హుజూరాబాద్ ఎన్నికల వేళ దొరికిపోయిన కేసీఆర్

తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం విషయంలో కేసీఆర్ ని శంకించేవారు లేరు, టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపేవారు లేరు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మాత్రం కేసీఆర్ అమాంతం ఏపీ ప్రజల ఆత్మబంధువుగా మారిపోతారు.  Advertisement…

తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం విషయంలో కేసీఆర్ ని శంకించేవారు లేరు, టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపేవారు లేరు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మాత్రం కేసీఆర్ అమాంతం ఏపీ ప్రజల ఆత్మబంధువుగా మారిపోతారు. 

అప్పటివరకూ ఆంధ్రోళ్లు, సెటిలర్లు.. అన్న నోరు కాస్తా అప్పటికప్పుడు మనోళ్లు, కాలిలో మల్లు నోటితో తీస్తా లాంటి డైలాగులు అనేస్తుంది. ఆ తర్వాత కథ మామూలే. కానీ ఈసారి పక్కాగా కేసీఆర్ ని ఇరికించాలనుకుంటున్నాయి ప్రతిపక్షాలు. పరోక్షంగా ఏపీ సీఎం జగన్ ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పై తుపాకీ ఎక్కుపెట్టారు రేవంత్ రెడ్డి.

తూటా నెంబర్-1

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకల్లో తెలంగాణ తల్లికి బదులు కొన్ని ఫ్లెక్సీల్లో తెలుగు తల్లి బొమ్మ పెట్టారనేది ప్రధాన ఆరోపణ. తెలంగాణ తల్లిని కేసీఆర్ అవమానించారని రేవంత్ రెడ్డి సహా.. టీడీపీతో పాటు రేవంత్ రెడ్డిని కూడా సపోర్ట్ చేసే ఓ వర్గం మీడియా తీవ్ర విమర్శలు చేసింది. 

అప్పుడు తెలుగు తల్లిని వద్దన్న కేసీఆర్, ఇప్పుడెందుకు కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అయితే అదేదో ఫ్లెక్సీ మేకర్ల మిస్టేక్ అని తేలడం, టీఆర్ఎస్ నేతలెవరూ దానిపై స్పందించకపోవడంతో ఆ తూటా మిస్ ఫైర్ అయింది.

తూటా నెంబర్-2

అదే ప్లీనరీలో కేసీఆర్ నోరు జారారు. ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టమంటూ కొంతమంది ఆహ్వానించారని గొప్పలు చెప్పుకున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది.. తెలంగాణ గొప్పలు చెప్పుకునే క్రమంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి వంక పెట్టారు. దీంతో చంద్రబాబు చంకలు గుద్దుగుంటూ బయటికొచ్చారు. 

నేనే కాదు, పక్క రాష్ట్ర సీఎం కూడా ఏపీలో పరిస్థితి బాగోలేదని అంటున్నారని సెటైర్లు పేల్చారు. అక్కడితో ఎపిసోడ్ ఆగలేదు. కేసీఆర్ కి, పనిలో పనిగా చంద్రబాబుకి కూడా జగన్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఏపీలో పార్టీ పెట్టడం ఎందుకు అసలు రెండు రాష్ట్రాల్ని కలిపేస్తే పోలా అంటూ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని గట్టిగా బదులిచ్చారు. దీంతో కేసీఆర్ ఎరక్కపోయి ఇరుక్కున్నట్టయింది.

పేర్ని నాని కౌంటర్ కి సహజంగా టీఆర్ఎస్ స్పందిస్తే అదో రకం. కానీ ఇక్కడ నాని వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెలరేగిపోతున్నారు. మొన్న ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షమైందని, ఈరోజు పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తెచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. సమైక్య రాష్ట్ర ప్రతిపాదన అనేది కేసీఆర్, జగన్ ఉమ్మడి కుట్రగా అభివర్ణించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలి ఇచ్చే కుట్ర జరుగుతోందని తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న స్వాభిమానాన్ని ఎవరూ కాదనలేరు కానీ.. ఏపీలో ఆయన పార్టీ పెట్టాలనుకోవడం ఏ రకమైన ప్రాంతీయాభిమానం. గొప్పల కోసం తిప్పలు పడ్డ కేసీఆర్ ఇప్పుడు నిజంగానే జగన్ టీమ్ ఇచ్చిన కౌంటర్ తో కష్టాలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ తెలంగాణను బలిచ్చేందుకు సైతం వెనకాడబోరంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.