ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా చెప్పినట్టు సగం పాలన పూర్తయిన నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 11న నూతన మంత్రివర్గం కొలువుతీరుతుందనే ప్రచారం జరుగుతోంది. 90 శాతం మంత్రి వర్గాన్ని మార్చనున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు? కొనసాగే మంత్రులెవరనే విషయమై విస్తృత చర్చ జరుగుతోంది.
ఏప్రిల్ 4న కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమవుతుండడంతో, ఏఏ జిల్లాల నుంచి ఎవరెవరిని అమాత్య పదవి వరిస్తుందనే చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఒక్కో జిల్లా నుంచి ఇద్దరికి పైనే పేర్లు వినిపిస్తున్నాయి. ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండడం, మరోవైపు 25 మందికి మాత్రమే మంత్రి పదవులు కల్పించే అవకాశం నేపథ్యంలో …నూతన కేబినెట్ కూర్పు జగన్‌కు పెద్ద టాస్కే అని చెప్పక తప్పదు.
మంత్రి వర్గ విస్తరణపై స్వపక్షమే కాదు విపక్షాలు కూడా ఆసక్తికనబరచడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పదవులు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తికి లోనై తమవైపు వస్తారనే ఆశ ప్రతిపక్ష పార్టీల్లో ఉంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఎంత త్వరగా జరిగితే, అంత వేగంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వస్తారనే ధీమా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో ఉంది. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు బలమైన నాయకత్వం లేదు.
జగన్‌పై అసంతృప్తి కారణంగానైనా అటు వైపు నుంచి తమ వైపు రాకపోతారా అనే నమ్మకం లేకపోలేదు. మరీ ముఖ్యంగా సర్వే ఆధారంగా కూడా 2024లో టికెట్లు కేటాయిస్తానని జగన్ చెప్పడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది. ఇలా అనేక అంశాలు జగన్‌కు సొంత పార్టీ నేతలను దూరం చేస్తుందనే నమ్మకం ప్రతిపక్షాల్లో ఉంది. రానున్న కాలంలో ఏం జరుగుతుందో మరి!