టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ ఆర్థిక వ్యవహారాలపై ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు… ఆర్థిక శాఖలోని ముగ్గురు ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఏపీ ఆర్థిక విషయాలను ఎల్లో మీడియాకు లీక్ కావడాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది.
ఈ నేపథ్యంలో కీలక ఆర్థిక సమాచారాన్ని లీక్ చేశారని భావిస్తూ ఆర్థికశాఖలోని సెక్షన్ అధికారులు డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్ల ఖర్చులకు లెక్కలు లేవని ఇటీవల పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఏపీలో ఏదో జరిగిపోతోందన్న అనుమానాలు వ్యాప్తి చెందడానికి కేశవ్ ఆరోపణలు దోహదపడ్డాయి. పయ్యావుల ఆరోపణలకు సమాధానం చెప్పుకోడానికి ప్రభుత్వం నానా తంటాలు పడాల్సి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.41,043 కోట్ల వ్యయానికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవని, వాటిని వివిధ పద్దుల్లోకి మార్చేశారని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా కేశవ్ ఫిర్యాదు చేశారు. అసలే అప్పులపై నెట్టుకొస్తున్న ప్రభుత్వంపై జనాల్లో నెగెటివ్ ఏర్పడ్డానికి పయ్యావుల కేశవ్ ఆరోపణలు అగ్గికి ఆజ్యం పోసినట్టైంది.
దీంతో పాటు ఉద్యోగుల వేతనాలకు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే జమ చేశారనే కీలక సమాచారం లీక్ కావడంపై ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఆర్థిక సమాచారం లీక్ కావడంపై అంతర్గత విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్. సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు బాధ్యులుగా ప్రభుత్వం గుర్తించింది.
అనంతరం ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం లీకు వీరులకు ఓ హెచ్చరిక పంపడం గమనార్హం. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశించింది.