తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒక నియోజకవర్గం కావాలనే మాట వినిపిస్తూ ఉంది. పుట్టపర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పల్లె. గత ఎన్నికల్లో విజయం గ్యారెంటీ అనే ధీమాతో పోటీ చేశారు కానీ, ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజయంతో పల్లె మాజీ ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి చాలా మంది తెలుగుదేశం నేతల్లాగనే పల్లె అంత యాక్టివ్ గా లేరు.
పార్టీ, పార్టీతో పాటు తాము ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవ్వరూ కిమ్మనడం లేదు. ఏదో కొద్ది స్థాయిలో క్యాడర్ తో మాత్రం టచ్ లో ఉంటూ, అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ తమ ఉనికిని చాటుకునే యత్నం చేస్తున్నారు. ఎలాగూ అనుకూల మీడియా ఉంది కాబట్టి.. ఎలాగోలా వీరి పేర్లు పత్రికల్లో, మీడియాలో కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ఇదే మూడేళ్లుగా పల్లె చేసిన రాజకీయం కూడా!
ఆ సంగతలా ఉంటే.. పల్లెకు నియోజకవర్గంలో అసమ్మతి వర్గం తయారైంది. ఆ మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోని తన సహచరులపై విరుచుకుపడ్డారు. అలా జేసీ టార్గెట్ కు గురయ్యారు పల్లె కూడా. ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లెకు వ్యతిరేకంగా కొంతమంది యాక్టివ్ అయ్యారు.
ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పల్లె పెద్దగా ప్రజలను పట్టించుకున్నదీ లేదు. నియోజకవర్గంపై పట్టు కోల్పోవడం, మరోవైపు అసంతృప్త క్యాడర్ .. ఇలాంటి నేపథ్యంలో పల్లె పుట్టపర్తి నుంచి తట్టాబుట్ట సర్దుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
గతంలో ఈయన నల్లమాడ నియోజకవర్గం ఎమ్మెల్యే. పునర్విభజన సమయంలో నల్లమాడ నియోజకవర్గం రద్దు అయ్యింది. గోరంట్ల నియోజకవర్గం కూడా అదే సమయంలో రద్దు అయ్యింది. గోరంట్ల నియోజకవర్గంలోని కొంత భాగం, నల్లమాడ నియోజకవర్గంలోని మరి కొంత కలిసి.. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది.
ఇలా సొంత మండలం పుట్టపర్తిలో భాగం కావడంతో పల్లె పుట్టపర్తి నుంచి పోటీ చేశారు. అయితే పాత నల్లమాడ నియోజకవర్గంలోని కొంత భాగం కదిరి లో కూడా భాగం అయ్యింది. దీంతో.. ఇప్పుడు పల్లె పాత పరిచయాలతో కదిరి వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతూ ఉంది.
పుట్టపర్తిలో అనుకూల పవనాలు లేకపోవడంతో.. ఈయన కదిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. అయితే అక్కడ కూడా వర్గాలకు లోటు లేదు. కందికుంట వెంకట ప్రసాద్, చాంద్ భాషా వంటి వర్గాలున్నాయి. ఇలాంటి చోటకు పల్లె ఎంట్రీ ఇస్తే టికెట్ దక్కుతుందా? అనేది ప్రశ్నార్థకమే.
అయితే పల్లె పుట్టపర్తిలోనే కాదు, మరెక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని, ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదనే టాక్ కూడా వినిపిస్తోంది!