టీఆర్పీ కోసం దేవి- పబ్లిసిటీ కోసం విష్వక్సేన్

“కుక్కపిల్ల సబ్బుబిళ్ల అగ్గిపుల్ల- కాదేదీ కవితకనర్హం” అన్నాడు శ్రీ శ్రీ.  Advertisement ఇప్పుడు శ్రీశ్రీయే బతికుంటే “కంట్రవరీ కామెడీ ట్రాజెడీ- కాదేదీ పబ్లిసిటీకనర్హం” అనుండేవాడేమో.  ఇదంతా రియలిటీ షోల యుగం. ప్రాంక్ వీడియోల్ని జనం…

“కుక్కపిల్ల సబ్బుబిళ్ల అగ్గిపుల్ల- కాదేదీ కవితకనర్హం” అన్నాడు శ్రీ శ్రీ. 

ఇప్పుడు శ్రీశ్రీయే బతికుంటే “కంట్రవరీ కామెడీ ట్రాజెడీ- కాదేదీ పబ్లిసిటీకనర్హం” అనుండేవాడేమో. 

ఇదంతా రియలిటీ షోల యుగం. ప్రాంక్ వీడియోల్ని జనం విచ్చలవిడిగా చూస్తూ కాలాన్ని గడిపేసే తరం.  

మరి పబ్లిసిటీ పాత మూస పద్ధతిలో ఉంటే ఎలా?

అన్నీ పధ్ధతిగా జరుగుతుంటే ఎవడు పట్టించుకుంటాడు. ఏం చేసినా కొత్తదనం ఉండాలి. 

“ఇదిగోండహో! కొత్త పద్ధతిలో ప్రచారం చేస్తున్నాం చూడండి” అంటే “ఏడ్సావులే” అని నిట్టూర్చే హృదయంలేని ప్రేక్షకులున్న జమానా ఇది. 

అందుకే ఏదీ చెప్పకుండా చేసుకుంటూ పోవాలి. 

సినిమాలే కాదు, వార్తా ప్రసారాలు అంతే. 

ఒకానొక మహానటి బాత్ టబ్బులో మరణిస్తే అలాంటి ఒక టబ్బుని ఏర్పాటు చేసుకుని అందులోకి దూకి మరీ ఆ వార్త చెప్పే యాంకర్లున్న దేశమిది. 

చంద్రయాన్ పేరుతో ఇస్రో వాళ్లు రాకెట్ పంపితే అది చంద్రుడ్ని చేరే లోపే గ్రాఫిక్సులో చంద్రమండలం సెట్టింగేసుకుని లైవ్ టెలీకాస్ట్ పెట్టే న్యూస్ యాంకర్లున్న చానల్స్ మనవి. 

భారీవర్షాలతో ఊరు జలమయమవుతుంటే, “రుధిరం ఏవైనా ఊడిపడుతోందా? రుధిరం మన మీద పగపట్టిందా? రుధిరం చేస్తున్న రణాన్ని మనం ఎదుర్కోగలమా అనిపించింది” అంటూ “రుధిరం” అనే పదానికి అర్థం కూడా తెలియని యాంకర్లు విరుచుకుపడే కాలమిది. 

అలాంటి అవకతవక వీడియోల్నే ట్రోలింగ్ పేరుతో ప్రచారం  చేసే లోకమిది. 

మరేం చేస్తారు? టీవీ చానల్స్ కి టీఆర్పీలు కావాలంటే ఈ సర్కస్సులు తప్పవు.  అలాగే చిన్న సినిమాలు కూడా. జనం దృష్టిలో పడాలంటే ఈ మాత్రం అతి తప్పదు.  

అందుకే “అశోకవనంలో అర్జునకళ్యాణం” ప్రొమోషన్లో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఒక అద్భుతమైన రియాలిటీ షో నడిపారు సదరు సినీ హీరో మరియు ఒక టీవీ చానల్ కలిసి. 

అయితే ఇందులో అందరూ సగమే రియాలిటీ షో అనుకుని మిగతాది నిజమనుకుని భ్రమ చెందారు. 

దేవి అలా చేయడం కరెక్టని ఆర్జీవీ, అలా చేయడం తప్పని బాబు గోగినేని ఇలా ఎవరికి తోచింది వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. 

అసలు విష్వక్సేన్ స్వీట్ పాకెట్ పట్టుకుని నేరుగా స్టూడియోలోకి ఎంటరయ్యి దేవి ముందు పాకెట్ ఓపెన్ చేసిన సన్నివేశంలో ఆమె బాడీ లాంగ్వేజ్ ని బట్టే ఇదంతా ఉత్తిత్తి కాంట్రవర్సీ అని తెలిసిపోవాలి. 

హీరోగారు ఫ్లోలో 'ఎఫ్' వర్డ్ వాడడమొక్కటీ ప్రీ ప్లాండ్ కాకపోవచ్చు కానీ దేవీ అతనిని గెటౌట్ అనడం మాత్రం ఉత్తుత్తిదే. టీవీ చానల్ చరిత్రలో గెస్ట్ తనంతట తానుగా వచ్చినా, పిలిస్తే వచ్చినా “గెటౌట్ ఫ్రం ద షో” అని ఏ యాంకరూ అనడం జరగలేదు. నచ్చకపోతే గెస్టులు మైకు పీకేసి పారిపోయిన సందర్భాలైతే ఆసేతుహిమాచలం చాలానే ఉన్నాయి. 

దీనికి కొనసాగింపుగా అదే చానల్లో ప్రధాన వార్తలో కూడా ఈ వివాదాన్ని సీరియస్ కోణంలో చెప్పడం కూడా టీఆర్పీ ఆటలో భాగమే. 

మొత్తానికి ఇదంతా “దూకుడు” సినిమాలో మహేష్ బాబు వేసినలాంటి రియాలిటీ షో ట్రాప్. అందులో చాలామంది ఆడియన్సే పడ్డారు. 

ఈ మొత్తం ఎపిసోడులో అందరికంటే అమాయకుడు ఎవరంటే ఆ టైములో ఆ షోలో కూర్చున్న త్రిపురనేని చిట్టి. జరుగుతున్నదేంటో తెలియక కాసేపు, అంతా నిజమే అనుకుంటూ కాసేపు అయోమయంగా కనిపించింది ఆయనే. అదే..'”దూకుడు” లో బ్రహ్మానందం టైపులో అన్నమాట. 

రియాలిటీ షో అయితేనేం..జనానికి మాత్రం ఫుల్ డోస్ వినోదం దక్కింది. టీవీ చానల్ కి టీఆర్పీ పెరిగింది. విష్వక్సేన్ సినిమా ఒకటొస్తోందని జనానికి తెలిసింది. అలా అందరికీ అన్నీ దక్కేసాయి. రేపు విడుదలయ్యే ఆ సినిమా ఎలా ఉండబోతున్నా ప్రీ రిలీజ్ పబ్లిసిటీ మాత్రం బ్లాక్ బస్టరన్నట్టు. 

డి. సుబ్రహ్మణ్యం