Advertisement

Advertisement


Home > Politics - Opinion

సానుభూతి బ్రహ్మాస్త్రమా?

సానుభూతి బ్రహ్మాస్త్రమా?

ఎన్నికలకు ముందు ఒక నాయకుడికి ఒక దెబ్బ తగిలితే.. ఒక ప్రమాదం జరిగితే.. కాలో చెయ్యో విరిగితే..  దాడికి గురైతే.. అంతేనా.. ఆ దెబ్బవలన మొత్తం ప్రజల్లో పుట్టే సానుభూతి ఆ నాయకుడిని ఎన్నికల సమరాంగణంలో గెలిపించేస్తుందా? ప్రజాస్వామ్యం అంటే మరి ఇంత సులభమా? ఒక్క గాయంతో ప్రజలను మభ్యపెట్టవచ్చా.. అయిదేళ్ల పాటు తమను ఎవరు పరిపాలించాలో.. ‘రాజు’ స్థానంలో కూర్చుని తమ బాగోగులను ఎవరు నిర్దేశించాలో.. ఎంపిక చేసుకునే విషయంలో ఒక్క గాయం వల్ల, ఒక్క దాడివల్ల ప్రభావితం అవుతారా? ఇలాంటి ప్రచారాలను మనం నమ్మవచ్చా?

కేవలం సానుభూతి అనేది ఎన్నికల్లో అభ్యర్థులను విజయతీరాలకు చేర్చే బ్రహ్మాస్త్రం అవుతుందా? ఆ సిద్ధాంతం నిజమైతే.. ఈ దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత డొల్లతనంతో కూడుకున్నదా అని మనం పరిపరివిధాలుగా సిగ్గుపడాలి. ‘సానుభూతి కోసం’ అనే పదం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్న ఈ తరుణంలో ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సానుభూతి బ్రహ్మాస్త్రమా?’!

పురాతనమైన కథలు కొన్ని మనం వింటూ ఉంటాం. ఒక అత్యంత సీరియస్ భక్తుడు ఉంటాడు. మోక్ష ప్రాప్తికోసం భగవంతుణ్ని ఆరాధిస్తూ ఉంటాడు. తనకు మోక్షం ఇవ్వమని డిమాండ్ చేస్తూ.. దేవుడి ఎదుట నిల్చుని తన దేహభాగాలలో ఏదో ఒకటి నరికి ‘అర్పణ’ చేసేస్తుంటాడు. మోక్షం వస్తుందనే నమ్మకంతో ఉంటాడు. ఫలానా మతంలోనే ఇలాంటి అలవాటు అని కాదు.. చాలా మత విశ్వాసాలలో కొంచెం కుడిఎడమగా ఇలాంటి సానుభూతి పొందే ప్రయత్నాల ద్వారా దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

అలాగే మనం సినిమాలలో చూస్తుంటాం. మాంత్రికుడు క్షుద్రదేవత వికృతమైన విగ్రహం ఎదుట నిల్చుని.. వరాలు అడుగుతూ తన తల నరికి హోమగుండంలో వేసేసుకుంటాడు. అప్పుడా దేవత ప్రత్యక్షమై వాడు అడిగిన వరాలన్నీ ఇచ్చేసి.. తిరిగి తలను కూడా అతికించేస్తుంటుంది. వాళ్లందరికీ మోక్షం వచ్చిందో లేదో మనకు తెలియదు.. కానీ, అలాంటి పూజలను నమ్ముకుని అవిటివాళ్లుగా తిరిగే భక్తులు మనకు ఎక్కడైనా కనిపిస్తుంటారు. తల చెయ్యి మళ్లీ మొలిచిన మాంత్రికులు సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు. మనం విన్న, కన్న కథల్లో మాదిరిగి సానుభూతి వర్కవుట్ అయ్యే సూత్రం కాదని ఈ ఉదాహరణలు మనకు చెబతాయి. 

వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయం ‘సానుభూతి’ అనే పదం చుట్టూ తిరగడం మన ప్రారబ్ధం. ఈ పోకడ ఇప్పుడు మనరాష్ట్రానికే మాత్రమే పరిమితం కాదు. పూర్తిగా కొత్త కూడా కాదు. ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత.. పోటీలో ఉండే నాయకులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. ఇలాంటి ప్రచారం మొదలవుతూ ఉంటుంది. మామూలు రోజుల్లో దెబ్బలు తగిలితే ఎవరూ ఏం మాట్లాడరు. కానీ ఎన్నికల సమయంలో దెబ్బలు తగిలితే మాత్రం సూటిపోటి మాటలు అనడానికి ప్రయత్నిస్తుంటారు.

జగన్ మీద ఎవరో రాయి విసిరి గాయం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం దళాలు ఉలిక్కి పడ్డాయి. నేరం తమ మెడకు చుట్టుకుంటుందని భయపడ్డారో ఏమో తెలియదుగానీ.. జగన్ సానుభూతి కోసం ఆడిన డ్రామా ఇది అని బాగా ప్రచారం చేయడం ప్రారంభించారు. గత ఎన్నికలకు ముందు విశాఖలో జరిగిన హత్యాయత్నంతో దీనిని పోల్చి విమర్శలు చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలు గమనించాల్సిన పాయింట్ ఒక్కటే. అప్పుడు కూడా శీను కోడికత్తితోనే పొడిచినప్పటికీ..  ఆ గాయం కొంచెం తేడా వచ్చిఉంటే ప్రాణాపాయమే అయ్యేది. ఇప్పుడు ఇంకా ఘోరం. అది సూటిగా నుదుటికి తగిలింది. వీసమెత్తు తేడా వచ్చిఉంటే ఒక కన్ను పోయేది.  కేవలం సానుభూతి కోసం ఈ స్థాయిలో ఎవరైనా తమ దేహాన్ని పణంగా పెడతారా?

ప్రాచీన కథల ఉదాహరణలు చెప్పుకున్నట్టుగా.. మోక్షం వస్తుందో లేదో తెలియదుగానీ.. అవిటితనం మిగులుతుంది. ప్రజల సానుభూతి వస్తుందో లేదో గానీ.. అదేజరుగుతుంది. నాయకుల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు సానుభూతి కోసం ఇలాంటి డ్రామా ఆడారని అంటే ఎలా ఉంటుంది. తీవ్రతలో తేడా ఉన్నదిగానీ.. చంద్రబాబు కాన్వాయ్ మీద క్లెమోర్ మైన్ ల పేలుడు దాడి జరిగినప్పుడు.. అది చంద్రబాబు స్వయంగా ఆడించిన డ్రామా.. లేకపోతే క్లెమోర్ మైన్ దాడిలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడరు. తీవ్రత తక్కువగల బాంబులు వాడేలా ముందే ప్లాన్ చేసుకున్నారు.. అని దెప్పిపొడిచి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు కూడా అంతే. సానుభూతి కోసం ఎవ్వరూ తమ ప్రాణాలను పణంగా పెట్టరు గాక పెట్టరు. అయినా అసలు సానుభూతి దక్కినా కూడా.. ఆ సానుభూతి ఓట్లుగా మారుతుందని అనుకోవడం మాత్రం భ్రమ. 

2004లో బాబు ఓటమి చూశాం కదా..

సానుభూతి కోసం డ్రామా ఆడడం అంటే అందుకు మన దేశరాజకీయాల్లో నిలువెత్తు ఉదాహరణ నారా చంద్రబాబునాయుడు. 2003 అక్టోబరు 1న అలిపిరి వద్ద ఆయన కాన్వాయ్ పై బాంబుదాడి జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ దాడిని ఖండించి, అందుకు నిరసనగా ప్రదర్శనలు, ధర్నాలు చేసారే తప్ప వెటకారం చేయలేదు. దాడి నిజంగానే జరిగింది. చంద్రబాబునాయుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్రమంతా కూడా ఆయన మీద జరిగిన దాడికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనమీద సానుభూతి పుట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ దాడిని తన రాజకీయ సుస్థిరత్వానికి ఒక అందివచ్చిన అవకాశంగా వాడుకోవాలని చంద్రబాబులోని దుర్బుద్ధి కుట్ర రచన చేయించింది. ఆ సానుభూతిని ఎన్నికల్లో మెట్లుగా వాడుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఆలోగా జనంలో సానుభూతి పలచన అయిపోతుందేమో అని.. ‘‘కేవలం అందుకోసం’’ చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దు చేశారు. సానుభూతిని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.

ముందస్తుగా మధ్యంతర ఎన్నికలకు వెళితే ఏమైంది. జనం చంద్రబాబు పాలనను చాలా దారుణంగా తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనూహ్యమైన మెజారిటీతో ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు! ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. కేవలం సానుభూతి వలన గెలవడం అనేది జరగదు.

అధికార పక్షం అయితే పరిపాలన బాగుండాలి. ప్రతిపక్షం అయితే పరిపాలన చేయగల సమర్థులం తాము అని తమ దార్శనికతను, అభివృద్ధి వ్యూహాలను చెప్పడం ద్వారా వారు ప్రజలను నమ్మించాలి. ఎప్పుడూ కూడా ప్రజలు మంచి పరిపాలనను కోరుకుంటారు. పాలకుడు తమను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారా లేదా అనే పోకడను కోరుకుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారా? లేదా? అనేది మాత్రమే గమనిస్తుంటారు. వారి ప్రథమ ప్రాధాన్యం అదే. మనం సానుభూతి అనే పదాలు ఓటింగ్ ను ప్రభావితం చేస్తాయంటూ ప్రజల ఆలోచనను అవమానిస్తుంటాం. బుద్ధిని అనుమానిస్తుంటాం.  తెలివితేటలను అంచనా వేయడంలో విఫలం అవుతుంటాం. 

సానుభూతి.. ప్రయోజనాన్ని ఇవ్వదు!

సానుభూతి అంటే సానుభూతి మాత్రమే. దానివలన ప్రయోజనం దక్కదు. జగన్ కు దెబ్బ తగిలితే.. తటస్థ ఓటరు కూడా అయ్యో అనవచ్చు. కానీ ఓటు వేస్తాడనే గ్యారంటీ లేదు. ఎవరైనా మన వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటారు. మనకు సానుభూతి పుడుతుంది. కష్టాలకు తగిన సాయం చేయాలనుకుంటాం. పసిబిడ్డకు పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బుల్లేవని ఓ మిత్రుడు వచ్చి అడిగితే అంతవరకు ఇస్తాం. అంతే తప్ప.. ఓ పదిలక్షలు ఇచ్చి పండగ చేసుకోమనం చెప్పం కదా. సానుభూతి మనకు పుష్కలంగానే ఉంటుంది.. కానీ దానివలన వారికి దక్కే ప్రయోజనం ఎంత అవసరమో అంత మాత్రమే.

ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడును కొన్ని నెలల కిందట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్నారు.  ఆయనను అరెస్టు చేసినప్పుడు, 74ఏళ్ల ముసలివాడైన చంద్రబాబును హెలికాప్టర్ లో కాకుండా రోడ్డుమార్గంలో తీసుకువెళ్లినందుకు (ఆయన హెలికాప్టర్ ఎక్కను అంటే పోలీసులు మాత్రం ఏం చేయగలరు?.. అనేది ప్రజలు మర్చిపోయారు) ప్రజలు ఆయన మీద చాలా జాలి, సానుభూతి చూపించారు. ఆయన మీద జాలి పడిన వారిలో కేవలం పచ్చపార్టీ కార్యకర్తలు, అభిమానులే కాదు. అందరూ ఉన్నారు.

నిజం చెప్పాలంటే.. ఆ అరెస్టు తర్వాత, ప్రత్యేకించి తొలిరోజుల్లో ఆయన బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరింపబడిన తర్వాత తెలుగుదేశం దళాలన్నీ పండగ చేసుకున్నాయి. ఈ అరెస్టు వలన పుట్టిన సానుభూతి దెబ్బకు తమ పార్టీ రెడ్ కార్పెట్  మీద ప్రభుత్వంలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. చంద్రబాబు అరెస్టు వలన ఎంత సానుభూతి పుట్టినదంటే.. అది తాళలేక రాష్ట్రంలో ఏకంగా 203 మంది (భువనమ్మ అంకెల గారడీ ప్రకారం) ఏకంగా గుండె ఆగి చచ్చిపోయారు. అంటే జనానికి చాలా పెద్ద షాక్ కిందలెక్క కదా. మరి ఇప్పుడు ఆ అరెస్టు గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అసలు చాలామంది మరిచేపోయారు. అప్పుడు చంద్రబాబును జగన్ అరెస్టు చేయించాడు గనుక.. సైకిలుకు ఓటు వేయాలని అనుకునేవారు లేరు. జగన్ పరిస్థితి అయినా అంతే.. ఆయనకు దెబ్బ తగిలింది గనుక ఎవరూ ఓటు వేయరు. జగన్ పరిపాలన నచ్చితేనే ఓటు వేస్తారు. 

సానుభూతికి.. నమ్మకం కూడా తోడు కావాలి!

కాకపోతే సానుభూతి చేయగలిగే మహిమ ఒకటుంది. ద్వేషించేవాళ్లు కూడా కాస్త మెత్తబడతారు. తిట్టడం మానుతారేమో గానీ అందువల్ల ఓటు వేస్తారనుకోకూడదు. తగ్గిన ద్వేషంతో మళ్లీ మనిషిని తూకం వేస్తారు. అప్పుడు తాజాగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఒక నాయకుడు గెలవాలంటే.. కేవలం సానుభూతి చాలదు. దానికి తోడు నమ్మకం కూడా కావాలి. ఆ నాయకుడు సరైన పాలన అందించగలడు అనే నమ్మకం. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లగలడు అనే నమ్మకం. నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఉండగలడు అనే నమ్మకం కావాలి. ఇంకా సూటింగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన బలం ఈ నమ్మకమే.

తాను చేపడుతున్న పథకాల మీద ఎంత నమ్మకం ఉన్న నాయకుడు కాకపోతే.. ‘మీ ఇంటికి నేను చేస్తున్న అభివృద్ధి అందిఉంటేనే నాకు ఓటు వేయండి.. లేకపోతే ఓటు వేయవద్దు’ అనే మాట ఆయన చెప్పగలుగుతారు. తన పథకాల మీద, తన చిత్తశుద్ధి మీద ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంలాగా.. అలవిమాలిన అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. వాటిముందు ఇలాంటి దాడుల వలన పుడుతుందని ప్రచారం జరుగుతున్న సానుభూతి చాలా చాలా చిన్నది.

మరికొన్ని ఉదాహరణలు కూడా మనం గమనించాలి. రాష్ట్రంలో కేవలం సానుభూతి అనేది ఎన్నికలను సమూలంగా ప్రభావితంచేసిన ఘటనలు ఉన్నాయంటే.. ఇందిర, రాజీవ్ హత్యలను మనం గుర్తు చేసుకోవాలి. అంతటి దిగ్దంతులైన నాయకులు.. అలాంటి అసహజమరణాలకు గురికావడం వలన, హత్యలు జరిగిన తీరు వలన పుట్టిన సానుభూతి సునామీ ఆయా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను తుడిచిపెట్టేసింది. అంతకు మించి ఆ స్థాయిలో కేవలం సానుభూతి ఎన్నికలను ప్రభావితం చేసిందనే దృష్టాంతాలు మనకు లేవు. జనం తమ గుండెల్లో పెట్టుకునే మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత దారుణంగా అసహజ మరణానికి గురైతే.. ప్రజలు గుండెలవిసేలా రోదించారు. కానీ.. ఆ తర్వాత నాలుగేళ్లకు వచ్చిన ఎన్నికల్లో ఆయన కొడుకు అధికారంలోకి రాలేకపోయారు. కాలం ఆ సానుభూతిని పలచన చేసేసింది.

కాబట్టి సానుభూతి కోసం జగన్ స్వయంగా దాడి చేయించుకున్నారు లాంటి పిచ్చి మాటలు ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటే మంచిది. కేవలం సానుభూతి కోసం ఎవ్వరూ అలా చేయించుకోరు. ఓటు వేయడం వెనుక ఉండే ప్రజల విజ్ఞతను మనం గౌరవించాలి. వారు కేవలం సానుభూతికి ప్రభావితమై ఓట్లు వేసే బుద్ధిహీనులు కాదు. వారు పరిగణనలోకి తీసుకునే అంశాలు చాలాచాలా ఉంటాయి. అవన్నీ అందుకోగలిగిన నాయకుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో పాలకుడు కాగలగుతాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి.

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?