కడప జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డిని కరోనా బలి తీసుకొంది. హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. శ్రీకాంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తగానే కాకుండా రాజకీయ నేతగా, సేవాతత్పరుడిగా, రాయలసీమ గొంతుకగా సుపరిచితుడు.
2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరపున కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఇదే ఆయన రాజకీయ ప్రవేశానికి తొలి మెట్టు. అప్పట్లో ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పాలెం శ్రీకాంత్‌రెడ్డి బరిలోకి దిగారు. పాలెంపై వైఎస్ జగన్ 1,78,846 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ మొదటి సారి ఎన్నికలో బరిలో శ్రీకాంత్‌రెడ్డిపై పోటీ చేయడం గమనార్హం.
పాలెం శ్రీకాంత్‌రెడ్డి కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె అనే చిన్న గ్రామవాసి. ఆయన తండ్రి జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. చెన్నకేశవరెడ్డి జీవించి ఉండగానే ఆయన విగ్రహాన్ని కడపలో జియాన్ కాలేజీ ఎదురుగా ప్రతిష్టించడం విశేషం. శ్రీకాంత్‌రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం పీసీరెడ్డి ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పడే వారు.
2009లో ఓటమి అనంతరం ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాయలసీమ సమస్యలపై సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి తపించేవారు. కొంత కాలం క్రితం మోడరన్ రాయలసీమ పేరుతో సంస్థను స్థాపించి రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా తిరిగారు. ఆయన మరణం రాయలసీమకు, పేద విద్యార్థులకు తీరని లోటని చెప్పొచ్చు.