“అనగనగా ఒక రోజు” సినిమాలో బ్రహ్మానందం మ్యానరిజం ఒకటుంటుంది. జేడీ చెప్పే జవాబులకి “నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా! ఒక మాదిరిగా కూడా కనపడడం లేదా?” అని అడుగుతుంటాడు. ఇప్పుడు సినిమావాళ్ల నిర్ణయాలు కొన్ని విని జనం కూడా అదే డయలాగ్ కొట్టేట్టున్నారు.
గత కొన్నాళ్లుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కి మధ్య ఓటీటీలకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నెల తిరక్కుండా ఓటీటీల్లోకి కొత్త సినిమాలొచ్చేస్తున్నాయి కాబట్టి జనం థియేటర్స్ కు రావట్లేదని ఎగ్జిబిటర్ల అభిప్రాయం. అందుకే థియేటర్లో విడుదలైన సినిమా కనీసం 10 వారాల వరకు ఓటీటీలోకి రాకూడదని ఎగ్జిబిటర్స్ కోరారు. దానికి బేరం జరిగి 8 వారాలకి ఒప్పందం కుదిరినట్టయింది.
ఇది విని ప్రేక్షకులు నొసట్లు చిట్లిస్తున్నారు. అసలు తమ గురించి ఎగ్జిబిటర్స్ ఏమనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే 8-10 వారాలు ఓటీటీలోకి రాదంటే జనం ఏ సినిమానైనా హాలుకొచ్చి చూసేస్తారానా?
మొన్నటికి మొన్న “రామారావు ఆన్ డ్యూటీ” వచ్చింది. మొదటి షో తోటే డిసాస్టరని తేలిపోయింది. 8 వారాలు కాదు కదా తర్వాత కనీసం ఎనిమిది షోలు కూడా నిండలేదు. ఒకవేళ ఇదే సినిమా 8 వారాల అగ్రీమెంటుతో తక్కువ రేటుకి ఓటీటీకి అమ్మినట్టైతే నిర్మాత ఆరిపోవాల్సిందే కదా!
ఇదిలా ఉంటే ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-2, విక్రం సినిమాలు ఓటీటీల్లోకి వచ్చినా కూడా జనం థియేటర్స్ కి వెళ్లి చూసిన దాఖలాలున్నాయి. దేశంలో అందరికీ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయనుకోవడం ప్రాధమికంగా తప్పు. ఒకవేళ ఉన్నా కూడా ప్రత్యేకానుభూతి ఏదో లభిస్తుందనుకుంటే చేతిలో ఉన్న మొబైల్లో చూడగలిగే వెసులుబాటున్నా సదరు ప్రేక్షకులు హాలుకెళ్లి చూస్తారు. ఇక్కడ ప్రస్తావించిన ఈ మూడు సినిమాలే ఇందుకు నిదర్శనం.
కనుక హాలుకి రప్పించే విధంగా సినిమాలెలా తీయాలో ఆలోచించాలి తప్ప ఈ 8 వరాలు, 10 వారాలు లెక్కలు కాదు. మారుతున్న కాలంలో ప్రేక్షకుడి అభిరుచిని అంచనా వేయడంలో ప్రస్తుత నిర్మాతలు, దర్శకులు, ఎగ్నిబిటర్స్ అందరూ వెనకబడుతున్నారు.
ఈ గోలంతా సినిమా హాలుని కాపాడాలని. అది కాకుండా ఓటీటీ కోసమే సినిమాలు కూడా తీయొచ్చు. ఉదాహరణకి మళయాళం సినిమాలు అదే కోవలో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ప్రేక్షకుడిని కట్టి పారేసే సినిమాలు తీస్తున్నారు. హిందీలో పాతాళ్ లోక్, ఫ్యామిలీ మ్యాన్ లాంటివి అలాగే కట్టి పారేసాయి. మరి తెలుగువాళ్లెందుకు తీయలేకపోతున్నారు? ఆ సరుకు లేదా? లేక హాల్లో జనం విజిల్సేస్తూ చూస్తేనే సినిమా అనుకునే సత్తెకాలపు ఆలోచనతోనా?
నిజంగానే యువదర్శకులు కూడా ఈ విషయంలో చాలా తప్పటడుగులు వేస్తున్నారు. ముందుగా సినిమాల్లోకి రాజకీయ అంశాలు తేవడం, పార్టీలకి చెందిన హీరోలని భజన చేస్తూ సినిమాలు తీయడం లాంటివి మానుకోవాలి. ఆ మధ్య ఒక కామెడీ సినిమాతో అనుకోని హిట్ కొట్టిన ఒక దర్శకుడు తాజాగా ఒక సినిమా తీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా మొదటి ఆట చూడడంతో సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రధాన భాగం ఆ పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యం. ఇది పవన్ అభిమానులకి నచ్చొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది వాళ్లు మాత్రమే కాదు. వివిధ పార్టీల సొషల్ మీడియా జనం కనీసం పదింతలుంటారు. వాళ్లంతా ట్రోల్ చేసి సినిమాని కిల్ చేస్తారు. పవన్ ఒక పార్టీ మనిషి. కాబట్టి దర్శకులు కాస్త ఆలోచించాలి.
అలాగే “సర్కారు వారి పాట” తీసుకుందాం. ఇందులో మహేష్ బాబు ఒక డయలాగులో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఏదో డయలాగ్ చెప్పాడని తెదేపా సోషల్ మీడియా సినిమా మీద బురద జల్లింది. విడుదలై మొదటి ఆట పూర్తి కాకుండానే “ఫ్లాప్, డిసాస్టర్” అంటూ ప్రచారం చేస్కున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనికి తోడు ఆ మహేష్ బాబు టికెట్ల రేట్స్ విషయంలో జగన్ ని కలిసొచ్చాడని వాళ్లకి మరొక అక్కసు. జగన్ ని కలిస్తే సినిమా ఫ్లాపే అనేది నిజం చెయ్యాలని వాళ్ల తాపత్రయం. ఇలా రాజకీయాంశాలు సినిమాతో ముడిపడితే అనవసరపు ట్రోలింగులు సినిమా చావుకి కారణమవుతాయి.
అలాగే సినిమా ఈవెంట్స్ లో నాని, పవన్ కల్యాణ్ మాదిరిగా కాంట్రవర్సీలు మాట్లాడకూడదు. అది కూడా వాళ్ల సినిమాలకి దెబ్బే. రాజకీయాలకి అతీతంగా సినిమా వాళ్లు ప్రవర్తిస్తే అందరికీ దగ్గరవుతారు. లెకపోతే కార్నరైపోయి ఎటూ కాకుండా పోతారు.
ఈ అంశాలన్నీ పక్కన పెడితే మరొక ముఖ్యమైన విషయం హీరోలు-దర్శకులు కలిసి నిర్మాతని డమ్మీని చెసేయడం.
నిర్మాతలు సినిమాని మ్యానేజర్స్ కి అప్పజెప్పి తాము ఆఫీసుల్లో కూర్చుంటారు. ఖర్చు విషయంలో సెట్లో కూర్చుని కర్రపెత్తనం చేసే పవర్ తీసుకోవడం మర్చిపోయారు. ఒకప్పటి రామానాయుడు వంటి వారు అలా ఉండే వారు కాదు. అందుకే అప్పట్లో సినిమా రంగం స్వర్ణయుగం అనిపించుకుంది. ఇప్పుడంతా దోపిడీయుగమే.
హీరోని ప్యాంపర్ చేసి దర్శకుడు నిర్మాత నెత్తి మీద గుదిబండ పెడుతున్నాడు. నిర్మాతలేమో హీరోని-దర్శకుడ్ని చూపించి బయ్యర్లకి ఎర వేసి..వస్తున్న బేరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఫైనాన్షియర్ దగ్గర అప్పు తెచ్చుకుని సినిమా చేస్తున్నాడు.
“నీకింత సీనొచ్చింది మా కాంబినేషన్ వల్లే కదా! కాబట్టి మేము చెప్పినట్టు విను” అనే ధోరణి పెరిగిపోయింది హీరోల్లోనూ, దర్శకుల్లోనూ!
ఇక్కడ నిర్మాత తీసుకునేది భయంకరమైన రిస్క్. సినిమా తేడా కొడితే ఆస్తులమ్మి అప్పులు తీర్చాలి. లేదా మరొక సినిమా తీసి దాని లాభం యావత్తూ ఆ ఫైనాన్షియర్స్ కి, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వాలి. అంతటి బరువుని మోస్తున్న నిర్మాత బాగు కొసం కాకుండా మా పేరు వల్లే సినిమా వ్యాపారం జరుగుతోంది కాబట్టి 80% పెట్టుబడి మేం పట్టుకుపోతాం, మిగతా 20% శాతంతో మీ చావు మీరు చావండి అని హీరోలంటే వాళ్లు హీరోలెందుకవుతారు. ఫక్తు దోపిడీదారులావుతారు.
ఇక్కడ క్యాపిటలిజం, సోషలిజం పాఠాలు చెప్పుకోనక్కర్లేదు. హీరోలు ఆశని కాస్త తగ్గించుకుంటే చాలు..నిర్మాత కూడా బాగుపడతాడు. పరిశ్రమని ఆనుకుని ఉన్న ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మరీ నేల నాకేయకుండా ఉంటారు.
ఈ విషయాలన్నీ చర్చించుకుని రోగానికి మందేసుకోవాలి కానీ..రోగం కడుపులో ఉంటే వేలికి కట్టు కట్టినట్టు ఓటీటీలని బూచిగా చూపిస్తే ఎలా?
ఓటీటీల్లో 10 నెలల తర్వాత సినిమా వచ్చినా పదేళ్ల తర్వాత వచ్చినా థియేటర్స్ కి ఆదాయం మాత్రం పెరగదు.
– శ్రీనివాసమూర్తి