ఇక పెద్దాయ‌న పెత్త‌నం తిరుప‌తిపై కూడా!

చిత్తూరు జిల్లా వైసీపీ నేత‌లు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని పెద్దాయ‌న‌గా పిలుచుకుంటుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోకి వెళ్లింది. అంత వ‌ర‌కూ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో…

చిత్తూరు జిల్లా వైసీపీ నేత‌లు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని పెద్దాయ‌న‌గా పిలుచుకుంటుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోకి వెళ్లింది. అంత వ‌ర‌కూ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఏది చెబితే అదే శాస‌నం. కొత్త జిల్లాల ఏర్పాటుతో చిత్తూరు అనేది చాలా చిన్న ప‌రిధి అయ్యింది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో నివాసం వుంటున్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఆ జిల్లాపై ప‌ట్టు కోల్పోవ‌డం న‌చ్చ‌లేద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

దీంతో ఆయ‌న మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. చిత్తూరుతో పాటు తిరుప‌తి జిల్లాపై అధికారిక హ‌క్కు పొందేందుకు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మండ‌లాల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. పుంగ‌నూరు నియోజ‌కవ‌ర్గంలోని రొంపిచెర్ల, పులిచెర్ల మండ‌లాల‌ను తిరుప‌తి జిల్లాలో క‌లిపేలా ఆయ‌న మంత్రాంగాన్ని న‌డిపిస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లతో కూడిన ఫైల్ చ‌క‌చ‌కా క‌దులుతోంది.

ప్ర‌స్తుతం ఆ ఫైల్ చిత్తూరు క‌లెక్ట‌రేట్ దాటుకుని రాష్ట్ర రెవెన్యూ కార్యాల‌యానికి చేరిన‌ట్టు స‌మాచారం. ఎటూ ఈ ప్ర‌భుత్వంలో ఒక ప‌ద్ధ‌తి అంటూ లేదు. తిరుప‌తి స‌మీపంలోని మండ‌లాల‌ను ఆ జిల్లాలో క‌ల‌పాల‌నే డిమాండ్లు ఉన్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కానీ పెద్దిరెడ్డి కోరుకున్న‌ది కావ‌డంతో చేయ‌డానికి ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ప్ర‌భుత్వంలో ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కుల ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌ని చెప్పేందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు చిత్తూరు పార్ల‌మెంట్ ప‌రిధిలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని తిరుప‌తి జిల్లాలో క‌ల‌ప‌డం దేనికి నిద‌ర్శ‌నం? త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని తిరుప‌తిలో క‌ల‌పాల‌ని మంత్రి రోజా వేడుకున్న‌ప్ప‌టికీ, కేవ‌లం రెండు మండ‌లాల‌తో స‌రిపెట్టారు. ఇప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మండ‌లాల‌ను తిరుప‌తి జిల్లాలో క‌ల‌పాల‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ట్టు ప‌ట్ట‌డం వెనుక ఆయ‌నకు స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ వ్యూహం వుంద‌నే టాక్ వినిపిస్తోంది.

వైసీపీ ప్ర‌భుత్వంలో పెద్దిరెడ్డి హ‌వా కొన‌సాగుతోంది. దీంతో ఆయ‌న తిరుప‌తిలో కూడా అధికారికంగా చెలాయించాల‌ని అనుకుంటున్నారు. ఆ మేర‌కు అన్నీ చ‌ట్ట‌ప్ర‌కార‌మే చేసుకెళుతున్నారు. పెద్దిరెడ్డి త‌మ జిల్లాలోకి వ‌స్తున్నాడ‌ని తెలిసిన త‌ర్వాత‌ తిరుప‌తి జిల్లాలోని మిగిలిన వైసీపీ నేత‌ల ప‌రిస్థితి ఏంటో! పాపం!

పీ.ఝాన్సీ