Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇప్పుడు అరిచే అర్హ‌త బీఆర్ఎస్ కు ఉందా?

ఇప్పుడు అరిచే అర్హ‌త బీఆర్ఎస్ కు ఉందా?

2014 త‌ర్వాత ఏపీ రాజ‌కీయంలో ఒక దారుణ‌మైన ప‌రిణామం అత్యంత స‌హజంగా మారింది. అదే.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌కు రాచ‌మార్గం ఏర్ప‌డ‌టం! అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయంలో పార్టీలు మార‌డం అనేది పెద్ద విష‌యం కాక‌పోయినా, ఎమ్మెల్యే-ఎంపీ హోదాల్లో ఉంటూ పార్టీలు మారే వారు కాస్తైనా సంకోచించే ప‌రిస్థితి ఉండేది! ఏ ఒక‌రిద్ద‌రో త‌మ పార్టీ తీరుపై వ్య‌తిరేక‌త‌తో ఉన్నా, తాము గెలిచిన పార్టీ పై విముఖ‌త ఉన్నా.. కామ్ గా ఉండే వారు కానీ, వైరి ప‌క్ష పార్టీ కండువాలు వేసుకుని తందానాలు ఆడే వారు కాదు!

అధినాయ‌క‌త్వ స్థాయిలో ఉండే వారికి కూడా.. ఈ విష‌యంలో కాస్త స్పృహ ఉండేది. గెలిచార‌ని చెప్పి ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌ను చేర్చుకుంటే, వారిపై ఓడిన త‌మ పార్టీ వారు ఇబ్బందికి గుర‌వుతారు అనే స్పృహ‌తో వ్య‌వ‌హ‌రించేవారు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ప‌లు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నిలిచిన భూమా కుటుంబం, ఎస్వీ కుటుంబం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీతో స‌న్నిహితంగా మెలిగేందుకు ప్ర‌య‌త్నించినా, వైఎస్ ఎంత వ‌ర‌కూ ఎంట‌ర్ టైన్ చేయాలో అంత వ‌ర‌కే చేశారు. అందుకు కార‌ణం కుటుంబంలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారు ఉండ‌టం, వారు చేరితే త‌మ పార్టీలో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల ప్రాంతంలో ప‌ని చేస్తున్న వారు ఇబ్బందుల‌కు గురవుతార‌ని ఎరిగి వైఎస్ అప్పుడు వారికి కాంగ్రెస్ కండువాలు క‌ప్ప‌డానికి ఆస‌క్తి కూడా చూప‌లేదు! ద‌శాబ్దం పాటు అప్ప‌టికి కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌తిప‌క్ష వాసం చేసిన వారికి వైఎస్ ఇచ్చిన విలువ అది!

తెలుగుదేశం పార్టీ నుంచి వ‌స్తామ‌నే వారికి వైఎస్ అప్పుడు ఎర్ర తివాచీలు ఎక్క‌డా ప‌ర‌చ‌లేదు! మ‌రీ ఆస‌క్తి చూపిన వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేసి ప్ర‌జారాజ్యం పార్టీ లో చేర‌మ‌నే స‌ల‌హాలు ఇచ్చారు కానీ, ఫిరాయింపులకు పెద్ద పీట‌లు వేసే కాలం కాద‌ది! అయితే వైఎస్ త‌ద‌నంత‌రం ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు తీవ్రం అయ్యాయి. అక్క‌డ‌కూ జ‌గ‌న్ త‌న వెంట నిలిచిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు! 2014 త‌ర్వాత మాత్రం క‌థ మారిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని పొంద‌ని క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు, ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు ఏ మాత్రం విలువ‌ల్లేని రాజ‌కీయం చేశారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ఎడాపెడా ఎమ్మెల్యేల‌ను చేర్చేసుకున్నారు! త‌ద్వారా ఆ పార్టీలు బ‌ల‌హీనం అయిపోతానే లెక్క‌లు వేశారు. విలీనాలు అంటూ ప్ర‌కట‌న‌లు చేశారు. అప్ప‌ట్లో కేసీఆర్ త‌న పార్టీలోకి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క‌మ్యూనిస్టు పార్టీలు ఒక ద‌శ‌లో కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ విభాగాల‌ను కూడా విలీనం చేసేసుకున్నారు! అంటే ఆ పార్టీల త‌ర‌ఫున గెలిచిన వారంద‌రినీ చేర్చేసుకుని ఏక‌పార్టీ స్వామ్యం అన్నారు!

ఇక చంద్ర‌బాబు అయితే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌నే కొనేశారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌నుకున్నారు, అయితే అలాంటి చేరిక‌ల‌తో చంద్ర‌బాబుకు మిగిలింది అవే 23 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ సీట్లు!

ఒక‌వేళ త‌మ పాల‌న తెగ న‌చ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు తెగ వ‌చ్చేస్తున్నార‌నుకుంటే వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాల్సింది. అలాంటిదేమీ చేయ‌కుండా అపోజిట్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారి చేత మంత్రులుగా కూడా ప్ర‌మాణ స్వీకారం చేయించారు! అలాంటి నిర్ల‌జ్జాపూరిత‌మైన రాజ‌కీయం చేశారు కేసీఆర్, చంద్ర‌బాబు!

అక్క‌డితే మొద‌లుపెడితే.. మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు, జ‌డ్పీ చైర్మ‌న్ పీఠాల, ఎంపీపీ ప‌ద‌వుల‌ను ఇలాంటి ప‌ద్ధ‌తిలోనే త‌మ వారికి ఇప్పించారు! ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వ‌చ్చిన అనేక మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు, జ‌డ్పీ పీఠాలు అలా అన్నీ తెలుగుదేశం పాల‌య్యాయి! ఎప్పుడో కాంగ్రెస్ హ‌యాంలో అనంత‌పురం జ‌డ్పీ చైర్మ‌న్ ఎన్నిక‌లో ఇద్ద‌రు జ‌డ్పీటీసీల ఫిరాయింపుతో ఫ‌లితం తిర‌గ‌బ‌డితే ప్ర‌జాస్వామ్యం హ‌త‌మ‌యిపోయింద‌ని గ‌గ్గోలు పెట్టిన ప‌చ్చ‌మీడియా, చంద్ర‌బాబు చేష్ట‌ల‌ను మాత్రం చ‌క్రం తిప్ప‌డం కింద గొప్ప‌గా చెప్పుకుంది! ప‌రిటాల హ‌యాంలో అదే అనంత‌పురం జిల్లాలో బెదిరించి కాంగ్రెస్ వాళ్ల చేత నామినేష‌న్ల‌ను విత్ డ్రా చేయించ‌డం కూడా గొప్ప రాజ‌కీయ‌వ్యూహంగా అదే ప‌చ్చ‌మీడియా చెప్పింది.

ఫిరాయింపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించినందుకు చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల చేత గ‌ట్టి తీర్పునే ఎదుర్కొన్నారు. 23 సీట్ల‌కు ప‌రిమితం అయ్యారు, మ‌ళ్లీ అధికారం కోసం అప‌సోపాలు ప‌డుతున్నారు. అదే అధికారం చేజార‌డంతో ఇప్పుడు కేసీఆర్ పార్టీకి కూడా త‌త్వం బోధ‌ప‌డుతోంది. ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీల నేత‌లు కాంగ్రెస్ కండువాలు వేసుకుంటున్నారు! ఇప్పుడు బీఆర్ఎస్ గ‌గ్గోలు పెడుతోంది. మ‌రి గ‌తంలో తాము చేసినప్పుడు ఇందులో నొప్పి అర్థం కాలేదా?

-హిమ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?