Advertisement

Advertisement


Home > Politics - Opinion

నేర హృదయాల నయా వేదాలు!

నేర హృదయాల నయా వేదాలు!

సమాజంలో నేరాల గ్రాఫ్ మారుతోంది. నేరాలకు పాల్పడే వాళ్లను అంచనా వేయడం అసాధ్యం అవుతోంది. దురాలోచనలు ఉండేవాళ్లు క్రమంగా నేరస్తులుగా తయారవుతారనేది పాత మాట. మన మధ్యలో మన స్నేహితుల్లాగా, ఇరుగుపొరుగులాగా, పరిచయస్తుల్లాగా, సౌమ్యులుగా, ఎంతో మంచిగా కనిపించే వాళ్లు కూడా తెల్లారేసరికి దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. 

మంచివాళ్లు కూడా నేరగాళ్లు అయితే హత్యలలో ఎంత వైవిధ్యం, విలక్షణతో ఉంటుందో.. మనకు వర్తమాన సమాజంలో కనిపిస్తోంది. ‘ఇన్నోవేటివ్’ దారుణాలు జరుగుతున్నాయి. ఆధునికతరం జీవన శైలుల్లో అనేకానేక మానసిక వికారాలు, మానసిక పరిస్థితులు ఇలాంటి కొత్తదారుణాలకు కారణమౌతున్నాయి. ఈ పరిస్థితుల విశ్లేషణే.. ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

సమాజంలో నేరాల రూపురేఖలు మారుతున్నాయి. దర్యాప్తు తీరుతెన్నులు కూడా మారుతున్నాయి. నేరం చేసిన వారు చిటికెలో దొరికిపోతారనే అభిప్రాయం, భయం వ్యాపిస్తోంది. చాలా నేరాల విషయంలో అలా జరుగుతోంది కూడా. హత్యలు, అత్యాచారాలు చేసిన వారిని పోలీసులు సులువుగా ఛేదించగలుగుతున్నారు. సాంకేతిక విప్లవం, ఆధునిక సాంకేతిక పోకడలు, ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిన జీవనశైలులు నేరస్తులను వెంటనే గుర్తించడానికి పట్టుకోడానికి చాలావరకు తోడ్పడుతున్నాయి. 

నేరస్తులు పట్టుబడుతున్న శాతం పెరుగుతోందన్న మాట నిజమే.. మరి అలాంటి భయంతో నేరాల సంఖ్య తగ్గుతోందా? అనేది ఇక్కడ కీలకంగా పరిశీలించాల్సిన విషయం. నేరాల మోతాదు ఏమాత్రం తగ్గడం లేదు. నేరాలు మరింతగా పెరుగుతున్నాయి. మనల్ని భయపెడుతున్న మరో అంశం ఏంటంటే.. చాలా ‘ఇన్నోవేటివ్’ నేరాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలే పెద్ద నేరాలకు దారితీస్తున్నాయి. 

ఏ బార్ లోనో తాగుతున్ననప్పుడు అపరిచితుల మధ్య చిన్న వాగ్వాదం ముదిరి తుపాకీకాల్పుల వరకు దారితీసిన దుర్ఘటనలు మన చుట్టూ ఉన్న సమాజంలోనే కనిపిస్తున్నాయి. తుపాకీ కలిగి ఉండడానికి లైసెన్సు, అనుమతి అవసరం లేని అమెరికా వంటి అగ్రదేశాల్లోని గన్ కల్చర్ గుర్తుకు తెచ్చే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనదేశంలో గన్ ఉండాలంటే అనుమతి కావాలి నిజమే, కానీ అనుమతి అవసరంలేని గన్  విక్రయాలు విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆ కల్చర్ రాకుండా ఎలా నియంత్రించగలరు? అలాంటి నేరాలు కూడా పెరుగుతున్నాయి. 

అన్నీ భయపెట్టే హత్యలే..

క్షణికావేశంలో కొన్ని హత్యలు జరుగుతుంటాయి. వీటిలో చాలా హత్యలకు శిక్షలు కూడా తక్కువే పడుతుంటాయి. కానీ, ఒక పథకం ప్రకారం , వ్యూహం ప్రకారం చేసే హత్యలను సీరియస్ గా న్యాయస్థానం కూడా పరిగణిస్తుంది. అయితే ఇప్పుడు సమాజంలో దాదాపుగా అన్నీ రెండో రకం హత్యలే. కేవలం అంతమాత్రమే కాదు, వాటి హింసాత్మక, వికృతపోకడలతో భయపెట్టే హత్యలుగా కూడా కనిపిస్తున్నాయి. అవును, ఇవి కేవలం బాగా ఆలోచించి, ఒక వ్యూహం ప్రకారం చేస్తున్న హత్యలు మాత్రమే కాదు. మన ఆలోచనల్లో మిగిలిపోయి భయపెడుతూ ఉండే హత్యలు కూడా. 

ఏడాది వయసు కూడా లేని పసిబిడ్డను కన్నతల్లి స్వయంగా, కేవలం ఒక అక్రమ సంబంధాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి హత్య చేసే దుర్మార్గమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో, దానిని తెలుసుకున్న కన్న బిడ్డలను తల్లులే చంపేయడం, తాగిన మత్తులో భార్య మీద అనుమానంతో పుట్టిన బిడ్డలను చంపేయడం లాంటి నేరాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. మనునషుల్లో హృదయం అనేది ఉంటోందా? ఉన్నట్లయితే ఇంత పైశాచికంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? అనే భయం మామూలు ప్రజలకు కలిగే పరిస్థితి. 

ప్రేయసీ ప్రియుల విషయంలో ఇదివరకటి నేరాలన్నీ అయితే యాసిడ్ దాడులు, లేకపోతే కత్తితో పొడవడాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రేమనేరాలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయి. అబ్బాయిలకు మేమేం తీసిపోలేదని అమ్మాయిలు చాటుకుంటున్నారు. అబ్బాయిలు చేసే దాడులు, హత్యలు చాలా సందర్భాల్లో క్షణికావేశంలో చేసే దుర్మార్గాలుగా గతంలో నిరూపణ అయ్యేవి. కానీ ఈ తరంలో అమ్మాయిలు చేసే హత్యలు చాలా ప్లాన్డ్ గా, చాలా కర్కశంగా జరుగుతున్నాయి. 

ఓటీటీ వికృతాలు..

కురుక్షేత్ర యుద్ధంలో ఓ ఘట్టం ఉంటుంది. తన కొడుకు అభిమన్యుడిని చంపిన సైంధవుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. బాణంతో సైంధవుడి తల శరీరంనుంచి వేరుపడేలా ఎగరగొడతాడు. వేరే శాపప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఆ తల ఎగిరి వెళ్లి, ఎక్కడో దూరంగా అడవిలో తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రి వృద్ధక్షతుడి ఒడిలో పడేలాగా చేస్తాడు. తర్వాతి కథ మనకు అప్రస్తుతం. కొడుకు తలను వేరుచేసి.. దూరంలో ఉన్న తండ్రి చేతిలో పడేలా చేశాడన్నమాట. యుద్ధమూ పాండవుల హీరోయిజమూ, ప్రతీకారమూ లాంటివి పక్కన పెడితే చాలా వికృతంగా అనిపిస్తుంది సైంధవుడి మరణం. యుద్ధ హత్యలలో ఇంకా అనేకానేక రకాల వికృతాలు ఉంటాయి. మహాభారత కాలం నాటి పోకడ అది. వేల సంవత్సరాల తర్వాత ఆ వికృతాలు ఎంతగా అప్డేట్ అయ్యాయో మనకు ఈ హత్య చెబుతుంది. 

ఇంజినీరింగ్ చదువుతున్న ఓ కుర్రవాడు తన మిత్రుడిని హత్య చేశాడు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారు. మిత్రుడిని అడ్డు తొలగించుకోవాలనుకుని చంపేశాడు. ఇలాంటి హత్యలు మనకు కొల్లలుగా కనిపిస్తాయి. కానీ హతుడి అవయవాలను ముక్కలుగా కోసేసి, శరీరాన్ని చీల్చి గుండె బయటకు తీసి, మర్మాంగాన్ని కోసేసి ఇలా అనేక వికృతాలకు పాల్పడ్డాడు. ఇంతకంటె దారుణం ఏంటంటే.. ఒక్కో శరీరభాగాన్ని కోసేసి దాన్ని తన ఫోనులో ఫోటో తీసి, తన గర్ల్ ఫ్రెండ్ కు వాట్సప్ లో పంపి వాటి గురించి కామెంట్స్ కూడా పంపాడు. ఈ చేత్తోనేనా నిన్ను ముట్టుకున్నాడు, ఈ గుండెలోనేనా నువ్వు ఉన్నావని చెప్పాడు.. లాంటి మాటలతో ఆయా శరీర భాగాల ఫోటోలను అమ్మాయికి వాట్సప్ చేశాడు. 

ఇలాంటి వికృతమైన హత్యను మనం ఎరగం. ఇంత వికృత ఐడియా ఇప్పటిదాకా ఓటీటీ మేకర్స్ కు కూడా రాలేదు. విస్తుగొలిపే అంశం ఏంటంటే.. ఇంజినీరింగ్ చదువుతున్న ఆ అమ్మాయి కూడా వాట్సప్ లో వస్తున్న శరీర భాగాల ఫోటోలను చూసి ఆనందించింది. 

ఇంతా కలిపి హత్య చేసిన వాడుగానీ, హత్యకు ప్రేరేపించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న అమ్మాయి గానీ.. ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రతనంలో ఉన్నవాళ్లు. ప్రొఫెషనల్ నేరగాళ్లు కాదు. మరి ఇంత ఘోరమైన ఆలోచనలు వారికి ఎలా వచ్చాయి. ఎలా చేయగలిగారు? ఎలా చూసి నిమ్మళంగా ఉండగలిగారు. యువతరంలో వికృతపోకడలు, హింసాత్మక ప్రవృత్తి పెరుగుతున్నాయి! సెన్సార్ అన్నది ఉండని ఓటీటీ సినిమాలు, సిరీస్ లలో ప్రవహించే హింసాత్మకత కూడా వారికి స్ఫూర్తి! ఇతర ప్రాంతాల్లో జరిగే హత్యలు, ఆ పరిణామాలను గమనించి.. అంతకంటె ఘోరమైన వాటిని ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో తనతో సహజీవనం సాగిస్తున్న ప్రియురాలిని.. చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచి ఉంచిన వాడి వైనం కూడా మనం గమనించాం. నేటి యువతరానికి హింస అనేది ఒక ఆరాధ్య అంశంలాగా మారుతోందా? అనే భయం కలుగుతోంది. 

మైక్రోజీవితాలు ప్రధాన కారణం.. 

ఎందుకిలా జరుగుతోంది. మనుషులు హృదయం లేకుండా ఎందుకింత రాక్షసంగా ఎందుకు తయారవుతున్నారు? అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే.. ఇవాళ్టి సమాజంలో మనవి మైక్రోజీవితాలు అయిపోతున్నాయి. నిన్నటి సమాజంలో మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయనే బాధ ఆవేదన సర్వత్రా వినిపిస్తూ ఉండేది. మొన్నటి తరంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు.. ఒక పెద్ద సమూహం మధ్యలో ప్రేమానుబంధాల ఆప్యాయతలు అన్నీ అంతరించిపోయి, మైక్రో ఫ్యామిలీలు ఏర్పడ్డాయి అనే ఆవేదన పలువురిలో ఉండేది. ఇలాంటి మైక్రో ఫ్యామిలీలు ఏర్పడడానికి ఒక సహేతుకమైన కారణం ఉంది. 

మొన్నటి తరానికి– నిన్నటి తరానికి మధ్య ఒక తేడా ఉంది. నిన్నటితరంలో రకరకాల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బతుకు తెరువుగా వ్యక్తులు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లడం అనేది పెరిగింది. ఆటోమేటిగ్గా ఉమ్మడి కుటుంబాలు పోయాయి. మైక్రో ఫ్యామిలీలు తయారయ్యాయి. కుటుంబాలు గడవడం కోసం తప్పనిసరి ఉపాధి అంశాలతో ముడిపడి మైక్రో ఫ్యామిలీలు ఏర్పడడం జరిగింది. 

కానీ ఇవాళ్టి తరంలో మైక్రో వ్యక్తిగత జీవితాలు ఏర్పడుతున్నాయి. ఒక కుటుంబంలో దంపతులు, ఇద్దరు పిల్లలు కలిపి నలుగురు సభ్యులుంటే.. ఆ నలుగురూ కలసి ముచ్చట్లు చెప్పుకునే, మంచిచెడులు మాట్లాడుకునే సందర్భాలు అస్సలు ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా వారిదైన సొంత ప్రపంచంలో మాత్రమే బతుకుతుంటారు. ఫరెగ్జాంపుల్.. భర్త వాట్సప్ లో జీవిస్తూ ఉంటే, భార్య టీవీ సీరియల్స్ లో మునిగి ఉంటుంది. పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడుకోవడంలోనో, వయసును బట్టి ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనో అక్కడి పరిచయాలతోనే బతికేస్తుంటారు. 

సాంకేతికత అనేది క్రమంగా ఒకే ఇంట్లోని మనుషుల మధ్య కనిపించని ఉక్కుగోడలను నిర్మిస్తోంది. పగులగొట్టడానికి కూడా వీల్లేని గోడలు అవి. ప్రేమానుబంధాలు, ఆప్యాయాతలు, ఒకరి ఎమోషన్స్ ను కష్ట సుఖాలను, సాధక బాధకాలను మరొకరు పంచుకోవడం వంటివి జీరో అయిపోయాయి. పంచుకునే వారు లేనప్పుడు.. ఏ ఒక్కరికి ఏ చిన్న కారణాన ఫ్రస్ట్రేషన్ ఏర్పడినా, అది అతనిలోనే ఉండిపోయి.. విశ్వరూపం దాల్చి అతడినే కబళించేస్తుంటుంది. లేదా, ఏ నేరం గురించిన ఆలోచన అతడిలోకి వచ్చినప్పుడు మరింత వికృత పోకడలకు అది దారితీస్తుంటుంది. 

పరిష్కారమేమైనా ఉందా?

ఇలాంటి పెడపోకడలకు ‘ప్రజల్లో మార్పు రావాలి’ లాంటి పడికట్టు పదాలు తప్ప సాధారణంగా పరిష్కారాలు కనిపించవు. కానీ.. కాస్త మనసు పెట్టి, సహృదయంతో ఆలోచిస్తే మనకు పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. రేపటితరం పౌరులను తయారుచేస్తున్న చదువుల్లో కరికులం మారాలి. 

ఇన్నాళ్లూ మనం చదువుకున్న పుస్తకాల్లో చరిత్ర వక్రీకరణ జరిగిందని అంటూ.. ఇప్పుడు మొత్తం పుస్తకాలను మార్చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తూ పాఠ్యపుస్తకాల ద్వారా పిల్లల మెదళ్లలోకి చొప్పించాలని మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. కరికులం మార్చడం అనేది మంచి పరిణామమే, అవసరమే! కానీ, ప్రభుత్వాలు అలాంటి మార్పులను రాజకీయ భవిష్య ప్రయోజనాలకోసం లక్ష్యిస్తున్నాయి. ఇదే ఈ దేశానికి పట్టిన ఖర్మ.

కరికులంలో వచ్చే మార్పులు చిన్నతనం నుంచి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేలా ఉండాలి. పాఠాలను బోధించే క్రమంలోనే విద్యార్థుల నడవడిని గమనించేలా, వారి ఆలోచనల్లో స్వచ్ఛత, సహృదయత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టీచర్లకు తరచుగా ఓరియెంటేషన్ కూడా జరుగుతుండాలి. వ్యక్తిత్వాల నిర్మాణం అనేది పిల్లల దశనుంచి సజావుగా, రుజుమార్గంలో జరగడానికి ప్రయత్నం ఉండాలి. 

అలాగే, నేటి యువతరాన్ని ప్రభావితం చేస్తున్న మీడియా కూడా! మీడియా కమర్షియల్ హంగుల కోసం హింసను ప్రేరేపించే సన్నివేశాలను ఎలాగైతే ప్రధానంగా చూపిస్తారో.. అలాగే కనీసం ఆయా మంచి కేరక్టర్లను చూపించేప్పుడు వారి వ్యక్తిత్వ ప్రదర్శన తగ్గట్టుగా ఉండాలి. ఇవి కూడా క్లిష్టమైనవే. సత్వరఫలితాలు అందించేవి కాదు. కానీ ప్రయత్నమే చేయకుండా విస్మరించడం ఇంకో నేరం అవుతుంది. 

మనుషులుగా బతకడంలో సంయమనం నేర్చుకోవడం మాత్రమే ఇలాంటి వికృతమైన, హృదయం లేని నేరాలపోకడలకు అడ్డుకట్ట వేస్తుంది. కానీ.. అది అంత సులభమైన పరిణామమేమీ కాదు! ఉపదేశాలతో మారే తరం లేదిప్పుడు. స్వానుభవంలో నేర్చుకోవడం ఒక్కటే మార్గం. కానీ.. చాలా మందికి స్వానుభవం ఒక గుణపాఠం నేర్పేలోగా.. జీవితమే అంతరించిపోతోంది. ఇది శోచనీయం.

..ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?