అమెరికాలో తెలుగు సంఘాల లక్ష్యాలేవిటి? అసలవి ఎందుకు ఏర్పడ్డాయి? అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్ళు ఆ సంస్థలకు విరాళాలు దేనికోసమిస్తారు? రెండేళ్లకొకసారి జరిగే వేడుకల సంగతి పక్కన పెడితే మిగిలిన సమయాల్లో ఆ సంస్థల కార్యక్రమాలేవిటి?
“ఐకమత్యమే మహాబలం” అని నమ్మే దేశం నుంచి వెళ్ళినవాళ్లు కాబట్టి “మన” అనబడే తెలుగువాళ్లంతా ఒక గొడుగు కింద ఉంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేందుకు, కష్టాల్లో వెన్నంటి నిలిచేందుకు ఏర్పడ్డ సంఘాలవి. తెలుగువారి ఐక్యత వర్ధిల్లాలంటే తెలుగు భాషని, సంస్కృతిని మరిచిపోకుండా వీలున్నంత వరకు తర్వాతి తరానికి కూడా దానిని తీసుకువెళ్లాలనేది ఆయా సంఘాల ఆలోచన.
అయితే కాలక్రమంలో ఏం జరుగుతోంది? ఎప్పటికప్పుడు మొదటి తరం వారి చేతుల్లోనే సంఘాలు నడుస్తున్నాయి తప్ప రెండో తరం యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏటేటా అమెరికాలో స్థిరపడుతున్న తెలుగువాళ్లు ఎక్కువ కావడంతో మొదటితరం (ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన వాళ్లు) వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. అక్కడే పుట్టి పెరిగిన రెండో తరం వాళ్లు పెద్దగా ఈ సంఘాల్లో నాయకులుగా కనిపించడం లేదు. పర్యవసానంగా క్రమంగా లక్ష్యాలు మారిపోతూ వచ్చాయి.
ఏ తెలుగు విద్యార్థో అమెరికాలో మరణిస్తే ఆ బాడీని లీగాలిటీస్ పూర్తి చేసి ఇండియాకి పంపిస్తున్నాయి ఈ సంఘాలు. వాటికయ్యే ఖర్చులు భరిస్తున్నాయి. అలాగే ఏ తెలుగు వ్యక్తో ఏ సైకో వల్లనో షూటౌట్ లో మరణిస్తే ఆ కుటుంబానిని ఫండ్ రైజింగ్ చేయించి ఆదుకుంటున్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ, వీటికంటే ఎక్కువగా కులపిచ్చి, స్వార్థం, రాజకీయ అవసరాలు ఈ సంఘాల్ని మింగేస్తున్నాయి.
ఉదాహరణకి తాజాగా జరిగిన తానా వేడుకల్ని చూస్తే అందరికీ బాహాటంగా కనిపించిన అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. వేడుక మూడు రోజులూ ఎన్.టి.ఆర్ భజన, “జై బాలయ్య” నినాదాలు. అలవాటైన ప్రాణాలకి ఏమో గానీ, కొత్తగా ఈ వేడుకలకి వెళ్లినవాళ్లకి మాత్రం వెగటు పుట్టేసింది. తెలుగుతనం, చరిత్ర, సంస్కృతి అంటే ఎన్.టి.ఆర్ ఒక్కడేనా? ఆయన్ని దేవుడిగానూ, ఆ దేవుని బిడ్డగా బాలకృష్ణని పూజించడమేనా? ఈ భజనని ఒక డ్రగ్గులాగ ఎక్కించుకున్న స్వకులం వారు,అలాగే ఆ భజన వల్ల ఎంతో కొంత లబ్ధిపొందుతున్న ఇతరకులస్థులు ఈ వేడుకల్లో ఆత్మీయ అతిథులయ్యారు. వాళ్లందరికీ లక్షలు పోసి టికెట్లు కొని తోలుకొచ్చారు.
ఇక ఆ సమావేశాల్లో కీలకసభ్యుల్లోనూ వారి వర్గంలోనూ కనిపించినవి ఇవే.
– చంద్రబాబుని మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీయం గా చూడాలంటే ఏం చెయ్యాలి?
– రేవంత్ రెడ్డిని ఏ విధంగా తెలంగాణా ముఖ్యమంత్రిని చెయ్యాలి?
– కేంద్రంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని పీయం చేయాలంటే ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్నలకి జవాబుల్లా కనిపించిన అతిథులు ఎందరో వచ్చారు ఆ వేడుకకి. వెంకయ్యనాయుడు, ఎన్వీ రమణ, మురళిమోహన్, ఎబి వెంకటేశ్వరరావు, రఘురామరాజు, బాలకృష్ణ, రేవంత్ రెడ్డి ఇలా లిష్టు చాలా పెద్దదే ఉంది.
కొందరు తానా ఎన్నారైల కోరిక ఒక్కటే. పైన అనుకున్నవి జరిగితే మొత్తం దేశాన్ని కొనేసి అమ్మేయొచ్చని. అందరూ వడ్డించేవాళ్లైతే పడి తినొచ్చన్న వైనం అన్నమాట. పొలాలమధ్యలో ఉన్న అమరావతే కాకుండా ఇటు హైదరాబాదు, అటు ఢిల్లీ, కాశ్మీరు ఇలా అన్ని చోట్లా రియలెస్టేట్ దందాలకు తెరలేపి లక్షలకోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన!
ఎక్కడో అమెరికాలో కూర్చున్న కొందరు ఇండియాలో సీయమ్ముల్ని, పీయమ్ముల్ని మార్చేయగలరా అని అనుకోవచ్చు. 'గలరా' 'లేదా' అనేది పక్కనపెడితే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేయగలరు. ఎన్నారైలంటే కేవలం పార్టీలకి విరాళాలు ఇచ్చేవారిగా మాత్రమే పరిగణిస్తారు చాలామంది. కానీ అది నిజం కాదు. భారతదేశంలో ఉన్న న్యాయపరమైన, పరిపాలనాపరమైన, పాత్రికేయపరమైన, చట్టపరమైన శక్తుల్ని పావులుగా చేసి కదపగల నేర్పరులున్నారు. ఏ ఎమోషన్ పెడితే ఏ పావు కదులుతుందో వాళ్లకి తెలుసు. కొన్ని పావులకి డబ్బిస్తే పని అవుతుంది, కొన్నిటికి డప్పు కొడితే అవుతుంది. అలా ఎవరి అవసరాన్ని ఎలా శాటిస్ఫై చెయ్యాలో చేసి దేశంలో కదలిక తీసుకురాగలరు.
పాత్రికేయం ద్వారా గోబెల్స్ ప్రచారం చేయించడం, న్యాయవ్యవస్థ ద్వారా కేసులు పెట్టడం మరియు కొట్టించేసుకోవడం, పరిపాలనా వ్యవస్థలో వేగుల్ని పెట్టడం..ఇలా ఒకటి కాదు ఒక పెద్ద చదరంగాన్నే ఆడేసే తీరిక, ఓపిక, వనరులు ఉన్న సంఘాలుంటున్నాయి.
అందుకే అమెరికా తెలుగు సభలన్నా, అక్కడి ఎన్నారైలన్నా తెదేపాకి కమ్మగా ఉంటుంది. వాళ్లని చూసి నాటా సంఘం వైకాపాకి సానుభూతి చూపించినా అన్నేసి తెలివితేటలు, యంత్రాంగం ఏ మాత్రం లేని సంఘమది. బండగా ఒక పార్టీకి తమ అభిమానాన్ని చాటుకోవడం తప్పించి యుక్తులు, కుయుక్తులు పన్నే శక్తులు ఇంకా వీళ్లకి లేవు.
ఆర్. బాలాంత్రపు