని సుషుప్తావస్థలోకి నెట్టేశారు. అప్పటిదాకా చాలా వేగంగా పడిన ఆమె అడుగులు, హఠాత్తుగా ఆగిపోయాయి. ఎటూ విలీనం అవుతున్నాం కదా.. ఇంకా ఈ కష్టం పెట్టుకోవడం ఎందుకు.. అని నిమ్మళించినట్లుగా షర్మిల సైలెంట్ అయ్యారు.

ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలుసు. షర్మిల రెండు దఫాలుగా ఢిల్లీ వెళ్లి.. సోనియా, రాహుల్ లతో భేటీ అయి వచ్చారు. వారి నివాసంలో ఆమె ఆరాటాన్ని ప్రతిబింబించే వీడియోలు కూడా వచ్చాయి. కోమటిరెడ్డిని వెంటపెట్టుకుని హైదరాబాదు చేరుకుని.. విలీన చర్చలు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్పేశారు. తద్వారా.. అన్నాళ్లూ తన సొంత పార్టీలో అండగా ఉన్న కొందరు నేతలను దూరం చేసుకున్నారు. పైగా.. వారు అసలు తన పార్టీ నేతలే కాదంటూ చులకనగా కూడా మాట్లాడారు.

ఈలోగా షర్మిల కాంగ్రెసులోకి రాకుండా మోకాలడ్డగల సకల శక్తులు సమర్థంగా పనిచేశాయి. ఆమె పార్టీలో చేరవచ్చు గానీ తెలంగాణలో రాజకీయం చేయడానికి వీల్లేదని, ఏపీ వెళ్లి అక్కడి రాజకీయాలు చూసుకోవాలని ఇలా రకరకాల సన్నాయి నొక్కులు నొక్కారు.  కాంగ్రెస్ ఆమెతో ఎలాంటి మలిదశ మంతనాలు జరపకుండా, అలాగని ఆమె విలీనానికి పచ్చజెండా ఊపకుండా.. తమ అభ్యర్థుల ఎంపికను కూడా దాదాపుగా పూర్తిచేసింది. తీరా ఇప్పుడు.. షర్మిల తమ పార్టీ సొంతంగా పోటీచేస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే.. కాంగ్రెసు నో చెప్పాక గతిలేక ఇప్పుడు పోటీ గురించి మాట్లాడుతున్నదని ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ఈ పరిణామాలను మొత్తం మరో కోణంలోంచి గమనిస్తే.. షర్మిల పార్టీతో కాంగ్రెసు ఆడిన మైండ్ గేమ్ ఇది అని మనకు అనిపిస్తుంది. ఆమె పార్టీని సొంతంగా నడిపే స్థితిలో లేదని, విలీనంతో చేతులు దులుపుకుని తన సొంత సేఫ్టీ చూసుకుంటున్నదని ప్రజలు భావించే వాతావరణాన్ని కాంగ్రెసు సృష్టించింది. అదంతా అబద్ధం అంటూ షర్మిల ఇప్పుడు ఏం చెప్పినా కూడా బుకాయింపుగానే ఉంటుంది. షర్మిల పార్టీ స్థాపించిన ఈ కొద్ది కాలంలో.. ఆమె పార్టీ పట్ల ప్రజల్లో కించిత్ ఆదరణ ఏర్పడి ఉన్నా కూడా.. అది మొత్తం మంటగలిసిపోయేలా కాంగ్రెస్ ఆడిన మాస్టర్ మైండ్ గేమ్ ఇది. 

తద్వారా.. షర్మిల పోటీ వలన తెలంగాణలోని కాంగ్రెసు ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల, ప్రధానంగా తమకు గట్టి ఓటు బ్యాంకు అయిన రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోకుండా కాంగ్రెసు వ్యూహరచన చేసింది. షర్మిలకు నిన్నటిదాకా వేయదలచుకున్న వారు కూడా.. ఆమెకు నిలకడ లేదని, వేస్తే ఓటు వృథా అవుతుందని భావించే పరిస్థితిని కాంగ్రెసు కల్పించింది.

కాంగ్రెస్ కే స్ట్రోక్ ఇచ్చిన కేసీఆర్!

ఎవరితోనైనా మైండ్ గేమ్ ఆడి వారిని ఎందుకూ కొరగాకుండా చేసేయడంలో నూటయాభయ్యేళ్ల కాంగ్రెసు పార్టీ వయసుకు తగిన అనుభవాన్ని కలిగిఉంది. అలాంటి కొమ్ములు తిరిగిన కాంగ్రెసు పార్టీని కూడా.. తనదైన చాతుర్యంతో, తనదైన ముద్ర కలిగిన మైండ్ గేమ్ తో  బోల్తా కొట్టించిన ఘనాపాటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిరూపు సంతరించుకుంటున్న రోజుల్లో కేసీఆర్.. సోనియాగాంధీకి.. అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చారు. ఆవిడ కాదనలేని ఆఫర్ అది అనే చెప్పాలి. రాష్ట్రం ఇచ్చినట్లయితే గనుక.. తమ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని ఆయన ఊరించారు. తెలంగాణ లో బాగా బలంగా ఉన్న పార్టీ తమలో విలీనం అవుతున్నదంటే.. సోనియా కళ్లు మెరిశాయి. విభజన చేస్తే ఏపీలో తమ పతనం తప్పదని తెలుసు గానీ.. తెలంగాణలో తమ కాంగ్రెసు పార్టీ ఆచంద్రతారార్కమూ అధికారంలోనే వర్ధిల్లుతుందని ఆమె మురిసిపోయి ఉండవచ్చు. రాష్ట్రం ఇచ్చేశారు.

కేసీఆర్, తన అపారమైన కృతజ్ఞతను సోనియా పట్ల చాలా ఘనంగా వెల్లడించారు. తన సతీమణి కొడుకు కూతురు మనవలు, మనవరాళ్ల సహా యావత్ కుటుంబంతో కలిసి సోనియాగాంధీ ఇంటికి వెళ్లి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. తమపార్టీని కాంగ్రెసులో కలిపివేయబోతున్న సంగతిని మరోమారు ధ్రువీకరించారు. తన యావత్తు కుటుంబంతో సహా, సోనియాగాంధీతో గ్రూపు ఫోటోలు దిగారు. ఈ ముచ్చటలన్నీ గమనించి.. కేసీఆర్ తనను దేవతగా కొలుస్తున్నాడని, తనను కలిసి ఫోటో దిగడమే గర్వంగా భావిస్తున్నారని,  ఇక వారు విలీనం కావడం.. తమ పార్టీ అప్రతిహతంగా వెలిగిపోవడం మాత్రమే మిగిలిందని సోనియా భావించారు.

కానీ కేసీఆర్ ఎలాంటి మైండ్ గేమ్ ఆడారంటే సోనియా సహా సమస్త కాంగ్రెస్ శ్రేణులు ఆయన మాయలో పడ్డారు. బహుశా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేసీఆర్ కు ఏ మంత్రి పదవి ఇవ్వాలో కూడా ఆలొచించుకుని ఉండొచ్చు. సదరు సకుటుంబ ఫోటోసెషన్ హస్తిన యాత్ర తర్వాత.. తిరిగి హైదరాబాదు చేరగానే.. కేసీఆర్ తన నిజస్వరూపం బయటపెట్టారు. విలీనం ప్రసక్తే లేదని కాంగ్రెసును ఖంగు తినిపించారు. ఆయన మైండ్ గేమ్ ఉచ్చులో పడిన పాపానికి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని తామే ఏర్పాటుచేసినప్పటికీ కూడా.. రెండుదఫాల్లోనూ అధికారం దక్కించుకోలేని దుస్థితిలోకి కాంగ్రెసు జారుకుంది. మూడోసారైనా అధికారం దక్కడం అంత సులువు కాదనే భయంతో బరిలోకి దిగుతోంది.

ఏపీలో మునగనున్నది పవన్ కల్యాణే!

ఈ తరహా మైండ్ గేమ్ లతో నిండా మునగబోతున్న మరొక పార్టీ జనసేన. సినిమా హీరో పవన్ కల్యాణ్ కు రంకెలు వేయడం తప్ప రాజకీయం తెలియదు. అలాగని ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనే ఆయన చిత్తశుద్ధిని, కమిట్మెంటును కొంచెమైన అనుమానించలేం. ఆ చిత్తశుద్ధితో సత్సంకల్పంతో ఆయన గొప్ప సంఘసంస్కర్త కాగలరు. సంఘ సేవకుడు కాగలడు. కానీ రాజకీయ నాయకుడు కాలేడు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు ఆడుతున్న మైండ్ గేమ్ లోకి పవన్ కల్యాణ్ తానంత తానుగా వెళ్లి చిక్కుకున్నారు.

పవన్ కల్యాణ్ తో తమ పార్టీ వ్యవహారం వన్ సైడ్ లవ్ లాగా ఉన్నదని చంద్రబాబునాయుడు బహిరంగ వేదికపై సెలవిచ్చినప్పుడే ఈ మైండ్ గేమ్ కు బీజం పడింది. తాము కన్ను గీటుతున్నా.. పవన్ పడడం లేదని ఆ రకంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. నెమ్మదిగా ఆ లఫ్ ఎఫైర్ ను యాక్సెప్ట్ చేయడానికి.. ‘జగన్ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు’ అనే సాకును పవన్ కల్యాణ్ చాలా ప్రయత్నపూర్వకంగా సిద్ధం చేసుకున్నారు.

నిజం చెప్పాలంటే.. వర్తమాన నాయకుల్లో ఎవ్వరికీ లేనంత అపారమైన క్రేజ్, ఫాలోయింగ్ ప్రజల్లో ప్రధానంగా యూత్ లో కలిగిఉన్న పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడు కాకపోతే.. ఇంకొకసారి’ ప్రజలు తనను ఆశీర్వదించక తప్పదు అనే భావనతో.. ఓటములకు వెరవకుండా మళ్లీ ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే.. పార్టీ బలోపేతం అయ్యేది. కానీ, పవన్ కల్యాణ్ ఆ పనిచేయలేదు. అర్జంటుగా అధికారాన్ని పంచుకోవాలని ఆత్రంతో చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి సిద్ధపడిపోయారు. ఆయన అంచనాలు నిజమై.. వారు అధికారంలోకి వచ్చినా రావొచ్చు.. పవన్ కు మంత్రి పదవి దక్కవచ్చు. 

కానీ.. జనసేన అనే పార్టీ వారు గెలిచిన కొద్ది నియోజకవర్గాల్లో తప్ప.. మిగిలిన యావత్తు రాష్ట్రంలో ఒక్కసారిగా అంతర్ధానమైపోతుంది. ‘వన్ సైడ్ లవ్’ పేరుతో ఆడిన మైండ్ గేమ్ లోకి పవన్ కల్యాణ్ ను దించడం వెనుక చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ అదే. అంచెలంచెలుగా బలపడుతున్న జనసేన పార్టీ.. జగన్ వ్యతిరేక పార్టీలలో ఏదో ఒకనాటికి తమ తెలుగుదేశానికి ప్రాణాంతకంగా, థ్రెట్ గా మారుతుందని చంద్రబాబుకు అనుమానం. అందుకే ఆ పార్టీని మెజారిటీ రాష్ట్రంలో సమూలంగా నాశనం చేసేయడానికి అద్భుతమైన మైండ్ గేమ్ ఆడారు.

రాజకీయాల్లో ఇంకా అనేకానేక రకాల మైండ్ గేమ్ లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ‘చంద్రబాబునాయుడు అరెస్టు మరియు రిమాండ్ వెనుక భారతీయ జనతా పార్టీ లేదు’  అని తెలుగు ప్రజలను, ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం వారిని, ఆ వర్గానికి చెందిన తెలంగాణ లోని ప్రభావశీలమైన సెటిలర్లను నమ్మించడం కోసమే.. అమిత్ షా స్వయంగా  నారా లోకేష్ తో సమావేశం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అవసరం లేని కిషన్ రెడ్డిని కూడా ఆ బేటీలో కూర్చోబెట్టడం అంటే.. తెలంగాణ కమ్మ/ఆంధ్ర ఓట్లు తమకు వ్యతిరేకంగా మారకుండా చేసే ప్రయత్నం అన్నమాట.

అలాగే తెలంగాణలో మరో మైండ్ గేమ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ భారాస గనుక.. కేసీఆర్ ను బూచిగా చూపించి.. ఆయనతో పొత్తు బంధంలో ఉన్నారంటూ భారాసపై కాంగ్రెసు, కాంగ్రెసుపై భారాస పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుంటాయి. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. 

అయితే ఈ మైండ్ గేమ్ లు ఎంత విశృంఖలంగా అయినా కొనసాగుతూ ఉండవచ్చు గాక. కానీ.. ఇవి కలకాలం నిలిచేవి కాదు. స్థిరంగా పార్టీని కాపాడేవి కాదు. ఏదో కాలానుగుణంగా, ఆపద్ధర్మ కుయుక్తులుగా ఇవి పార్టీలకు మేలు చేయవచ్చు. కానీ.. కేవలం ఇలాంటి మైండ్ గేమ్ లనే నమ్ముకుని ప్రజాజీవితంలో ఉండాలనుకుంటే.. ప్రజలను కూడా వంచించే మైండ్ గేమ్ లు ఆడాలని అనుకుంటే.. ప్రజలు చాలా దారుణంగా తిప్పికొడతారని నాయకులు తెలుసుకోవాలి. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?