ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలపై నేటితో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 3,249 పంచాయతీలకు గానూ.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తి కానుంది. వీటికి గానూ దాదాపు 20 వేల నామినేషన్లు దాఖలు అయ్యాయి. సుమారు వెయ్యికి పైగా నామినేషన్లు పరిశీలన దశలో తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన నామినేషన్ల లో 18 వేలకు పైగా పోటీలో ఉన్నట్టే.
అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంతమంది అభ్యర్థులు చివరి నిమిషంలో వెనక్కు తగ్గే అవకాశం ఉండేదీ స్పష్టత రానుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో.. ఏకగ్రీవాలకు ఏ మేరకు అవకాశం ఉందో నేటితో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కేవలం ఒకే నామినేషన్ దాఖలు అయిన పంచాయతీలను, ఒకే నామినేషన్ మిగిలిన పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టుగా ప్రకటించే అవకాశం ఉంది. వీటి పట్ల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఏకగ్రీవాలను చూస్తూ వదిలేది లేదన్నట్టుగా ఆయన స్పందిస్తూ ఉన్నారు.
అయినప్పటికీ ఇప్పటి వరకూ 100 వరకూ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఒకే నామినేషన్ దాఖలు అయిన పంచాయతీలు అవి. ఇక నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంలో గ్రామస్తుల్లో రాజీ చర్చలు జరిగి.. మరి కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ అతిగా స్పందించినా… ప్రజలు మాత్రం ఏకగ్రీవాలకు మొగ్గు చూపడం మరీ వింత అయితే కాదు. ప్రజాస్వామ్యంలో ఆ మాత్రం రాజీ ధోరణి కూడా ఉంటుంది.