ప్రతి హత్య వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఫలానా వ్యక్తి హత్య వలన ఎవరికి ఉపయోగం అన్న దానిపై నేరపరిశోధన మొదలౌతుంది. ఒకవేళ హంతకుడు తనంతట తానే అప్రూవర్ గా మరితే అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ కేసుల్లో కథ అంతటితో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
పూరీ జగన్నాథ్ తీసిన “టెంపర్”లో చూసాం. రేపిష్టులు సాక్ష్యాధారాలని తారుమారు చేసి తప్పించుకోబోతే హీరోయే కోర్టులో తాను కూడా ఆ క్రైం లో భాగమని, అందరం కలిసే చేసామని చెప్పి అప్రూవర్ గా అవతారమెత్తి అందరికీ శిక్షపడేలా చేస్తాడు. అప్రూవర్ చెప్పిన దానికి అంత విలువుంటుంది.
కానీ వివేకానందరెడ్డి హత్య విషయంలో చాలా చిత్రాలు జరుగుతున్నాయి. తానే పథకం ప్రకారం ఎర్ర గంగిరెడ్డి చెప్పిన మేరకు మరికొందరితో కలిసి గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపానని చెప్పిన దస్తగిరి ప్రస్తుతం బయటే ఉన్నాడు. అతను హత్య చేసినట్టు పోలీసులకి చెప్పినా కూడా వెంటనే అరెస్ట్ చెయ్యలేదు. ఇంటికి పంపేసి, మళ్లీ మళ్లీ రమ్మని చెప్పి ఒక్కో సారి ఒక్కో వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. వెనుక పెద్ద వ్యక్తులున్నారని చెప్పిన దస్తగిరి, తర్వాత క్రమంలో ఆ పెద్ద వ్యక్తుల పేరు చెప్పమంటే భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి దగ్గర ఉండే శంకర్ అనే పేరు చెప్పాడు. అదే నిజమైతే శంకర్ మోటివ్ ఏమయ్యుంటుంది? అదలా ఉంచుదాం.
దస్తగిరి అండ్ కో వివేకాని గొడ్డలితో దాడి చేసి బీరువాలో రౌండ్ స్టాంప్ ఉన్న కొన్ని డాక్యుమెంట్లను దొంగిలించామని చెప్పాడు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్ళొద్దని వివేకా అరుస్తుంటే గొడ్డలితో చేతి మీద కూడా నరికానని, అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నాక బాత్రూములోకి లాక్కెళ్లి రాక్షసంగా నరికేసామని చెప్పాడు. ఇంతకీ ఆ డాక్యుమెంట్లు ఏవిటి? ఇంతవరకు సీబీయై కూడా ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు? ఆ డాక్యుమెంట్లే హత్యకు కారణమైతే మోటివ్ ఎవరిది? ఇది కూడా అలా ఉంచుదాం.
హత్యకి ముందు వివేకా స్వదస్తూరితో ఒక లేఖ రాసారట. హత్య తర్వాత అది ఆయన గదిలో దొరికిందని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి (సునీతారెడ్డి కి భర్త అయిన వివేకా అల్లుడు) వాట్సాపులో పంపాడట వివేకా పీ.ఏ. ఆ లెటర్ ని ఎవ్వరికీ చూపించొద్దని, భద్రంగా మాత్రం దాయమని చెప్పారట సునీతారెడ్డి దంపతులు. ఇంతకీ అందులో ఉన్నదేంటంటే తనని డ్రైవర్ ప్రసాద్ చావబాదాడని, అతన్ని ఊరికే వదలొద్దని ఉందట. అది వివేకా స్వదస్తూరేనని సునీతారెడ్డి చెప్పినా, ప్రసాద్ చాలా మంచివాడని అతను ఆ పని చెయ్యడని ఘటాపథంగా చెబుతూ ఇప్పటికీ అతనికి అండగానే ఉంది ఆమె. ఇదేం ట్విస్టు? ఇంతకీ ఆ లేఖ రాసిందెవరు? ఎవరో హత్య చేసి డ్రైవర్ మీదకు తోసే ప్రయత్నమా? మరి అది వివేకా దస్తూరేనని సునీత ఎందుకు చెప్పింది? డ్రైవర్ ప్రసాద్ ని ఎందుకు వెనకేసుకొస్తోంది? ఇది ఇంకొక మిస్టరీ. దీనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి ఆ రౌండ్ సీల్ డాక్యుమెంట్ల కథలోకి వెళ్దాం.
వివేకాకి షేక్ షమీం అని రెండవ భార్య ఉంది. ఆమె ద్వారా చిన్న కొడుకు కూడా ఉన్నాడు. వాళ్లని సెటిల్ చెయ్యడానికి వివేకాకి డబ్బు అవసరమైంది. కానీ ఆస్తినంతా ఇలా కొత్త బంధాలకి ధారపోసే ప్రమాదముందని తెలిసి సునీత దంపతులు ఆయన చెతిలో ఎక్కువ డబ్బు ఉండకుండా టైట్ చేయడం మొదలుపెట్టారట (నాగార్జున యాదవ్ చెప్పిన ప్రకారం).
వివేకాకి కావల్సిన మొత్తం 8 కోట్లు. ఆ డబ్బుకోసం వాకబు చేస్తే బెంగళూరు నుంచి ఒకతను వచ్చాడట. ఎలహంకలో 80 కోట్లు విలువచేసే పొలముందని, దానికి అతను పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పాడట. అయితే తనని పక్కన పెట్టి వేరే వాళ్లు అమ్మేసుకున్నారు, దానిని కనుక తన పేరున రిజిష్టర్ చేయించగలిగితే తాను 8 కోట్లు ఇస్తానని చెప్పాడట. దాంతో వివేకా తన పలుకుబడిని వాడుకుని ఆ ప్రాంతం ఎమ్మెల్యే వద్దకు వెళ్లాడట. ఆ ఎమ్మెల్యే అంతా చూసి ఆ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఫేక్ కనుక తానేమీ చెయ్యలేనని చెప్పాడట.
అయినా అవసరం తీరని వివేకా అదే పనిమీద కర్ణాటక హోం మంత్రిని కూడా కలిసాడట. అక్కడా డాక్యుమెంటు ఫేక్ కావడంతో పని జరగలేదు. దాంతో ఆ వ్యక్తి ఇదంతా కాదని ఆ డాక్యుమెంటుని బ్యాంకులో పెట్టి లోన్ తెస్తానని దాంతో పనైపోతుందని, అయితే ఆ పని జరగడానికి తనకొక పాతిక లక్షలు కావాలని చెప్పాడట. చేతిలో డబ్బులేని వివేకా తన ఊరిలోనే తెలిసినతని దగ్గర తీసుకుని విడతల వారీగా ఆ డబ్బుని అందజేసాడు. కొన్నాళ్లు ఆగినా ఆ పనీ జరగలేదు. పని జరగని కారణంగా మొత్తానికి ఆ పాతిక లక్షలు వెనక్కి వచ్చేసినా తన రెండవభార్య మరియు కుమారుడికి ఏదో ఒకటి చెయ్యడం కోసం తన యావదాస్తిలో 25% చెందాలని వీలునామా రాసారట వివేకా. ఆ వీలునామా డాక్యుమెంట్లనే ఎర్ర గంగిరెడ్డి చెప్పగా దస్తగిరి వివేకాని చంపి తీసుకెళ్లాడని ఒక ప్రధానమైన అభియోగం. అదే నిజమైతే హత్యకు మోటివ్ ఎవరిదై ఉండొచ్చు? అది ఇంకొక ట్రాక్.
ఇలా నానా రకాలైన ట్రాకులతో అందర్నీ అనుమానించేలాగ “అవే కళ్లు” సినిమా టైపులో సాగుతోంది వివేకా హత్య కేసు విచారణ. ఇందులో సీబీయై కూడా కొన్ని విషయాలపై ప్రశ్నలు అడగకపోవడాన్ని సైతం అనుమానాస్పదంగా చూసేలా ఉందని మరొక ఆరోపణ.
ఈ మొత్తంలో తెదేపా వాళ్లు చేసే ఆరోపణ ఒక్కటే. కడప ఎంపీ సీటు కోసం తనకు అడ్డొస్తున్నాడని అవినాష్ రెడ్డే హత్య చేయించేసాడని. నిజానికి ఇలా కేవలం ఎంపీ సీటు కోసమో, ఎమ్మెల్యే సీటు కోసమో హత్యలు చేసుకుంటూ పోతే అసలు ఎవరూ మిగలరు. అయినా ఇంతవరకు ఎక్కడా కూడా అవినాష్ పై వీళ్ల ఆరోపణలే తప్ప లీగల్ గా అతన్ని భాగం చేయడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఉండుంటే చంద్రబాబు హయాములో జరిగిన ఈ హత్య కేసులో అవినాష్ ని వదిలేవాడా?
నాగార్జున యాదవ్ ఈ రోజు ఆర్జీవీ టాక్ షోలో చెప్పినదేంటంటే పవర్ లో ఉన్నా లేకపోయినా వ్యవస్థల్లో తన స్లీపర్ సెల్స్ ని నడిపేది చంద్రబాబు మాత్రమేనని, 1996లో తెదేపా అనేది అసలు ఎన్.టి.ఆర్ కే చెందదని సైకిల్ గుర్తుతో సహా తన పేరు మీదకు న్యాయస్థానం సాక్షిగా బదిలీ చేయించుకున్న ఘనుడు చంద్రబాబని, అతనికి హత్యకేసులతో ఆడుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చనే విధంగా అతని అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఇది రాజకీయపరమైన ఆరోపణకి ప్రత్యారోపణ అనుకోవచ్చు. కానీ సీబీయై వైఖరి కూడా అనుమాస్పదంగా ఉండడం వల్ల ఎవరు నడిపితే ఎవరు నడుస్తున్నారు, అసలు ఎవరి మోటివ్ ఏమిటన్నది గందరగోళంగా ఉంది.
ఇదే కథని వెబ్ సిరీస్ గా చేస్తే “నార్కోస్”, “పాతాళ్ లోక్” లాంటివి ఎందుకూ పనికిరావు. ఇన్ని పాత్రలతో, ఇన్ని అనుమానాలతో, ఇంత హై ప్రొఫైల్ హత్య కేసు ఇన్ని మలుపులు తిరగడం ఆశ్చర్యం. మామూలు రచయిత ఇలా రాయలేడు. విధిరాత కాబట్టే మానవమాత్రులకి ఊపిరిసలపనంత ఉత్కంఠగా ఉంది. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆపేయకుండా దీనిని ఓటీటీ కి ఎక్కిస్తాడేమో చూడాలి.
హరగోపాల్ సూరపనేని