‘అమరావతిలోనే రాజధాని’ పట్టింపు పవన్‌కు లేదా?

రాజధాని రచ్చ నేపథ్యంలో అన్ని పార్టీల్లో నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధినాయకత్వాలు ఓ విధానం తీసుకున్నప్పటికీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైకాపాలో అధిష్టానం, ప్రభుత్వం స్పష్టమైన స్టాండ్‌ తీసుకున్నప్పటికీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు…

రాజధాని రచ్చ నేపథ్యంలో అన్ని పార్టీల్లో నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధినాయకత్వాలు ఓ విధానం తీసుకున్నప్పటికీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైకాపాలో అధిష్టానం, ప్రభుత్వం స్పష్టమైన స్టాండ్‌ తీసుకున్నప్పటికీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

టీడీపీ అధిష్టానం అమరావతి స్టాండ్‌ తీసుకున్నప్పటికీ పార్టీలోని నాయకులు ప్రాంతాలవారీగా చీలిపోయారు. తాజాగా రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరిపోయాడు. పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వేటు పడుతుంది కాబట్టి నేరుగా కాకుండా పరోక్షంగా పార్టీకి దూరమైపోయాడు. 

టీడీపీ ఉత్తరాంధ్ర నాయకులు విశాఖను రాజధానిగా అంగీకరించారు. బీజేపీ నాయకుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఢిల్లీ నాయకత్వం స్టాండ్‌ ఏమిటో తెలియదుగాని ఏపీ నాయకులు తలా ఓ మాట మాట్లాడుతున్నారుబీజేపీ రాజ్యసభ సభ్యడు సుజనా చౌదరి అమరావతి నుంచి అంగుళం కదిలించడానికి వీల్లేదని, కేంద్రంతో మాట్లాడాకే తాను ఈ మాట చెబుతున్నానని చెప్పగా, మరో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజధాని విషయంలో కేంద్రం కల్పించుకోదని, దీంతో కేంద్రానికి సంబంధం లేదని, అధికార ప్రతినిధిగా చెబుతున్నానని అన్నాడు.

రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణేమో అమరావతిని సమర్థిస్తున్నాడు. కేంద్ర పార్టీ అనుమతితోనే ఆయన మౌన దీక్ష చేశాడని కొందరు నాయకులు చెబుతున్నారు.రాజధాని  రచ్చ మొదలైనప్పటినుంచి, అమరావతిలో రైతులు, ప్రజలు ఉద్యమం మొదలుపెట్టినప్పటినుంచి రాష్ట్రంలో లేని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొన్నీమధ్యనే విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చాడు.

నిన్న పార్టీ విస్తృత సమావేశం నిర్వహించాడు. రాజధాని రగడ మీద మాట్లాడాడు. మరి ఈయన ఏం చెప్పాడు? రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. వారికి అండగా నిలుస్తానన్నాడు. కాని 'రాజధాని అమరావతిలోనే ఉండాలి' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పలేదు. రాజధానిని కదలించవద్దు అని గట్టిగా చెప్పలేదు. అలాగని విశాఖపట్టణాన్ని సమర్థించలేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లు గట్టిగా అమరావతి స్టాండ్‌ తీసుకోలేదు. సీఎం జగన్‌ తీసుకున్నట్లు విశాఖపట్టణం స్టాండ్‌ తీసుకోలేదు. 

జనసేనను టీడీపీ మిత్రపక్షంగా వైకాపా నాయకులు చెబుతుంటారు. విమర్శలు చేస్తుంటారు. బాబు అడుగుజాడల్లోనే పవన్‌ నడుస్తున్నాడని, బాబుకు ఈయన దత్తపుత్రుడని అంటుంటారు. కాని పవన్‌ అమరావతే రాజధానిగా ఉండాలని అనలేదు. 'ఏకాభిప్రాయం సాధించి రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు.

అసమానతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే చేతులు ముడుచుకొని కూర్చోం' అన్నాడు. అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా కాకుండా అన్ని విభాగాలూ ఒక్కచోటనే ఉండాలన్నాడు. కాని  అమరావతిలో ఉండాలని అనలేదు. దీన్నిబట్టి చూస్తే పవన్‌ అమరావతిని పట్టుకొని వేలాడటంలేదని అర్థమవుతోంది. అమరావతిలో ఉద్యమిస్తున్న రైతుల తరపున పోరాటానికి పవన్‌ సిద్ధంగా ఉన్నాడు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పాడు కూడా.

రైతులు ఉద్యమిస్తున్నది అమరావతిలో రాజధాని కోసం. మరి వారికి మద్దతు ఇస్తున్న పవన్‌ కళ్యాణ్‌ వారికి తన స్టాండ్‌ లేదా తన విధానం ఏమని చెబుతాడు? రాజధాని ఎక్కడ పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదన్నాడు కదా. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్‌ తన విధానం నిర్దిష్టంగా చెప్పాల్సిన అవసరముంది.

తాను అమరావతి స్టాండ్‌ తీసుకుంటే ఉత్తరాంధ్రవారికి కోపం వస్తుందని, విశాఖ స్టాండ్‌ తీసుకుంటే కోస్తాంధ్ర, సీమవాసులకు ఆగ్రహం కలుగుతుందని పవన్‌ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఏకాభిప్రాయంతో ఎక్కడో ఒక చోట రాజధాని ఏర్పాటు చేయాలంటున్నాడు. ప్రస్తుత పరిస్థితులను, ప్రభుత్వ వైఖరినిబట్టి చూస్తుంటే రాజధాని పూర్తిగా ఒక్కచోటనే ఉండటం, ఏకాభిప్రాయం సాధించడం సాధ్యం కాదనిపిస్తోంది. మరి పవన్‌ ఏవిధంగా ఉద్యమిస్తాడో చూడాలి.