పవన్ ఎన్నికల ‘సన్నాహక’ కసరత్తు!

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, దసరా నుంచి ఆయన ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. అది పాదయాత్ర కాదు. వాహన యాత్రే. కాన్వాయ్ కూడా సిద్ధం అయింది. అయితే, రోజువారీ ప్రయాణించే దూరం, కాన్వాయ్…

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, దసరా నుంచి ఆయన ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. అది పాదయాత్ర కాదు. వాహన యాత్రే. కాన్వాయ్ కూడా సిద్ధం అయింది. అయితే, రోజువారీ ప్రయాణించే దూరం, కాన్వాయ్ ఆగే ప్రదేశాలు మొదలైన వివరాలతో కూడిన షెడ్యూల్ ఇంకా సిద్ధమయినట్టు లేదు. అంటే మొదటి రోజు – ఫలానా ఊరి (ప్రాంతం ) నుంచి ఫలానా వరకు… ఇన్ని కిలో మీటర్లు. భోజన విరామం ఫలానా చోట. సాయంత్రం ఫలాన చోట ప్రజలతో మాట్లాడతారు. రాత్రికి ఫలానా చోట విశ్రాంతి. సాంస్కృతిక‌ కార్యక్రమాలు.

మరుసటి రోజు ఉదయమే ఫలాన వారి గృహంలో అల్పాహారం. జనసైనికులతో ఇష్టాగోష్టి. ఇన్ని గంటలకు యాత్ర ప్రారంభం. ఫలానా… ఫలానా ప్రాంతాల మీదుగా ఈ రోజు యాత్ర ఇన్ని కిలోమీటర్లు…..

ఇలా, అన్ని వివరాలతో కూడిన షెడ్యూల్ ఇంకా తయారైనట్టు లేదు. నిజానికి ఈ లాజిస్టిక్స్ విభాగానిది పేద్ద పని.

దసరాకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున, షెడ్యూల్ రూపకల్పనకు కూడా తగినంత సమయం ఉంది. అయితే, అప్పటి వరకు ఏ కార్యక్రమమూ లేకుండా -ఎకాయెకిని యాత్ర అంటే, అక్షరాభ్యాసం రోజునే ఆవకాయ పెట్టినట్టుగా ఉంటుందేమో అని జనసేన వ్యూహకర్తలు (ఒకవేళ ఉంటే గనుక ) భావించి ఉంటారు. దసరా నుంచి ప్రారంభమయ్యే 'టెస్ట్ మ్యాచ్' లకు ముందు 'నెట్ ప్రాక్టీస్, వార్మ్ అప్ మ్యాచ్' లు వంటి సన్నాహక చర్యలు ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావించి ఉంటారు.

అందులో భాగమే శరీరానికి చమట పట్టని 'జనవాణి ' కార్యక్రమం. ఐడియా బాగుంది. పేరు కూడా క్యాచీ గా ఉంది. వారాంతపు సెలవు రోజు అయిన ఆదివారం నాడు పవన్ కళ్యాణ్, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకోకుండా…. ప్రజల ఈతి బాధలపై వారి నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించాలని నిర్ణయించడం…. ఈ కార్యక్రమం హైలైట్.

కోట్లాది మంది అభిమానులకు తెర మీద తప్ప, భౌతికంగా ఒక పట్టాన దర్శనం లభించని పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితుల నుంచి తన స్వహస్తాలతో వినతి పత్రాలు స్వీకరిస్తారు అంటే…అదేమీ చిన్న, చితక విషయం కాదు. ఇప్పటికే, విజయవాడలో రెండు ఆదివారాలు అయ్యాయి. మూడో ఆదివారాన్ని భీమవరానికి కేటాయించారు.

అయితే, అధికార పక్షంలోని ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లేదా అధికార పార్టీ ప్రముఖులు చేపట్టాల్సిన కార్యక్రమం ఇది. ఆయా స్థాయిల్లో అధికార యంత్రాంగం వారి కనుసన్నల్లో మెలుగుతూ ఉంటుంది కనుక, ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనుకుంటే వారికి చిటికెలో పని.

కానీ, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఇతర నేతల్ని, వారి చర్యల్ని నిత్యం విమర్శిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ జనం సమస్యలను అధికారుల చేత ఎలా పరిష్కరింప చేయగలరు? ” నీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పుకోవాలి గానీ… ఆ పవన్ కళ్యాణ్‌కి చెప్పుకుంటావా..? ” అంటూ బాధితుల మీద అధికార అత్యుత్సాహ కార్యకర్తలు కయ్యానికి దిగితే వారిని పవన్ కళ్యాణ్ బృందం రక్షించ గలదా?

అంత పేద్ద పవన్ కళ్యాణ్ స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తారు అంటే శ్రీకాకుళం నుంచీ, చిత్తూరు వరకూ బాధితులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుంటూ రావడం సహజం. కనీసం, తమ అభిమాన తెరవేలుపు నైనా దగ్గర నుంచి, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చూసి పులకించి పోవచ్చు, సమస్య పరిష్కారమైనా, కాకపోయినా అనుకుంటూ…. డొల్లుకుంటూ అయినా వస్తారు. కానీ, ఆయన వారి నుంచి ఆప్యాయంగా, ప్రేమగా, అభిమానంగా తీసుకునే వినతిపత్రాలను అధికార యంత్రాంగం పట్టించుకోదు. మరి, ఈ జనవాణి వల్ల ఎవరికి ఉపయోగం?

ఒకవేళ, దసరా నుంచి ప్రారంభం కావలసి ఉన్న ఆయన యాత్రకు 'సన్నాహక'  కార్యకలాపాలు కావాలి అనుకుంటే బాధితులను తన వద్దకు పిలిపించుకోవడం కాకుండా తనే బాధితుల వద్దకు వెళ్లే కార్యక్రమం రూపొందించుకుని ఉండవలసింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు కార్యకర్తలో… అభిమానులో… శ్రేయోభిలాషులో… కావలసిన వారో గట్టిగానే ఉన్నారు. తమ తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. వాటి పరిష్కారం కోసం ఏం చేయాలనే విషయమై స్పష్టత కూడా ఉంటుంది.

ఆ వివరాలు సేకరించి, ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో ఆదివారం/ఆయనకు వీలైన వారం అక్కడకు వెళ్లి, ఆ సమస్యపై ధర్నానో, ఊరేగింపో, బాధితులతో సమావేశామో, అధికారులకు స్వయంగా వినతి పత్రం ఇవ్వడమో….,ఏది వీలైతే అది చేస్తే, ఆయనకు మైలేజ్, అధికార యంత్రాంగంలో ఎంతో కొంత స్పందన, ఆయన పట్ల జన సామాన్యంలో సదభిప్రాయం కలగడానికి అవకాశం ఉంటుంది.

ఈ జనవాణి కార్యక్రమం వల్ల, వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని- పవన్‌ను ఇప్పటికే 'వీకెండ్ పొలిటీషియ‌న్' అంటూ వ్యాఖ్యానించారు. ” జనవాణి” ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న తీరుకు ఈ కామెంట్ లక్క అతికినట్టు అతుకుతుంది. మామూలుగానే ఆయనకు పార్ట్ టైమ్ పాలిటీషియన్ అనే విశేషణాలు తగిలించి మాట్లాడుతుంటారు. ఈ “జనవాణి” కార్యక్రమంతో, ' వీకెండ్ పాలిటీసియన్' అనే విశేషణం కొత్తగా జత కలిసింది.

ఎవరేం వ్యాఖ్యానించినా, విమర్శించినా స్థిత ప్రజ్ఞుడిలా ముందుకు వెడుతున్న పవన్ కళ్యాణ్‌కు తన రాజకీయ ప్రయాణం పై స్పష్టమైన అవగాహన, అంచనా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఎన్ని అసెంబ్లీ /లోకసభ స్థానాలు సాధించాం అనేది పవన్ కళ్యాణ్‌కు ముఖ్యం కాదు. రాజకీయాలలో ఉన్నామా.. లేదా అనేది ఆయనకు ముఖ్యం. 

ఎన్నికలప్పుడు తెలుగుదేశంతో కలిస్తే లాభమా…? విడిగా పోటీ చేస్తే లాభమా? ఏది బాగా వర్క్ ఔట్ అవుతుంది అనే విషయంలో కూడా ఆయనకు స్పష్టత ఉంది. అయితే, తుది నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు. అప్పుడు అసలు సిసలు పవన్ కళ్యాణ్‌ను మనం చూస్తాం. అప్పటిదాకా ఈ 'కాలక్షేప బఠానీలు' తప్పక పోవచ్చు.

భోగాది వేంకట రాయుడు