‘సనాతన ధర్మ’!

ఆర్షధర్మం పరిఢవిల్లుతూ ఉండవలసిన పవిత్ర భారతదేశంలో నిత్యం ఏదో ఒక మంట రగులుతూ ఉండవలసిందే. అది అగ్నిహోత్రమే కావొచ్చు.. కాష్ఠమే కావొచ్చు! ఏదిఏమైనా.. చితుకులు ఎగదోసి.. చలికాచుకునే దుర్మార్గులు ప్రతిచోటా ఉండనే ఉంటారు. ప్రస్తుతానికి…

ఆర్షధర్మం పరిఢవిల్లుతూ ఉండవలసిన పవిత్ర భారతదేశంలో నిత్యం ఏదో ఒక మంట రగులుతూ ఉండవలసిందే. అది అగ్నిహోత్రమే కావొచ్చు.. కాష్ఠమే కావొచ్చు! ఏదిఏమైనా.. చితుకులు ఎగదోసి.. చలికాచుకునే దుర్మార్గులు ప్రతిచోటా ఉండనే ఉంటారు. ప్రస్తుతానికి ఈ దేశంలో రగులుతున్న రావణకాష్టం ‘సనాతన ధర్మ’! దేశం రెండు పాయలుగా చీలిపోయి.. కాట్లాడుకుంటున్నది.

సనాతన ధర్మం అంటే ఏమిటి? అసలు ‘సనాతన’ అనే పదానికి అర్థమేమిటి? ఉదయనిధి స్టాలిన్- దేనిని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. దేని గురించి వివాదం నడుస్తోంది. మంటలు ఎగసెగసి పడుతున్నాయి? ఈ అంశాలను కొంచెం క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

సనాతన ధర్మం చుట్టూతా రేగుతున్న వివాదంలో.. ఉభయపక్షాలు కూడా వక్ర రాజకీయ లక్ష్యాలతోనే వర్తిల్లుతున్నాయి. వారి అసమంజస పోకడల ప్రస్తావనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సనాతన ధర్మ’!

దేశమంతా ఇప్పుడు ఒకటే రచ్చ జరుగుతోంది. దేశంలో మాత్రమే కాదు కదా.. అంతర్జాతీయంగా కూడా, భారత్ గురించి ఒకటే మాట్లాడుకుంటున్నారు. భారత్ లో జరగబోతున్న జీ20 సమావేశాలకు మించి, అంతర్జాతీయంగా మీడియా దృష్టిని ఈ అంశమే ఆకర్షిస్తోంది. అదే ‘సనాతన ధర్మ’! తమిళనాడులో రాజ్యమేలుతున్న తండ్రి కేబినెట్లో మంత్రి పదవి నిర్వహిస్తున్న ఈ నలభయ్యేళ్ల కుర్రాడు.. తన మాటలతో కొందరి దృష్టిని ఆకర్షించాడు. వారందరి ప్రతిస్పందనలు బీభత్స స్థాయికి వెళ్లడంతో.. వ్యవహారం మొత్తం కలిసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీ20 సదస్సు కోసం భారత్ ఏం చేస్తున్నది? ఎంత ఖర్చు పెడుతున్నది? అనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ప్రాధాన్య అంశాలు కాకుండా పోయాయి. ‘ఉదయనిధి తలకు ఒక హిందూ స్వామీజీ పది కోట్ల వెల కట్టాడు’ అనేదే హాట్ న్యూస్ గా సర్కులేట్ అవుతోంది.

అయితే ఏమిటీ సనాతన ధర్మం! ‘సనాతనం ధర్మం’ అనే పదం.. హిందూ మతానికి ఉండే మరొక నిర్వచనమా? అనే మీమాంస ఇప్పుడు అవసరం. రాజ్యాంగంలో ‘ఇండియా అంటే భారత్’ అని రాసినట్టుగా, ‘హిందూత్వ అంటే సనాతన ధర్మ’ అని ఎక్కడైనా ఉన్నదా? అలాంటి ఆధారాలు ఎవరైనా చూపగలరా? అనే విషయం కూడా మనం ఆలోచించాలి.

‘సనాతన’ అనే పదానికి ప్రాచీన అనే అర్థం వస్తుంది. హిందూ మతం ప్రాచీనమైనది అనే భావనతో భారతదేశంలోని హిందువులు సనాతన ధర్మం అంటే హిందూత్వమే అని అనుకుంటే తప్పులేదు. ఎన్ని వేల సంవత్సరాలు ముందు పుట్టినది ప్రాచీనం అనిపించుకుంటుందనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రెండు వేల సంవత్సరాలు కూడా ప్రాచీనమే అనుకుంటే క్రిస్టియానిటీ కూడా సనాతన ధర్మమే. మూడు నాలుగు వేల సంవత్సరాలు మాత్రమే ‘ప్రాచీనం’ అనుకునే వారికి ఇస్లాం కూడా ప్రాచీన ధర్మమే. కాబట్టి ఈ ‘సనాతన’ అనే పదానికి వ్యక్తుల బుద్ధిని బట్టి, అభిప్రాయాలను బట్టి అర్థం మారుతూ ఉంటుంది. 

మనువు చెబితే అది శిలాశాసనమా?

మనుస్మృతిని రాసిన మనువు ఒక జ్ఞాని. జీవితగమనానికి సంబంధించి ఆయన అనేక అంశాలను తన మనుస్మృతిలో చర్చించారు. కుల వ్యవస్థ కూడా అందులో ఒకటి. ఆనాటి సామాజిక పరిస్థితులకు కుల వ్యవస్థ ఒక అవసరంగా, సబబైనదిగా ఉండినదో లేదో మనకు తెలియదు. కానీ కాలగమనంలో దానికి కాలం చెల్లింది. వృత్తులు ప్రధానంగా కుల వ్యవస్థ ఏర్పడింది. ఆ కులాల పుట్టుక గురించి తర్వాత వచ్చిన అభివ్యక్తీకరణలు వాటిలో మంచి చెడుల సంగతి ఇప్పుడు ప్రస్తావనార్హం కాదు. కాల గతిలో కులాలకు కాలం చెల్లింది వాటిని నిర్మూలించాలా? అవసరం లేదా? ఈ ఒక్క అంశానికే ఎవరైనా సమాధానం చెప్పగలగాలి.

మను స్మృతిని రాసిన నాటికి మనువు ఒక మేధావి, దార్శనికుడు జ్ఞాని అనుకోవచ్చు. అంతమాత్రాన ఆయన రాసిన ప్రతి చిన్న విషయం శిలాశాసనం అవుతుందా? ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా సరే, ఏ ఒక్క విషయంలోనూ కించిత్తు మార్పు అవసరం పడకుండా ఉంటుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మనువు రాసిన ప్రతి వాక్యం శిలాశాసనంగా పరిగణించాల్సిందేనా అని మనం సమీక్షించుకోవాలి. కేవలం 75 సంవత్సరాల కిందట  భారత దేశంలోని అత్యుత్తమమైన అనేకమంది మేధావులు కలిసి అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగం లోనే కాల దోషం పట్టిపోయిన అనేక అంశాలను మనం పార్లమెంట్ ద్వారా సమీక్షించి సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాంటప్పుడు.. కొన్ని వేల సంవత్సరాల కిందట మనువు రాసిన మను విషయంలో మార్పులు, దిద్దివేతలు, కొట్టివేతలు అవసరం లేదా అనేది చర్చించాలి!

కులాలు వృత్తులు ఆధారంగానే ఏర్పడ్డాయని (మను స్మృతిని సమర్థించే, ఆదరించే) ప్రతి ఒక్కరూ అంటారు. ఇప్పుడు అదే అలవాటు ఉన్నదా? అగ్ర కులాలకు చెందిన వారు క్షవరం చేసే చెయిన్ దుకాణాలను నడుపుతున్నారు. దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసే లాండ్రీ దుకాణాల చెయిన్ లను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా తమదైన వ్యాపార ముద్రను కలిగి ఉండే సంస్థలు.. ఊరూరా చెప్పుల దుకాణాలు, కిరాణాకొట్లు నడుపుతుంటాయి. వీరిలో మంగలి, చాకలి, మాదిగ, వైశ్య కులాల వారు ఎవరు? కాబట్టి వృత్తుల పరంగా కులాలు అనే గీతలు ఎప్పుడో చెరగిపోయాయి!

ఇప్పుడంతా ప్రపంచంలో ఉండేది రెండే కులాలు. ధనిక- పేద! ఎవరు ఏ పనిచేసినా ఉండేది ఒకటే ప్రయోజనం- లాభం! ధనికులందరూ ఏ వ్యాపారంలో లాభం వస్తే ఆ వ్యాపారం చేస్తుంటారు.. సనాతనంగా ఆ పని ఏ కులాలకు చెందిన వృత్తి అనేది పట్టించుకోరు. అందులో తమకు లాభం దక్కుతుందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. పేదలందరూ ఏ పనిలో తమకు తగిన కూలి గిట్టుబాటు అవుతుందో ఆ పనిని ఎంచుకుంటారు? తమ నైపుణ్యాలు, గిట్టుబాటు కూలిని బట్టి వారి పనులు మారుతుంటాయి. ఆ పనులు- ఏయే కులాలకు చెందినవో వారు పట్టించుకోరు.

నిజం చెప్పాలంటే మనువు నిర్వచించిన కులాల హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఇప్పుడు ఆధునిక తారతమ్యాల సమాజమే నడుస్తోంది. సాధారణంగా.. ధనికులు పేదలను దూరం పెడతారు. పేదలు ధనికులకు దూరంగా మెలగుతుంటారు!

ఇప్పుడు కులాలు అనేవి కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే అవసరం. కులాల వారీగా వారికి పథకాలు ప్రకటించి.. కులాల వారీగా సమాజాన్ని చీల్చి వారిని తమకు పదిలమైన ఓటు బ్యాంకులుగా మార్చుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు మాత్రమే చేస్తుంటాయి. కులాల నిర్మూలన అనే మాటను వ్యతిరేకించే వారు.. ఈ కుట్రపూరిత రాజకీయ నాయకులే!

ఉదయనిధి వివాదం ఏంటి?

సనాతన ధర్మంలోని కుల మతాల తారతమ్యాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని, వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సనాతన ధర్మం (అందులోని కులవివక్ష) సమాజానికి డెంగ్యూ, కరోనా వైరస్ లాగా పట్టుకున్నదని, దాన్ని నిర్మూలించాలని అన్నారు.

ఉదయనిధి.. సనాతన ధర్మాన్నే నిర్మూలించాలని అన్నట్టుగా హిందూవాదులు అందరూ ఆగ్రహించారు. ఆయన మీద నిప్పులు కురిపించారు. పదవినుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. ఆయన తలకు వెల కట్టారు. ఒక స్వామీజీ.. ఉదయనిధి తల తెచ్చిన వారికి పదికోట్లు ఇస్తానని ప్రకటించారు! దానికి ప్రతిస్పందనగా.. పదికోట్లు ఎందుకు పదిరూపాయలు పెట్టి ఒక దువ్వెన కొని ఇస్తే.. తాను తలదువ్వుకుంటానని ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. చాలా చాలా జరుగుతున్నాయి.

అయితే తొలినాటి ప్రసంగంలో ఉదయనిధి చెప్పిన మాటలను ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకుంటే వివాదమే. కానీ.. రెండోరోజు ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. తాను సనాతన ధర్మం అనే మాట ద్వారా హిందూత్వాన్ని నిర్మూలించాలని అనలేదని, ఆ మతంలోని కులవివక్షను మాత్రమే నిర్మూలించాలని అన్నానని చెప్పారు. ఇలాంటి కుల వివక్ష ఇతర మతాల్లో కూడా ఉన్నదని.. వాటన్నింటినీ కూడా నిర్మూలించాలని పిలుపు ఇచ్చారు. ఈ స్పష్టతతో సాధారణంగా వివాదం సద్దుమణగాలి. కానీ.. లోతులకు వెళ్లే ఉద్దేశం ఉండని, వాస్తవాలు తెలియని వారందరూ కూడా వక్రలక్ష్యాలను పెట్టుకుని ఈ వివాదాన్ని సాగదీస్తున్నారు. 

అంబేద్కర్ చెప్పినదే ఉదయనిధి చెప్పాడు!

ఈ దేశం యావత్తు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను మహనీయుడిగా పూజిస్తుంది. రాజ్యాంగ ప్రదాతగా ఆరాధిస్తుంది. సూటిగా చెప్పాలంటే, అలాంటి అంబేద్కర్ చెప్పిన మాటనే ఇవాళ ఉదయనిధి స్టాలిన్ కూడా చెప్పాడు. 

అంబేద్కర్ అప్పట్లో హిందూ సమాజంలో కులవ్యవస్థ యొక్క దుర్మార్గపు పరిణామాలపై అంబేద్కర్ ఒక పుస్తకం రాశారు. ‘కులాలను నిర్మూలించాలి’ (Annihilation of Caste) పేరుతో ఆ పుస్తకాన్ని ఆయన 1936లో ప్రచురించారు. కులాలను నిర్మూలించాలనేదే అంబేద్కర్ యొక్క అసలు లక్ష్యం. ఆనాటి అంబేద్కర్ మాటలకు, ఇవాళ ఉదయనిధి స్టాలిన్ చెప్పిన మాటలకు తేడా ఏముంది. ఇప్పుడు ఆందోళన చేస్తున్న కుత్సిత బుద్ధుల వారిని గమనిస్తే.. ఈ కాలంలో అంబేద్కర్ వచ్చి ఆ మాట చెప్పినా కూడా ఆయన దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారేమో అనిపిస్తోంది. 

ఆందోళనల లక్ష్యం వేరు!

ఉదయనిధి స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత.. వివాదం చల్లారి ఉంటే బాగుండేది. కానీ.. మతవాదులు పెట్రేగిపోయారు. వారి ప్రయోజనాలు వేరు. ఉదయనిధి మాటలను విమర్శించడం దేశవ్యాప్త వివాదంగా మార్చడం ద్వారా.. ఇండియా కూటమిని హిందూ వ్యతిరేక కూటమిగా ప్రొజెక్టు చేయాలనే ఉద్దేశంతో వారు ఇలాంటి స్కెచ్ వేశారు. 

ఉదయనిధి మాటలను తొలుత సమర్థించిన ఇండియా కూటమి సభ్య పార్టీలు కూడా.. తర్వాత్తర్వాత.. సైలెంట్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే డీఎంకే ఈ విషయంలో ఒంటరి అయింది. అయితే మతవాదుల వెర్రి ఆందోళనల ఫలితంగా.. డీఎంకే నాయకులు ఇంకా రెచ్చిపోవడం ప్రారంభించారు. ‘నిజమే. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే’ అంటూ రాజా వంటి నాయకులు అతిగా స్పందించడమే అందుకు సంకేతం. 

అసలు ఉదయనిధి చిత్తశుద్ధి ఎంత?

కులాల విషయంలో అసలు ఉదయనిధి స్టాలిన్ చిత్తశుద్ధి ఎంత? అందంగా ఉన్నాయి కదాని.. ఏదో కొన్ని నినాదాలను మాటలను సమాజంలోకి వదిలేసి.. దేశం రావణకాష్టంలా రగులుతోంటే.. చలికాచుకోవడం మాత్రమే కాదు కదా. కుల నిర్మూలన పట్ల ఆయనకున్న శ్రద్ధ ఏపాటిది? ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఆ రాష్ట్రంలో కుల నిర్మూలనకోసం తీసుకుంటున్న చర్యలు ఎలాంటివి.. అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది.

దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తమిళనాడులో 69 శాతం వరకు కులపరమైన రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగం అనుమతించిన కులరిజర్వేషన్లు 50 శాతానికి మించి లేవు. కానీ.. తమిళనాడులో మాత్రం 69 శాతం కుల రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ ద్వారా.. ఆ రిజర్వేషన్లను తొలగించడం సీఎం స్టాలిన్ చేతిలో లేని పని కాబట్టి.. తమ రాష్ట్రంలో అదనంగా ఉన్న యావత్తు కులరిజర్వేషన్లను రద్దు చేసే దమ్ము అక్కడి డిఎంకే ప్రభుత్వానికి ఉందా? తద్వారా రాగల ఆ 20 శాతం రిజర్వేషన్లను కేవలం పేదలకు మాత్రమే, ఏకులం వారైనా సరే, వర్తించేలా చేయగల ధైర్యం ఆ ప్రభుత్వానికి ఉందా? అనేది ఉదయనిధి చెప్పాలి.

ఒక వివాదం రేకెత్తించడానికి రాళ్లు విసిరేసి ఊరుకోవడం కాదు. తాను ప్రవచించిన మాటలను ఆచరించడానికి తాను చేయగల పని ఏమిటో కూడా ఉదయనిధి ఆలోచించాలి. తమిళనాడులో కులపరమైన రిజర్వేషన్లతో.. కులాలకు అగ్రప్రాధాన్యం ఇస్తూ.. కులాలను నిర్మూలించాలనే ఉబుసుపోని మాటలు చెప్పడం ఈ యువనేతకు అవసరమా? 

‘సనాతన ధర్మ’ అనే పదం చుట్టూ రేగుతున్న వివాదానికి సంబంధించి.. ఉభయుల్లోనూ సత్యసంధత, నిబద్ధత, సచ్ఛీలత, చిత్తశుద్ధి లేవు. ఇరుపక్షాలూ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని లేవనెత్తినట్టుగా, ఈ మంటలు చల్లారకుండా ఎగదోస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయనాయకుల వక్రబుద్ధులు మారనంత వరకు ఇలాంటి కుయుక్తులు ఆగవు. కులాలను ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే. కానీ.. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే వర్ధిల్లే ధూర్తలోకంలో.. ఆ పనికి నడుం బిగించేదెవరు?

..ఎల్. విజయలక్ష్మి