మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. జనసేనాని పవన్‌కల్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఎలాగైనా వైఎస్ జగన్‌ను అధికార పీఠం నుంచి దించేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యం లో నిన్న మంగళగిరి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు పెట్టారు. అవి ఏంటంటే… ఒకటి ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు, రెండోది బీజేపీతో కలిసి వెళ్లడం, మూడోది బీజేపీ, టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం.
రెండో ఆప్షన్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జై కొట్టారు. పవన్‌కల్యాణ్ తమకు మార్గనిర్దేశం చేశారనే పెద్ద మాటను కూడా ఆయన చెప్పారు. ఇదిలా వుండగా పవన్‌కల్యాణ్ ఆప్షన్‌పై టీడీపీ ఫైర్ అవుతోంది. జనసేనతో పొత్తును ఆ పార్టీలో 95 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే, చివరికి తమ పార్టీ వాళ్లే ఓట్లు వేసే పరిస్థితి లేదని టీడీపీ సీనియర్ నాయకుడొకరు కీలక వ్యాఖ్య చేశారు.
ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే జనసేనాని పవన్‌కల్యాణ్‌పై చెలరేగిపోతోంది. పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్స్ ఇస్తే, తాము నాలుగో ఆప్షన్ ఇస్తామంటూ, అన్నంత పని చేశారు.
నాలుగో ఆప్షన్‌గా… షట్టర్ మూసేసి హ్యాపీ గా సినిమాలు చేసుకో. రాజకీయం ఫుల్ టైం పొలిటీషియన్స్ చేసుకుంటారు అనే కామెంట్‌ను టీడీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారంలోకి తీసుకురావడం గమనార్హం. దీన్ని బట్టి పవన్‌కల్యాణ్‌ను టీడీపీ ఏ విధంగా పరిగణిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. పవన్‌పై టీడీపీ సోషల్ మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ ఆణిముత్యాలేంటో తెలుసుకుందాం.
“అసలు తగ్గాలని చెప్పడానికి నువ్వెవరు పవన్‌కల్యాణ్? రెండు చోట్ల పోటీ చేసి, కనీసం ఒక్క చోటైనా ఎమ్మెల్యేగా గెలిచావా? 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన చరిత్ర మా చంద్రబాబుది. నువ్వేంటి మాకు ఆప్షన్స్ ఇచ్చేది?”
“రాజకీయం అంటే సినిమా కాదు పవన్. తాతకు దగ్గు నేర్పినట్టుగా, మాకు ఆప్షన్స్ ఇస్తావా? బుర్ర పని చేస్తోందా? మతి ఉన్నవాళ్లెవరైనా మరో పార్టీని తగ్గాలని సూచిస్తారా? నీ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో నువ్వు ఇచ్చిన ఆప్షన్సే చెబుతున్నాయ్”
“2024 లో టీడీపీ ఒంటరిగా వెళ్లడం మంచిది. రాష్ట్రానికి “బాబు” అవసరం అనుకుంటే ఆయన్ని ప్రజలే గెలిపిస్తారు. ఒకవేళ ఓడితే బాబుకి వచ్చే నష్టమేమీ లేదు. మనవడితో ఆడుకుంటాడు. ఆ తర్వాత AP మరో శ్రీలంక ఖచ్చితంగా అవుతుంది”
“పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడం కంటే చెత్త పని మరొకటి లేదు. దానికంటే ఓటమే గౌరవప్రదమైంది. పవన్‌కల్యాణ్‌ను భరించడం అసాధ్యం”
ఇలా అనేక రకాల కామెంట్స్ టీడీపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. జనసేనాని పవన్‌కల్యాణ్ ఆప్షన్స్‌తో పాటు కాస్త తగ్గాలనే హితవు చెప్పడంపై టీడీపీ రగిలిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో వద్దనే నినాదంతో టీడీపీ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
సొదుం రమణ