Advertisement

Advertisement


Home > Politics - Opinion

కూటమి నవ్వుల పాలు

కూటమి నవ్వుల పాలు

ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు దక్కింది. దాంతో తెదేపా వర్గం తొలుత సంబరపడ్డారు. వైకాపా పని ఇక పొయ్యిలో పడ్డట్టే అనుకున్నారు.

కానీ ప్రజాగళం సభలో మోదీ స్పీచయ్యాక నవ్వులపాలవ్వడం మొదలుపెట్టారు. కోరి కోరి సింహం నోట్లో తల పెట్టామా అనే అనుమానం తెదేపా వర్గాన్ని పట్టి పీడుస్తోంది. పొత్తులో ఉన్నట్టుగానే ఉంటూ, తెదేపా బలంగా ఉన్న స్థానాల్ని లాక్కునే మంతనాలు, పరోక్షంగా వైకాపాకి అడ్వాంటేజ్ గా మారే ఎత్తులు బీజేపీ వేస్తోందనే అనుమానంతో తెదేపా ఉక్కిరిబిక్కిరవడం మొదలయింది. 

పరిస్థితి ఇలా ఉంటే తెదేపా అధినేత ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆసరా కోసం పట్టుకున్న తాడు పామేమో అని అనుమానంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి? పొంచి ఉన్న ప్రమాదం అలా ఉండి, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎలక్షన్ టైం వరకు వేచి చూడడం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు. 

క్షీరసాగరమథనం చేసిన రాక్షసులకి శ్రీమహావిష్ణువు మోహినీరూపంలో అమృతం పోయకుండా అన్యాయం చేసినట్టు ఇక్కడ ఐదేళ్ల పాటు పొత్తు కోసం "పొత్తు"సాగరమథనం చేసిన తెదేపాకి మోదీ ద్వారా ఒరిగేదేమిటో అర్ధం కావట్లేదు. విష్ణువు దేవతల పక్షపాతి అయినట్టుగా భాజపా వైకాపాపై పక్షపాతం చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది యావన్మందికీ. 

అదలా ఉంటే, చంద్రబాబు ప్రచారంలో అపశ్రుతులు మరింత నవ్వులపాలు చేస్తున్నాయి. ఆటలో గోల్ వేయకపోయినా పర్వాలేదు కానీ సెల్ఫ్ గోల్ వేసి ప్రత్యర్థికి పాయింట్లివడం చేతకానితనమే అనిపించుకుంటుంది. ప్రస్తుతం బాబుగారు చెస్తున్నది అదే. 

వాలంటీర్లు నేరుగా వెళ్లి వృద్ధులకి పెన్షన్ ఇవ్వకూడదని, ఎందుకంటే అది ఎన్నికల కోడ్ కి విరుద్ధమని చంద్రబాబు వర్గం పెద్ద ఎత్తు వేసినట్టు జబ్బలు చరుచుకున్నారు. అలా చేయడం వల్ల ఎన్నికల ముందు నేరుగా పెన్షన్లు అందని వృద్ధులు వైకాపాపై రివర్స్ అవుతారని ఇక్కడ తెదేపా కుట్రపూరితమైన ఆలోచన. కానీ ఇది భయంకరమైన సెల్ఫ్ గోల్. తమకి ఐదేళ్లుగా ప్రతి నెల ఇంటి వద్దే లభించే పెన్షన్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోమంటే కారణమేంటో వాళ్లకి తెలీదనా? తెలియకపోయినా తెలియజెప్పరా వైకాపా శ్రేణులు? తెదేపా వాళ్లు అడ్డుపడ్డారని, అందుకే పరిస్థితి ఇలా దాపురించిందని, ఇక ఆ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పాతపద్ధతిలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనని చెప్పరా? ఆల్రెడీ చెప్తున్నారు. దీంతో కూటమిపై కోపం నషాళానికి అంటుతోంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి. 

ఓటర్ల మనసు గెలుచుకునే మాటలు, చర్యలు ఉండాలి తప్ప ప్రత్యర్థిని ఇబ్బంది పెడదాం అనుకునే ఎత్తుగడలన్నీ బూం-ర్యాంగ్ అవుతున్నాయి తెదేపాకి. ఇది ఇప్పటి విషయం కాదు. గత కొన్నేళ్లుగా అన్నీ బ్యాక్-ఫైర్లే!

అసలు తొలుత ఎన్నికలు తొలి విడతలో కాకుండా చివర్లో ఉంటే తమకి వైకాపాని దెబ్బతీయడానికి సరైన సమయం దొరుకుతుందని అనుకున్నారు. అనుకున్నట్టుగా అలా పెట్టించుకోగలిగారు. కానీ అది వైకాపాకి ప్లస్ అయ్యింది. ప్రచారానికి కావల్సినంత సమయం కేటాయిస్తున్నాడు జగన్. బాబుగారికి మాత్రం కావల్సినన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకోవడానికే పనికొస్తోంది ఈ సమయం. 

ఇక నవ్వుల పాలవుతున్న మరొక అంశం.

ఇద్దరు తెదాపా నాయకులు జనసేనలోకి జంపయ్యారట. అవినిగడ్డ నుంచి ఒకరు, పాలకొండ నుంచి మరొకరు జనసేన కండువాతో పోటీ చేస్తున్నారట! ఇదేమైనా వార్తా అసలు? అదేదో వైకాపా నుంచి జనసేనలోకి దూకినట్టు చాటింపేవిటో! ఈ పని చేస్తున్నది జనసేన వర్గం అని వేరే చెప్పక్కర్లేదు. తమ పార్టీకి కూడా ఎంతో కొంత వేల్యూ ఉందని చెప్పుకోవడానికి ఇంతకు మించిన వార్త మరొకటి దొరకలేదంటే ఏ రేంజులో కూటమి నవ్వులపాలవుతోందో చూడండి. 

అయినా ఏ కండువా అయితే ఏముంది? మూడు కండువాల్లో ఏదో ఒక కండువా కప్పుకుని నిలబడతారు! అంతోటి దానికి ఈ బాకాలెందుకు?

అలాగే, పిఠాపురంలో తెదేపా నాయకుడైన వర్మ కొడుకు ఆ ప్రాంత బీజేపీ ఇంచార్జ్ అట. ఈ తండ్రీ కొడుకులిద్దరూ జనసేన అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గెలుపుకి నిస్వార్ధంగా సహకరిస్తారట. ఒకే ఇంట్లో ఇలా రెండు మూడు కండువాలుంటున్నాయి. ఇవన్నీ జనానికి గూడుపుఠాణీలాగ కనిపిస్తోంది తప్ప ఎక్కడా సీరియస్నెస్ కానీ, చారిత్రక అవసరం కానీ, రాష్ట్రప్రజల ప్రయోజనం కానీ కనిపించడం లేదు. 

ఎందుకంటే చంద్రబాబే చెప్తున్నాడు...తాను అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థతో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉంటాయట. ఆ పని చేయడానికి ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమనెందుకు ఎన్నుకోవాలో చెప్పడు. మళ్లీ నవ్వులపాలే కదా! 

ఇక చంద్రబాబు కొత్త యువనాయకత్వానికి స్థానం కల్పించిందే లేదు. అంతా పాత నాయకులే. అన్నీ కాలం చెల్లిన మొహాలే. మరోపక్క రఘురామరాజుకి సీటివ్వక పోవడం వల్ల ఆయన పబ్లిక్ గానే తెదేపా మీద ఒంటికాలిపై లేస్తున్నాడు. ఇది మరొక నవ్వులపాలయ్యే అంశం. 

ఇంకా అయిపోలేదు. నాలుగు రోజుల క్రితం జగన్ టిప్పర్ డ్రైవరుకి సీటిచ్చాడని ఎద్దేవా చేస్తూ వెక్కిరించాడు చంద్రబాబు. ఇది సామాన్య వోటర్లకి ఎలా అనిపిస్తుంది? అంటే పేదలకి సీట్లివ్వకూడదా? చంద్రబాబులా కోటీశ్వరులకి మాత్రమే ఇవ్వాలా? ఇది ఇంకో సెల్ఫ్ గోల్. 

ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇప్పటికే ట్రోల్స్ తో నిండిపోతోంది సోషల్ మీడియా. 

పోనీ దత్తపుత్రుడైనా జనాన్ని తనవైపు తిప్పుకోగలుగుతున్నాడా అంటే అదీ లేదు. పిఠాపురంలో మూడు రోజుల ప్రచారానికి గాను ఒక్క రోజే చేసి హైదరాబాదుకి వెనుదిరిగాడు. ఆ ఒక్క రోజు కూడా "మిమ్మల్ని అర్ధిస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. నన్ను గెలిపించండి" అని ప్రాధేయపడ్డాడే తప్ప జనాకర్షకంగా మాట్లాడిందే లేదు. దానిని కాస్తా ఇప్పుడు పతిభిక్ష పెట్టమని ప్రాధేయపడే సతీసావిత్రి సీన్ తో కలిపి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. జనం నవ్వుతున్నారు. అవును కూటమిలో తెదేపా, జనసేనలిద్దరూ నవ్వులపాలవుతున్నారు. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?