Advertisement

Advertisement


Home > Politics - Opinion

పవన్ కళ్యాణ్ గారు! దయచేసి 50:50 డీల్ మాట్లాడండి

పవన్ కళ్యాణ్ గారు! దయచేసి 50:50 డీల్ మాట్లాడండి

అయ్యా పవన్ కళ్యాణ్ గారు!

ఇది మీకు రాస్తున్న బహిరంగ లేఖ. మనకిన్నాళ్లకి సువర్ణావకాశం వచ్చింది. దయచేసి జారవిడవద్దు. 

చంద్రబాబునాయుడుగారితో 50:50 నిష్పత్తిలో పొత్తు పెట్టుకోండి తప్ప బయట వినిపిస్తున్న వేరే అంకెలని నిజం చేయకండి. ఇప్పటికే ఆర్జీవీ ఒక చిరాకు పెట్టే ట్వీట్ పెట్టాడు. మీరు కాపుల్ని కమ్మవారికి అమ్మేసారని, కనుక కాపులకి శ్రధ్హాంజలి అని పెట్టాడు. ఆ అభిప్రాయానికి బలమైన తిరుగుదెబ్బ కొట్టాల్సింది మీరే. 

మనకి చంద్రబాబుగారి అవసరంకన్నా చంద్రబాబుగారికే మన అవసరం ఉందని మరిచిపోకండి. 

ఎన్నో దశాబ్దాలుగా మన సామాజికవర్గానికి రాజ్యాధికారం రావాలని కలలు కంటున్నాం. మన జనాభా ఎంతున్నా అధికారం మాత్రం సాధించలేకపోతున్నాం. ఇప్పటికి మీ రూపంలో మాకొక ఆశాకిరణం కనిపిస్తోంది. 

తెదేపాతో 50:50 డీల్ మాత్రమే పెట్టుకోండి. మీరు అడిగి గట్టిగా కూర్చుంటే అవతల కాదనేంత పరిస్థితి ఉండదు. అంతే కాదు ఎవరికి ఎమ్మెల్యేలు ఎక్కువొస్తే వారే సీయం అని కూడా చెప్పండి. అప్పుడు మన వర్గం వారు మరింత ఉత్సాహంగా మీరు నిలబెట్టిన క్యాండెట్లకి ఓట్లేయడం తధ్యం. 

అలాగే అవతలి వర్గం వారు కూడా ధృఢ నిశ్చయంతో ఉంటారు. దానివల్ల తెదేపా-జనసేన కూటమికి విజయం సుగమమౌతుంది. పైగా చంద్రబాబు సీయం అవ్వడం ఇష్టం లేని మన వర్గం వారు వైకాపాకో, బీజేపీకో, నోటాకో గుద్దేసే అవకాశముంది ప్రస్తుతానికి. అదే కనుక మీరు 50:50 ఆట ఆడి, ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లొస్తాయో వారే సీయం అంటే ఇక మన వర్గం ఓటు ఎటూ పోదు..కచ్చితంగా మనకే.

మీరు ఆలోచించాల్సింది మన గురించి..బాబు గారి గురించి కాదు. ఎందుకంటే ఆయన మన గురించి కన్నా ఆయన గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారనిపిస్తోంది. బయటకి వినిపిస్తున్న వార్త ప్రకారం ఒకవేళ మీరు సరైన అభ్యర్థుల్ని నిలబెట్టుకోలేకపోతే చంద్రబాబుగారే తమ అభ్యర్థుల్ని జనసేన తరపున నిలబెడతాను అన్నారట. అదే కనుక నిజమైతే మనకి అంతకంటే ఆత్మహత్య మరొకటి ఉండదు. మన పార్టీ అభ్యర్థుల్ని కూడా ఆయనే నిలబడితే ఇక మనమెందుకు? ఇది విని తల ఎత్తుకోలేకపోతున్నాం. దయచేసి ఈ పరిస్థితి దాపురించకుండా చూడండి. మన స్థానంలో ఆయన క్యాండెట్ ఉంటే మన జుట్టుని ఆయన చేతికి ఇచ్చినట్టే కదా. మన గురించి ఆలోచిస్తున్నట్టుగా, మనకి సాయం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఆయనకి అనుకూలంగా రాజకీయాన్ని తిప్పుకుంటున్నారనిపిస్తోంది. 

ఇప్పుడు లభించిన సువర్ణావకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకోకుండా బాబుగారు చెప్పినట్టల్లా తలాడిస్తే తేడా కొట్టే ప్రమాదాలున్నాయి. నిజంగా తేడా కొడితే ఇటు వైకాపా చేతుల్లోనూ, అటు బీజేపీ కాళ్లకింద మరొక పర్యాయం నలిగిపోవడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ప్రతీకారంతో రగిలిపోతుంటాయి ఎప్పుడూ. 

ఇటువంటి అవకాశం మళ్లీ రాదు. 50:50 కి ఒప్పుకోండి..ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకున్నవారే సీయం ఎవరో చెప్పండి..ఎవరి క్యాండెట్స్ వాళ్లే నిలబెట్టుకుందామని కూడా క్లారిటీ ఇవ్వండి...అంతే! అప్పుడే మేం కాలరెగరేయగలం. 

ఎస్కే. నాగేంద్ర కుమార్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?