పవర్‌స్టార్‌గా పేరొందిన జనసేనాని పవన్‌కల్యాణ్…సినిమాల్లో ఓ పే….ద్ద హీరో. దీన్ని ఎవరూ కాదనలేరు. ఆయనకు లక్షలాది మంది అభిమానులున్నారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టారు. లక్షలాది మంది జనసైనికులున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన పవన్….ఇటీవల సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడూ అలా వచ్చి…జగన్‌కు రెండు హెచ్చరికలు పంపి వెళుతుంటాడు. ఆ తర్వాత మళ్లీ ఏ అమావాస్యకో కనిపిస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో వణికిపోతున్నారు. కరోనాపై కనీస స్పందన కూడా పవన్ నుంచి లేదు.
కానీ అందరూ హేళనగా మాట్లాడే కేఏ పాల్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా తన వంతు సాయం అందించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. కేఏ పాల్ కూడా ప్రజాశాంతి అనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో పాల్ కామెడీ లేకపోతే జనం ఏమయ్యేవారో అని జోక్స్ వేసుకున్నారు.
తాజాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, దాన్ని అరికట్టేందుకు తన వంతు సాయం అందిస్తానని, తన సేవలు వినియోగించుకోవాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశాడు. కరోనా బాధితుల చికిత్స నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డిలో 300 పడకల సామర్థ్యం ఉన్న చారిటీ సిటీని, అలాగే ఏపీ ప్రభుత్వం విశాఖలో 100 పడకల గదులున్న చారిటీ సిటీని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వీటిని స్వచ్ఛందంగా వాడుకోవచ్చని ఆయన సూచించాడు.
సమాజం ఒక పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్న క్రమంలో దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. అలాంటి బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకున్న కేఏ పాల్ నిజమైన హీరో అని చెప్పక తప్పదు. సమాజం, సంక్షేమం…అంటూ ఎక్కువగా జనసేనాని పవన్‌కల్యాణ్ మాట్లాడుతుంటారు. పవన్‌కల్యాణ్ తెలుగు గడ్డపై ఉంటున్నాడు. ఇదే కేఏ పాల్ మాత్రం ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలో ఉన్న ఆయన…తన ప్రజల గురించి ఆలోచించడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాడు. కానీ పవన్‌కల్యాణ్ లక్షలాది మందికి ఆరాధ్య హీరో అయినప్పటికీ, చారిటీస్‌లో మాత్రం జీరో అనిపించుకున్నారనే విమర్శలు లేకపోలేదు.