Advertisement

Advertisement


Home > Politics - Opinion

2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలా?

స‌రిగ్గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఫ‌లితాలు వైసీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చాయి. మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే, రెండింటిలో టీడీపీ పూర్తి ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా, ఒక చోట మాత్రం వైసీపీ అతి క‌ష్టం మీద స్వ‌ల్ప మెజార్టీతో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా ఇవే ఫ‌లితాలు రిపీట్ అవుతాయా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ ఫ‌లితాలు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి జోష్ ఇస్తుండ‌గా, అధికార ప‌క్షం వైసీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందని, 2024 ఎన్నికల్లోనూ ఇదే విధమైన ఫలితాలు వస్తాయని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా సాధారణ ఎన్నికలను అంచనా వేయడం సాధ్యంకాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ  ఎన్నికలనేవి ఒక తరహా ఆలోచనలు కలిగిన వ్యక్తుల అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల  అభిప్రాయాలకు ఈ ఎన్నిక‌లు సంకేతం కాదు. పట్టభద్రులైన వ్యక్తులకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వుంటుంది. వ్యవసాయ కూలీ చేసుకునే కూలీకి, ఆటో నడుపుకునే డ్రైవర్‌కి, భవన నిర్మాణ పనులు చేసేకునే కార్మికుడికి, ఓ రైతుకి....ఓటు హక్కు వుండదు. చదువుకున్న వ్యక్తుల అభిప్రాయం ఒకలా వుండొచ్చు. ఇంకొకరి అభిప్రాయం ఇంకోలా వుండొచ్చు.

ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే నిర్వహించాలంటే....పురుషులు, మహిళలను సమాన నిష్పత్తిలో ఎంచుకోవాలి. అదే విధంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చేతివృత్తుల వారు ఇలా అన్ని పనులు చేసేవారిని ఆయా నిష్పత్తుల్లో ఎంచుకోవాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, కులాలు, మతాలు....ఇలా ఎన్నో ప్రామాణికాలు, లెక్కలోకి తీసుకుని సర్వేకి శాంపిల్‌ ఎంపిక చేసుకుంటారు. అప్పుడే సమగ్రమైన అభిప్రాయం వెల్లడవుతుంది. అలా చేస్తేనే సర్వే ఫలితాల్లో కచ్చితత్వం వుంటుంది. వాస్తవానికి దగ్గరగా వుంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాకాదు....చదువుకున్న ఒక వర్గానికే ఓటు వేసే అవకాశం లభించింది. అందుకే ఈ అభిప్రాయమే అందరి అభిప్రాయం అయ్యే అవకాశంలేదు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారంతా అట్టడుగు వర్గాల ప్రజలు. అలాంటి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. అమ్మఒడి అందుకున్న నిరుపేద మహిళ ఓటు వేయలేదు. రైతు భరోసా అందుకున్న రైతన్నకు ఓటు లేదు. డ్రైవర్‌ కానుక అందుకున్న ఆటో డ్రైవర్‌కు ఓటు హక్కులేదు. ఒకటో తేదీనే ఖ‌చ్చితంగా పెన్షన్‌ అందుకుంటున్న అవ్వ తాతలకు ఓటు వేసే అవకాశం రాలేదు. జగనన్న చేదోడు అందుకున్న నిరుపేద మహిళ తన అభిప్రాయం చెప్పే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తుందని చెప్పడం సాధ్యంకాదు.

ఇక మరో అంశం కూడా పరిశీలించాలి. ఎమ్మెల్సీ ఓట్లు వేసిన వారిలో అత్యధికులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఈ వర్గంలో జగన్‌ ప్రభుత్వంపై మొదటి రోజు నుంచి ఒక అభిప్రాయం వుంది. తాము కడుతున్న పన్నుల ద్వారా వసూలవుతున్న డబ్బులను జగన్‌ మోహన్‌ రెడ్డి విచ్చలవిడిగా పంచేస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. దానికి తోడు ‘రాష్ట్రం అప్పుల పాలైపోతోంది’ అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూడా ఈ వర్గం ప్రజలు విశ్వసిస్తున్నారు. అందేకాదు అభివృద్ధి జరగడం లేదనే అభిప్రాయాన్ని కూడా ఏర్పరచుకున్నారు. సంక్షేమ పథకాలంటే గిట్టని వారు అధికంగా వున్నారు. అలాంటి వారి తీర్పును సాధారణ జనానికి ఆపాదించలేం.

ఏతావాతా చెప్పేదేమంటే...ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే 2024 సాధారణ ఎన్నికల్లోనూ పునరావృత‌మవుతాయన్న విశ్లేషణలు ఊహాగానాలతో చెబుతున్నవే తప్ప...వాస్తవిక, శాస్త్రీయ విశ్లేషణ కాదు. ఎమ్మెల్సీ ఫలితాలను చూసి అధికార వైసీపీ నీరసించి పోవాల్సిన పనిలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంకలు గుద్దుకోవాల్సిన సంబరమేమీ కాదు. అసలు తీర్పు ఏమిటో 2024 ఎన్నికల్లోనే తెలుస్తుంది.

-స్వేచ్ఛ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?