ఆశ.. వినాశన పథం

‘‘అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది.. సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు’’ అంటాడు రజనీకాంత్.. ‘నరసింహ’లో! ఈ మాట అక్షరసత్యం. ఇవాళ్టి రోజుల్లో ప్రతిరోజూ కొన్ని పదుల వందల డిజిటల్ మోసాలు, ఆన్…

‘‘అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది.. సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు’’ అంటాడు రజనీకాంత్.. ‘నరసింహ’లో! ఈ మాట అక్షరసత్యం. ఇవాళ్టి రోజుల్లో ప్రతిరోజూ కొన్ని పదుల వందల డిజిటల్ మోసాలు, ఆన్ లైన్ లో కోట్ల రూపాయలు కాజేయడాలు బయటకు వస్తున్నాయి. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ అతి, అనుచిత ఆశ కు వెళ్లకుండా నష్టపోయినవాడు ఒక్కడు కూడా లేడు! ఈ నేరాలు పెరుగుతున్నాయని పోలీసుల్ని అడిగితే ఏమవుతుంది.. ఒక్కో నేరగాడినీ పట్టుకోగలరు. కానీ మనలో అత్యాశ తగ్గితేనే.. నేరాలే ఆగుతాయి!

అనగనగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు. చక్కగా పిల్లలకు పాఠాలు బోధిస్తారు. లక్షల్లో జీతం, చాలా చాలా పెద్ద బ్యాంకు బ్యాలెన్సు, కుదురైన జీవితం. అనగనగా ఒకరోజు ఆయన ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘కంగ్రాట్స్ సర్’ అంటూ అభినందనలతో చక్కటి ఇంగ్లిషులో సంభాషణ మొదలైంది. ‘మీరు చాలా అదృష్టవంతులు.. మీ మొబైల్ నెంబరు మా కంపెనీ లాటరీలో తగిలింది.. మీకు 37 కోట్ల రూపాయలు వస్తాయి. ఇలా దేశం మొత్తం మీద నలుగురిని లాటరీ తీస్తే అదృష్టం మిమ్మల్ని వరించింది. అన్నాడు వర్సిటీ ప్రొఫెసరు అసలే తెలివైన వాడు. నమ్మలేదు. ఇవన్నీ నేను నమ్మను అని కొట్టి పారేశాడు. కావాలంటే మా కంపెనీ వెబ్ సైట్ చూడండి అన్నారు. లింక్ పంపుతాం అన్నారు. వాట్సప్ లో లింక్ వచ్పింది. నొక్కగానే ఓ సైట్ ఓపెన్ అయింది. లాటరీ విజేతల వివరాలన్నీ ఉన్నాయి. నమ్మాడు. బ్యాంకు అకౌంటు వివరాలు అడిగితే ఇచ్చాడు. పెద్దగా కాదు.. ఫీజుల నిమిత్తం ఓ పదివేలు కట్టాలన్నారు. ఆ మాత్రం లేకుండా ఉంటుందా– అనుకుని కట్టేశాడు. ఓటీపీ చెప్పండి.. ట్రాన్స్ ఫర్ అవుతుంది అన్నారు.. చెప్పాడు. నిమిషాల్లో బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయింది. ఆ తర్వాత ఆ ఫోను కూడా పనిచేయడం మానేసింది. 

అనగనగా ఒక బ్యాంకు ఉద్యోగి. బ్యాంకులో క్యాష్ డీలింగ్స్ చాలానే చేస్తుంటాడు. ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అయింది. అది కాస్తా ముదిరింది. పెళ్లయిన వాడే. కానీ ఆ అమ్మాయి ‘నువ్వే కావాలి’ అనేసరికి కాదనలేకపోయాడు. నిజమేనో మోసమో అనే అనుమానంతో వీడియో కాల్స్ లో కూడా మాట్లాడాడు. ఈలోగా ఆ అమ్మాయి తల్లికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ భారాన్ని ఈ ప్రియుడు పంచుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ ఎంతకూ పూర్తికావడంలేదు, ఆరోగ్యం కుదుటపడడం లేదు. మనోడి బ్యాంకు బాలెన్సు హరించుకుపోయి.. వేరేవాళ్ల అకౌంట్లలోంచి కూడా కాజేసి పంపేశాడు. ఈ దొంగతనం దొరికిపోయి పోలీసులు అడిగిన తర్వాత గానీ.. ప్రియురాలు ఒక మాయ అని అర్థం కాలేదు. 

ఇలా చెప్పుకుంటూ పోతే వందల కథలు. ప్రతి ఉదంతంలోనూ లక్షల రూపాయలు కోల్పోయే బాధితులు. కోట్లు కోల్పోయే వారు కూడా కొందరు. పరువు పోతుందని నోరు మూసుకుని కూర్చునే వారు ఎందరో..! అనేకానేక లక్షలు పోయిన తర్వాత పోలీసులను సంప్రదించి, వారిచే అక్షింతలు వేయించుకుని, ఎంత తిరిగొస్తే అంతరా బతుకుజీవుడా అనుకుంటూ గడిపేస్తుంటారు. 

ఆన్ లైన్, డిజిటల్ రూపాల్లో జరుగుతున్న ఇలాంటి మోసాల మోతాదును లెక్కవేస్తే.. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇన్నిన్ని ఘోరాలు ప్రపంచంలో జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? అనే సాధారణమైన ప్రశ్న ఒకటి మనకు ఎదురవుతుంది. కానీ.. రోగానికి మందు వేసే ముందు.. ఆ రోగాన్ని సరిగ్గా డయాగ్నయిజ్ చేయాలి! అసలు ఈ నేరాలన్నీ ఎందుకు? ఎలా జరుగుతున్నాయి? మూలాలను తెలుసుకుంటే కదా.. సరైన మందు ప్రయోగించడం. 

అలాంటి ప్రయత్నం చేసినప్పుడే సరిగ్గా మనకు నరసింహ సినిమాలోని డైలాగు గుర్తుకు వస్తుంది. ‘అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు’ అనే సందేశాన్ని స్మరించుకోవాలని అనిపిస్తుంది. ఇంకా వడపోసి చెప్పాలంటే.. మగ– ఆడ అనే వ్యత్యాసాలు పక్కన పెట్టేయాలి. కుల మత ప్రాంత వర్గ భేదాలు గానీ, ధనిక పేద లింగ తారతమ్యాలు గానీ లేకుండా.. అతిగా, అనుచితంగా ఆశపడడం సార్వజనీనంగా చేటు తెస్తుందని మనకు అర్థం అవుతుంది. 

పురాణ కాలం నుంచి పాఠం అదే..

‘ఏకం సత్ విప్రా బహుధా వదన్తి’ అని ఒక సూక్తి ఉంటుంది. సత్యం ఒక్కటే గానీ.. పండితులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతారు అని దాని భావం. అతిగా, అనుచితంగా ఆశపడవద్దు అనేది ఇవాళ మనం కొత్తగా నేర్చుకోవాల్సిన సంగతులు కానే కావు. పురాణకాలంనుంచి ఉన్నవే. యుగయుగాల కథలు మనకు నేర్పే సంగతులు అవే. రామాయణంలో రావణాసురుడు అనుచితంగా సీతకోసం ఆశ పడి చావును కోరితెచ్చుకున్నాడు. మహాభారతంలో దుర్యోధనుడు ఉన్న రాజ్యం మొత్తం తనకు ఒక్కడికే దక్కాలని అతిగా ఆశపడి తన పతనానికి తానే దారులు వేసుకున్నాడు. 

ఈ పురాణ కథలు మనలో తెలియనది ఎవ్వరికి? అయితే ఈ కథలను తెలుసుకోవడం వలన మనం నేర్చుకున్న, అలవరచుకున్న పాఠం ఏమిటి? ఏమీ లేదు. త్రేతాయుగం నుంచి ఇవాళ్టి వరకు వరకు ప్రతి ఒక్కరి పతనాన్ని నిర్దేశిస్తున్నది అతి ఆశే. సాంకేతికత విశ్వరూపం దాల్చిన నవతరంలో.. మోసాలు కూడా అదే తరహాలో విశ్వరూపంలోనే నర్తిస్తున్నాయి. అందుకే అతి ఆశకు నష్టపోయే వారు, నష్టపోయే మొత్తాలు కూడా పెరుగుతున్నాయి. 

నిన్నటి తరం అత్యాశ దెబ్బలు ఇంకోరకం..

కృషి బ్యాంకు వెంకటేశ్వరరావు వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. అది మూసేసిన నాటికి జాతీయ బ్యాంకుల్లో గానీ, ప్రెవేటు బ్యాంకుల్లో గానీ డిపాజిట్ల మీద ఇస్తున్న వడ్డీ ఎంత? కృషి బ్యాంకు ఆఫర్ చేసిన వడ్డీ ఎంత? ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రెవేటు రుణాలు కాకుండా, అందుకు దీటుగా బ్యాంకులో డిపాజిట్ల మీద అత్యధిక వడ్డీలు వస్తాయనే సరికి అందరూ అతిగా ఆశపడ్డారు. ఎక్కడెక్కడ దాచిన సొమ్ములన్నీ తీసుకువెళ్ల కృషి బ్యాంకులో పెట్టారు. వాడు ఒక్కసారిగా బోర్డు తిప్పేశాక గొల్లుమన్నారు. అన్ని వేల మంది డిపాజిటర్లు కృషి బ్యాంకు పెట్టుబడులతో నష్టపోయాక కూడా ఎవ్వరూ పాఠం నేర్చుకోలేదు. ఆ తర్వాత కూడా అలాంటి బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టి మునిగిపోయిన వారు అనేకులు ఉన్నారు. 

ఇన్ని వేల మందిలో ఒక్కరికైనా కాస్త భిన్నమైనా ఆలోచన రాలేదా? అంతంత నిపుణులైన, అనుభవజ్ఞులైన వారి సారథ్యంలో ఉండే జాతీయ బ్యాంకులకు చేతకాని విద్య కృషి బ్యాంకు కు మాత్రం ఎలా చేతనవుతుంది. అతను మాత్రం ఎలా ఇవ్వగలడు? ఇందులో ఏదైనా మతలబు ఉన్నదా? అనే శంక కలగలేదా? .. కలగదు! ‘అతి ఆశ’ ఒక పొరగా మన జ్ఞానేంద్రియాలను కమ్ముకుని ఉన్నప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. ఆశ మాత్రమే మనతో పనిచేయిస్తుంది. ఆ క్రమంలోనే వాళ్లందరూ నష్టపోతుంటారు. 

ఆ మోసాలే ఇప్పుడు డిజిటల్ రూపంలోకి..

‘‘మన మొబైల్ కు ఒక ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇంట్లోనే కూర్చుని రోజుకు పది వేల నుంచి ముప్ఫయివేల రూపాయల వరకు సంపాదించండి. ఇందుకు మీకు విద్యార్హతలు కూడా ఏం పెద్దగా అక్కర్లేదు. మీ వద్ద స్మార్ట్ ఫోనుంటే చాలు.’’  ఇలాంటి మెసేజీ మన ఇన్ బాక్స్ లోకి వచ్చేస్తే.. ఆకర్షణలో పడిపోకుండా ఎలా ఉంటాం. ఆ తర్వాత వాడు పంపిన లింక్ క్లిక్ చేస్తాం.. నెమ్మదిగా ఊబిలోకి దిగుతాం. సర్వనాశనం అవుతాం. వచ్చేదేం ఉండదు.. పోయేదే ఉంటుంది. 

లక్షలకు లక్షలు ఆర్జించే ప్రొఫెసరు గారు.. లాటరీ తగిలిందంటూ వచ్చిన మెయిల్ కు ఆశపడకపోతే ఏమవుతుంది? బ్యాంకు ఉద్యోగి గారు చక్కటి భార్యతో దాంపత్య జీవితం నడుస్తుండగా.. ఫేస్ బుక్ పరిచయం అయిన అమ్మాయితో శృంగారానికి ఆశపడి, కరిగి నీరైపోకుండా ఉంటే ఏమైఉంటుంది. అసలు ఈ నేరాలకు అవకాశమే లేదు. ఒకరి అత్యాశ, ఒకరి అనుచితమైన ఆశ వారి పతనాన్ని, చేటును నిర్దేశించాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఫలానా రంగంతో అని నిమిత్తం లేదు. అత్యాశతో మోసపోయే వారు మనకు ప్రతిచోటా కనిపిస్తుంటారు. 

లోన్ యాప్ లది ఇంకో ఖర్మ

రుణ యాప్ లు ప్రపంచాన్ని ఏ రకంగా కబళిస్తున్నాయనేది ఇంకో పెద్ద ఖర్మానుగతమైన వ్యవహారం. అయిదు పదివేల రుణాలు మాత్రమే ఇస్తారు. మీకు రుణం ఇస్తాం అనే మెసేజీ రాగానే.. అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా తీసేసుకుందాం.. నెమ్మదిగా తీర్చుకోవచ్చు.. అని అనాలోచితంగా ఎగబడే మూర్ఖులు ఈ ఊబిలో చిక్కుకుంటూ ఉంటారు. అయిదువేల రూపాయల రుణానికి లక్ష రూపాయలు చెల్లించిన వారు కూడా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. రుణ యాప్ ల వారి ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. లోను తీసుకున్న మహిళలు, తీర్చలేకపోయినప్పుడు, ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి వారి స్నేహితులకు బంధువులకు పంపడం లాంటివి సర్వసాధారణం. వీటికి భయపడి ఎన్ని వందల ఆత్మహత్యలు జరుగుతున్నాయో లెక్కలేదు. 

అయినా స్మార్ట్ ఫోను వాడే స్థాయి ఉన్నవారికి అయిుదువేల రూపాయల అర్జంట్, తప్పనిసరి అవసరం ఏముంటుంది? పైగా యాప్  వాడు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడే, అవసరం ముంచుకొస్తుందా? అనేది చాలా పెద్ద అనుమానం. నిజంగా అవసరం ముంచుకొస్తే.. అంత చిన్న మొత్తాలను స్నేహితుల వద్ద ఏర్పాటు చేసుకోలేరా? అనేది కూడా పెద్ద పాయింట్. ఇవన్నీ తీసుకునే వాళ్లకు కూడా తెలుసు. ఎవడో ఫోనులోకి వచ్చి అప్పు ఇస్తాననగానే ‘తీసుకుంటే ఏం పోతుంది’ అనుకునే అతి ఆశే వారిని ఊబిలోకి దించి, కాటికి చేరుస్తోంది. 

ప్రభుత్వాల్ని నిందించవద్దు..

ఇన్ని ఘోరాలు జరుగుతోంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.. అనే మాట సహజంగా వస్తుంటుంది. కానీ అది తప్పు. ఇవన్నీ వ్యవస్థీకృతంగా జరిగే నేరాలు కాదు. మనలోని అత్యాశ అనే బలహీనతను వాడుకుంటూ జరిగే మోసాలు. ఆశతో మనం శలభంలా ఎగిరి దీపం వైపు వెళుతోంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అప్పటికీ అనేకానేక నిబంధనలు తెస్తున్నారు. చట్టాలు సవరిస్తున్నారు. పోలీసులు చాలా కేసులను పరిష్కరిస్తున్నారు. డిజిటల్ మాయగాళ్ల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే మళ్లీ మళ్లీ లక్షలు, కోట్ల రూపాయల విలువైన కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి మోసం వెనుక సార్వజనీనంగా ఉన్న మూలం ఒక్కటే! మోసపోయిన వారి అత్యాశ!!

ఆశ మనిషికి చుక్కాని. 

ఆశ లేనిదే జీవితంలేదు. బతుకుమీద ఆశ లేకుండా గడపడానికి మనం సన్యాసులం కాదు. ఆశే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ కాస్త మోతాదు ఎక్కవైనా పరవాలేదు. మనల్ని పరుగులు పెట్టిస్తుంది. కానీ అదే ఆశ ‘ఇంతింతై వటుడింతయై..’ అన్నట్టుగా పెరిగిపోయిందంటే.. మనకు తగని వాటికోసం అర్రులు చాచేలా ప్రేరేపించిందంటే అదే మన పతనాన్ని శాసిస్తుంది. వేరే ఎవ్వరినీ నిందించే పని లేదు. అది పురాణకాలం నుంచి అమలవుతున్న ప్రకృతి శాసనం.

..ఎల్. విజయలక్ష్మి